How to See God: ఇలాంటి వాళ్లకు మాత్రమే భగవంతుడు కనిపిస్తాడట...పెద్దలు చెప్పిన సత్యం
భగవంతుడిని దర్శించుకోవాలంటే ఎలాంటి లక్షణాలు ఉండాలి? పంచభూతాలు, ఇంద్రియ నిగ్రహం, అహంకార త్యాగం, నిర్మలమైన మనసు ద్వారా దైవానుభూతి ఎలా కలుగుతుందో తెలుసుకుందాం.
How to See God: భగవంతుడిని చూడాలంటే ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు.. ఎన్నో పూజలు, యాగాలు చేయాల్సిన అవసరమూ లేదు. నిర్మలమైన మనసు, ప్రశాంతమైన ఆలోచనలు, అహంకారం లేని జీవితం ఉంటే చాలు.. దైవానుభూతి మనలోనే కలుగుతుందని పెద్దలు చెబుతుంటారు. అయితే దేవుడిని నిత్యం పూజించే ప్రతి ఒక్కరికీ ఆ అనుభూతి ఎందుకు కలగదు? విగ్రహాన్ని చూస్తూ ప్రార్థించడం ఒక ఎత్తయితే, అంతరంగంలో భగవంతుడిని దర్శించడం మరో ఎత్తు. ఈ రెండింటి మధ్య ఉన్న తేడాను తెలుసుకోవాలంటే మనలోని ఐదు ప్రాపంచిక బంధాలను అర్థం చేసుకోవాలి.
రూపం దాటి దైవాన్ని చూడగలమా?
సాధారణంగా మనం దేవుడిని ఒక రూపంలోనే ఆరాధిస్తాం. శివుడు, విష్ణువు, అమ్మవారు, గణపతి.. ఇలా ఒక్కొక్కరు ఒక్కో రూపాన్ని మనసులో నిలుపుకొని పూజిస్తారు. భక్తి ప్రారంభానికి ఈ సాకార ఆరాధన ఎంతో ఉపయోగపడుతుంది. ప్రతిరోజూ ఒకే దైవ రూపాన్ని ధ్యానించడం వల్ల మనసు క్రమంగా ఏకాగ్రతను పొందుతుంది. అయితే ఆధ్యాత్మిక తత్వం ప్రకారం భగవంతుడు ఒక రూపానికే పరిమితమైనవాడు కాదు. ఆయనకు ఆద్యంతాలు లేవు. గుణాలు, ఆకారాలు, హద్దులకు అతీతమైన పరబ్రహ్మ స్వరూపుడు. అలాంటి నిర్గుణ తత్వాన్ని కళ్లతో చూడలేం. అంతరంగంలో కలిగే జ్ఞానంతోనే అనుభూతి చెందగలం.
పంచభూతాలకు అతీతంగా ఆలోచించాలి
మన శరీరం పంచభూతాలతో ఏర్పడిందని భారతీయ తత్వశాస్త్రం చెబుతుంది. అవి ఐదు. ఒకటి ఆకాశం. మాటలు, శబ్దాలు మన దృష్టిని బయట ప్రపంచం వైపు మళ్లిస్తాయి. రెండోది వాయువు స్పర్శ. స్పర్శ ద్వారా కలిగే అనుభూతులు మనల్ని బాహ్య ప్రపంచంతో అనుసంధానిస్తాయి. మూడోది అగ్ని, రూపం. కళ్లకు కనిపించే అందం, ఆకర్షణలు మనసును ప్రభావితం చేస్తాయి. నాలుగోది జలం, రసం. రుచులపై ఆసక్తి, ఇంద్రియ సుఖాలపై కోరికలను సూచిస్తుంది. ఐదోది భూమి, గంధం. వాసనతో పాటు స్థూలమైన భౌతిక ప్రపంచానికి సంబంధించిన అనుభూతులను తెలియజేస్తుంది.ఈ ఐదు తత్వాలు మన శరీరానికి, అనుభవాలకు ఆధారం. వీటిని పూర్తిగా నాశనం చేయడం లేదా వదిలేయడం సాధ్యం కాదు. కానీ వీటి పట్ల మనకున్న అతిగా ఉండే మమకారాన్ని తగ్గించుకోవచ్చు. ఇంద్రియాలపై నియంత్రణ సాధించడం ద్వారా మనసును ఆధ్యాత్మిక మార్గంలో నడిపించవచ్చు.
'నేను.. నాది' అనే భావమే అసలైన అడ్డంకి!
దైవానుభూతికి ప్రధానమైన అడ్డంకి మనలోని అహంకారం, స్వార్థం, మమకారం. 'ఇది నాది', 'నేనే గొప్పవాడిని', 'నాకు మాత్రమే అన్నీ దక్కాలి' అనే ఆలోచనలు మనసును సంకుచితం చేస్తాయి. ఇతరుల పట్ల ప్రేమ, దయ, క్షమాగుణం పెరిగినప్పుడు ఈ భావాలు క్రమంగా తగ్గుతాయి. అందుకే పెద్దలు త్యాగం అంటే సంపదను వదిలేయడం మాత్రమే కాదని చెబుతారు. మనలోని చెడు ఆలోచనలను, ద్వేషాన్ని, అహంకారాన్ని వదులుకోవడమే నిజమైన త్యాగం.
దైవదర్శనానికి కావాల్సింది నిర్మలమైన మనసు
ప్రతిరోజూ కొంతసేపు ధ్యానం చేయడం, నామస్మరణ చేయడం, ఇతరులకు సాధ్యమైనంత సహాయం చేయడం, కోపాన్ని అదుపులో ఉంచుకోవడం వంటి చిన్న అలవాట్లు మనసును ప్రశాంతంగా మారుస్తాయి. భగవద్గీతలోనూ నిష్కామ కర్మ, ఇంద్రియ నిగ్రహం, సమభావం వంటి లక్షణాలకు ప్రాధాన్యం ఇచ్చారు. చివరగా తెలుసుకోవాల్సిన విషయం ఒక్కటే.. భగవంతుడిని వెతకడానికి ముందు మనలోని అహంకారాన్ని వెతికి తొలగించుకోవాలి. దేవుడిని ఒక రూపంలో ఆరాధించడం భక్తి అయితే, ప్రతి జీవిలో దైవత్వాన్ని గుర్తించడం ఉన్నతమైన ఆధ్యాత్మిక భావన. మనసు స్వచ్ఛంగా మారినప్పుడు దైవం ఎక్కడున్నాడనే ప్రశ్న కంటే, ప్రతి చోటా దైవత్వాన్ని ఎలా చూడాలనే అవగాహన కలుగుతుంది. అదే పెద్దలు చెప్పిన ఆధ్యాత్మిక సత్యం.




