Hindu Puja: పూజలో అందరూ చేసేదే...కానీ, ఎందుకు చేస్తున్నారో 90శాతం మందికి తెలియని రహస్యం
హిందూ పూజల్లో అరటిపండును నైవేద్యంగా ఎందుకు సమర్పిస్తారు? కదళీఫలం వెనుక ఉన్న దూర్వాస మహర్షి పురాణ కథ, ఆధ్యాత్మిక ప్రాధాన్యత గురించి తెలుసుకుందాం.
Hindu Puja: హిందూ సంప్రదాయంలో ఏ పూజ, వ్రతం లేదా నోము తలపెట్టినా దేవుడి నైవేద్యంలో అత్యంత ప్రధానంగా నిలిచేది అరటిపండు. లక్ష్మీదేవి పూజలైనా, శ్రావణమాస పూజలైనా ఈ 'కదళీఫలం' లేనిదే పూజా విధానం సంపూర్ణం కాదు. నిత్య జీవితంలో తక్షణ శక్తినిచ్చే ఫలంగా గుర్తింపు పొందిన అరటిపండు వెనుక ఒక విచిత్రమైన, అత్యంత ఆసక్తికరమైన పురాణ కథ దాగి ఉందనే విషయం 90 శాతం మందికి తెలియదు. దూర్వాస మహర్షి శాప వృత్తాంతం నుంచే ఈ కదళీఫలం ఉద్భవించిందనేది ఆ పౌరాణిక రహస్యం.
దూర్వాస మహర్షి శాపం కదళి భస్మం
అత్యంత కోపిష్టిగా పేరుగాంచిన దూర్వాస మహర్షి తన భార్య కదళి, శిష్యులతో కలసి అడవిలోని ఆశ్రమంలో నివసించేవారు. ఒకరోజు తీవ్ర అలసటతో ఉన్న మహర్షి పర్ణశాల ముందు నిద్రించగా, సంధ్యావందనం వేళ దాటిపోతోందన్న భయంతో భార్య కదళి ఆయనను నిద్రలేపింది. గాఢనిద్రలో ఉన్న తనను లేపినందుకు ఆగ్రహించిన దూర్వాసుడు, తన తపోశక్తితో భార్యను క్షణాల్లో బూడిదగా మార్చేశాడు.
మామగారి రాక ...వృక్షంగా పరిణామం
కొంతకాలం తర్వాత దూర్వాసుడి మామగారు కూతురిని చూసేందుకు ఆశ్రమానికి వచ్చారు. నిజం తెలిస్తే మామగారికి ఆగ్రహం వస్తుందని భావించిన దూర్వాసుడు, తాను చేసిన పొరపాటును గ్రహించి తపోశక్తితో బూడిదనంతటినీ ఒక పవిత్రమైన వృక్షంగా మార్చాడు. ఆ చెట్టే 'కదళీ వృక్షం' అదే మన వాడుక భాషలో అరటి చెట్టుగా మారగా, దాని ఫలమే 'కదళీఫలం'గా ప్రసిద్ధి చెందింది.
శాప విమోచనం ... నిత్య పూజా ఫలం
తన భార్య కదళికి శాశ్వతమైన పుణ్యలోకాలు సిద్ధించాలని దూర్వాస మహర్షి ఒక దివ్యమైన వరాన్ని ప్రసాదించాడు. మానవాళి నిర్వహించే ప్రతి శుభకార్యంలో అరటి ఆకులు, అరటి బోదెలు మండప శోభకు ప్రధాన అలంకారంగా మారతాయని అభయమిచ్చాడు. నిత్య పూజలు, నోములు, యజ్ఞయాగాల్లో కదళీఫలాన్ని దేవుడికి ప్రధాన నైవేద్యంగా అర్పిస్తేనే ఆ పూజ సంపూర్ణ ఫలితాన్ని ఇస్తుందని దూర్వాసుడు ప్రకటించాడు.
ఆధ్యాత్మికంగా పవిత్రమైన స్థానాన్ని పొందిన ఈ పండు, ఆరోగ్యపరంగా కూడా ఎంతో విశిష్టమైనది. అరటిపండులో పీచు పదార్థం, కార్బోహైడ్రేట్లు, జింక్, కాపర్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. అతి తక్కువ ధరలోనే లభించే ఈ ఫలం, అందుకే 'పేదవాడి పండు'గానూ, పూజల్లో అమూల్యమైన ప్రసాదంగానూ తరతరాలుగా నిలిచిపోయింది.




