Tirumala: వేంకటేశ్వరుని ఆలయాలు ఎన్నున్నా...తిరుమలకే ఎందుకు వెళ్తారు...పెద్దలు చెప్పిన రహస్యం
దేశంలో శ్రీవేంకటేశ్వరునికి ఎన్నో ఆలయాలు ఉన్నాయి. అయిన్పటికీ భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు వెళ్తుంటారు. ఒక్క క్షణంపాటు స్వామివారిని దర్శించుకుంటే చాలని కష్టాలు పడుతుంటారు.
Tirumala: గల్లీకి ఒక వేంకటేశ్వరస్వామి గుడి ఉంటుంది, ఇంటింటికీ ఆయనే ఇలవేల్పు. అయినప్పటికీ, భక్తులు ఎందుకు వేల రూపాయలు ఖర్చు పెట్టుకుని, గంటల తరబడి ప్రయాణాలు చేసి, తిరుమల కొండపై క్యూలైన్లలో 10 నుండి 15 గంటల పాటు నిలబడతారు? ఒక్క క్షణం... కేవలం ఒకే ఒక్క క్షణం ఆ దివ్యమంగళ రూపాన్ని కళ్లారా చూస్తే చాలు... అన్ని కష్టాలను మర్చిపోతారు. దీని వెనుక ఉన్న అసలైన ఆధ్యాత్మిక రహస్యం, ఆ గర్భాలయంలో దాగి ఉన్న సజీవ సాక్ష్యాల గురించి పెద్దలు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర ఆలయాల్లోని విగ్రహాలు మనుషులు రాతితో చెక్కి, మంత్రోచ్ఛారణలతో ప్రాణప్రతిష్ఠ చేసినవి. కానీ, తిరుమలలో వెలిసిన శ్రీనివాసుడు ఎవరూ చెక్కిన శిల్పం కాదు... ఆయన స్వయంభూవుడు. అంటే, భక్తులను కాపాడటం కోసం వైకుంఠాన్ని విడిచిపెట్టి స్వయంగా భూమిపై వెలిసిన సజీవ మూర్తి.
గర్భగుడిలో దాగి ఉన్న మూడు సజీవ నిదర్శనాలు
తిరుమల ఆనందనిలయంలో వేంకటేశ్వరుడు కేవలం శిలా రూపంలో మాత్రమే ఉన్నాడనుకుంటే పొరపాటే. ఆయన ఇప్పటికీ అక్కడ సజీవంగా శ్వాసిస్తున్నాడని చెప్పడానికి పండితులు, అర్చకులు కొన్ని అద్భుతమైన నిదర్శనాలను పేర్కొంటారు. స్వామివారి మూర్తి వెనుక భాగంలో మనుషులకు ఉన్నట్లే పట్టులాంటి మెత్తని నిజమైన జుట్టు ఉంటుంది. దీనికి ఎప్పుడూ చిక్కు పడకుండా అర్చకులు జాగ్రత్తలు తీసుకుంటారు. గురువారం నాడు స్వామివారి ఆభరణాలు తీసి ఏకాంత సేవ చేసే సమయంలో, విగ్రహం వెనుక భాగం వేడి వస్తుంది. స్వామివారి గుండె చప్పుడు స్పష్టంగా తెలుస్తుందని, ఆయన శరీరంపై చెమట బిందువులు పడతాయని అంటారు. గర్భగుడి వెనుక భాగంలో గోడపై ఓ చిన్న రంధ్రం ఉంటుంది. అక్కడ చెవి పెట్టి అత్యంత ఏకాగ్రతతో వింటే, ఏడుకొండలవాడి శ్వాస శబ్దం లేదా సముద్రపు ఘోష వంటి ఓంకార నాదం స్పష్టంగా వినిపిస్తుంది.
కలియుగంలో భక్తులను కాపాడే ఏకైక ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరుడు మాత్రమే. అందుకే ఆయన పాదాల చెంతకు చేరినప్పుడు కలిగే మానసిక ప్రశాంతత, మరే ఇతర ఆలయంలోనూ లభించదు. జీవితంలో ఎన్ని కష్టాలున్నా, తిరుమల కొండపై అడుగుపెట్టి గోవిందా అని స్మరిస్తే ఆ బాధలన్నీ దూది పింజల్లా ఎగిరిపోతాయి. ఆ ఏడుకొండలవాడి పిలుపు వస్తేనే ఎవరికైనా తిరుమల వెళ్లే భాగ్యం కలుగుతుంది.




