Mahabharata: కురుక్షేత్ర మహాసంగ్రామ విజేత ఈ కౌరవుడే... మహాభారతంలో విభీషణుడు
రామాయణంలో విభీషణుడు ఉన్నట్టుగానే మహాభారతంలోనూ ఓ విభీషణుడు ఉన్నాడు. కురుక్షేత్ర సంగ్రామంలో పాండవుల పక్షాన నిలిచిన ఏకైక కౌరవ వీరుడు ఎవరో తెలుసుకుందాం.
Mahabharata: మహాభారత సంగ్రామంలో కౌరవులు అనగానే మనకు వెంటనే గుర్తుకువచ్చేది "వంద మంది సోదరులు". కానీ, ధృతరాష్ట్రునికి 101వ పుత్రుడు ఉన్నాడనే విషయం చాలామందికి తెలియదు. ఆయనే యుయుత్సుడు. రామాయణంలో రావణాసురుని తప్పులను నిరసించి శ్రీరాముని పక్షాన నిలిచిన విభీషణుడి లాగే, కురుక్షేత్రంలో కౌరవుల అధర్మాన్ని ఎదిరించి పాండవుల వైపు నిలిచిన మహనీయుడు యుయుత్సుడు. అందుకే ఆయనను 'మహాభారత విభీషణుడు' అని పిలుస్తారు. న్యాయం కోసం స్వంత బంధువులనే వదులుకున్న ఈ ధర్మాత్ముని జీవిత విశేషాలను తెలుసుకుందాం.
జననం ... భిన్నమైన మనుస్తత్వం
గాంధారి కడుపున 100 మంది కౌరవ కుమారులు జన్మిస్తే, ధృతరాష్ట్రునికి వైశ్య కులానికి చెందిన సుగధ అనే స్త్రీ ద్వారా యుయుత్సుడు జన్మించాడు. దుర్యోధనాదులతోనే పెరిగినప్పటికీ, యుయుత్సుని ఆలోచనా విధానం పూర్తిగా భిన్నంగా ఉండేది. చిన్నతనం నుంచే స్వార్థం, అధికారం కంటే నీతి నిజాయితీలకు ప్రాధాన్యమిచ్చేవాడు. పాండవుల పట్ల దుర్యోధనుడు చేసే కుట్రలను, అధర్మాలను ఆయన నిరంతరం వ్యతిరేకించేవాడు.
కురుక్షేత్రంలో సంచలన నిర్ణయం
యుద్ధానికి ముందు 18 అక్షౌహిణుల సైన్యం మోహరించి ఉన్న సమయంలో, ధర్మరాజు ముందుకు వచ్చి ... "ధర్మం కోసం మా వైపు రావలనకున్న వారు ఎవరైనా రావచ్చు" అని ఆహ్వానించాడు. ఆ సమయంలో 100 మంది కౌరవ సోదరులలో ఒక్క యుయుత్సుడు మాత్రమే రాజ్యాన్ని, బంధుప్రీతిని, నిందలను లెక్కచేయక పాండవుల పక్షాన నిలిచాడు.
18 రోజుల సమరం .... ఏకైక విజేత
18 రోజుల పాటు నెత్తురు ఏరులై పారిన కురుక్షేత్ర మహాసంగ్రామంలో 100 మంది కౌరవ సోదరులూ మరణించారు. ధృతరాష్ట్రుని కుమారుల్లో ప్రాణాలతో మిగిలిన ఏకైక పుత్రుడు యుయుత్సుడు మాత్రమే. పాండవులు మహారాజుగా పరిపాలన సాగించిన అనంతరం, స్వర్గారోహణకు వెళ్లే సమయంలో హస్తినాపుర సామ్రాజ్య రక్షణను, అర్జునుని మనుమడైన పరీక్షిత్తు సంరక్షణ బాధ్యతలను అత్యంత విశ్వసనీయుడైన యుయుత్సుడికే అప్పగించారు. మనవారు తప్పు చేసినప్పుడు బంధుప్రీతితో వారిని సమర్థించకూడదని, ఎల్లప్పుడూ ధర్మం వైపే నిలబడాలని యుయుత్సుని జీవితం నిరూపిస్తుంది. తాత్కాలికంగా కష్టాలు ఎదురైనా "ధర్మో రక్షతి రక్షితః" అనే ఆర్షవచనం ప్రకారం అంతిమంగా సత్యమే గెలుస్తుందనడానికి ఈ ‘భారత విభీషణుడు’ నిలువెత్తు సాక్ష్యం.




