Ramayana: రామరావణ యుద్ధం తరువాత శూర్పణక ఏమైంది... హనుమంతుడు ఎలా సంహరించాడో తెలిస్తే ఆశ్చర్యపోతారు

రామరావణ యుద్ధానికి కారణమైన శూర్పణక యుద్ధం తరువాత ఏమైందో చాలా మందికి తెలియదు. అన్న మరణానికి, లంక వినాశనానికి కారణమైన రాముడిపై పగను తీర్చుకోవడానికి అయోధ్యకు వెళ్తుంది. అక్కడేం జరిగిందో తెలుసుకుందాం.

Balachander
Published on: 16 July 2026 3:56 PM IST
Ramayana: రామరావణ యుద్ధం తరువాత శూర్పణక ఏమైంది... హనుమంతుడు ఎలా సంహరించాడో తెలిస్తే ఆశ్చర్యపోతారు
X

Ramayana: రామాయణ మహాకావ్యంలో సీతాపహరణానికి, తద్వారా రావణ వధకు మూలకారణం శూర్పణక ముక్కుచెవులు కోయబడటమేనని మనందరికీ తెలుసు. అయితే, లంకా యుద్ధం ముగిసి, శ్రీరాముడి పట్టాభిషేకం జరిగిన తర్వాత ఈ శూర్పణక ఏమైందనే రహస్యం చాలామందికి తెలియదు. రామరావణ యుద్ధం ముగిసిన అనంతరం ప్రాణభయంతో లంకను వీడి పారిపోయిన శూర్పణక, తన అన్నలను చంపిన రాముడిపై పగతో రగిలిపోతూ అడవుల్లో దాక్కుంది. కాలక్రమేణా మాయా రూపంలో అయోధ్యకు చేరి, ఒక చాకలి జంటగా నటించి, సీతమ్మపై లేనిపోని అపవాదులు సృష్టించి సీతారాముల ద్వితీయ వియోగానికి కారణమైంది ఈ శూర్పణక, రావణుడి మరో తమ్ముడైన కరాళ కంఠుడే! ఈ భయంకరమైన కుట్రను తెలుసుకున్న భక్త హనుమంతుడు ఆకాశమార్గంలో వచ్చి వీరిద్దరినీ ఎలా సంహరించాడో, ఆశ్చర్యకరమైన ఆధ్యాత్మిక సత్యాలను ఇప్పుడు తెలుసుకుందాం.

సీతారాముల ఎడబాటు వెనుక ఉన్న రాక్షస మాయాజాలం

రామరావణ యుద్ధంలో లంక సర్వనాశనమయ్యాక, శూర్పణకతో పాటు రావణుడికి ఉన్న సోదరుడు 'కరాళ కంఠుడు' కూడా ప్రాణాలతో తప్పించుకుని అడవుల్లోకి పారిపోయాడు. రాముడిపై పగ తీర్చుకోవడానికి వీరిద్దరూ చేతులు కలిపారు. అయోధ్యలో శ్రీరాముడి రామరాజ్యం సాగుతున్న కాలంలో, వీరు మాయా రూపాలు ధరించి భార్యాభర్తలుగా నటిస్తూ నగరంలో తిరిగారు. లోకోక్తంగా మనం చెప్పుకునే ఆ చాకలి నింద నిజానికి సాధారణ మనుషులు చేసింది కాదు. సీతారాములను వేరు చేయడానికి ఈ ఇద్దరు రాక్షసులు పన్నిన మాయా వ్యూహం. దీనివల్ల సీతమ్మ రెండోసారి అడవుల పాలై, వాల్మీకి ఆశ్రమానికి వెళ్లాల్సి వచ్చింది.

హనుమంతుని విశ్వరూపం... శూర్పణక అంతం

సీతమ్మ దూరమై రాముడు శోకసంద్రంలో మునిగిపోవడం చూసి ఈ రాక్షస జంట ఆనందించింది. అంతటితో ఆగక, శ్రీరాముడు తలపెట్టిన అశ్వమేధ యాగ అశ్వాన్ని చంపి, రాముడిని మరింత అవమాన భారంతో కృంగిపోయేలా చేయాలని ఓ అడవిలో రహస్యంగా పథకం రచించసాగారు. అదే సమయంలో యాగాశ్వానికి రక్షణగా ఆకాశ మార్గంలో వాయువేగంతో వెళ్తున్న హనుమంతుడు, సూక్ష్మరూపంలో ఒక చెట్టుపై చేరి వీరి సంభాషణను విన్నాడు.

పర్వత ఘాతం ... లోకకల్యాణం

తాము చేసిన మాయాకృత్యాల వల్లే సీతారాములు విడిపోయారని, హనుమంతుడు లేని సమయం చూసి యాగాశ్వాన్ని సంహరించాలని వారు మాట్లాడుకోవడం విన్న ఆంజనేయుడు ఆగ్రహోదగ్రుడయ్యాడు. వెంటనే హనుమ తన సూక్ష్మరూపాన్ని వీడి గగనమంత 'విశ్వరూపాన్ని' దాల్చాడు. ఆ రౌద్ర రూపంతో అక్కడికక్కడే ఒక మహా పర్వతాన్ని చేతులతో పెకిలించి, ఆ కొండను శూర్పణక, కరాళ కంఠుడిపై విసిరికొట్టాడు. ఆ దెబ్బకు ఇద్దరు రాక్షసులు అక్కడికక్కడే మరణిస్తారు. ఈ విధంగా రామాయణ శోధనలో మనకు లభించే ఈ అరుదైన ఘట్టం, అధర్మానికి పాల్పడిన వారు భగవంతుని ఆశ్రితుడైన హనుమంతుని చేతిలో ఏనాటికైనా శిక్షించబడక తప్పదనే పరమ సత్యాన్ని చాటిచెబుతోంది.

గమనికః ఈ కథనం వివిధ రామాయణ సంప్రదాయాలు, జానపద కథనాలు, ప్రాంతీయ ఆధ్యాత్మిక విశ్వాసాల ఆధారంగా చెప్పబడినది. ఇది వాల్మీకి రామాయణంలోని ప్రామాణిక ఘట్టం కాదు.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story