Hanuman: హైందవులకు షాకిచ్చిన గ్రామం...హనుమంతుడిపై నిషేధం...ఎందుకో తెలుసా?
ఉత్తరాఖండ్‌లోని ద్రోణగిరిలో హనుమంతుడి పేరు చెబితే మండిపడతారు. ఆయనకు సంబంధించిన పేర్లను పిల్లలకు కూడా పెట్టుకోరు. కారణాలేంటో తెలుసుకుందాం.
Hanuman: భారతదేశంలో రామనామం ఎక్కడ వినిపించినా అక్కడ హనుమంతుడి సన్నిధి ఉంటుంది. లంకెశుడు సైతం వణికేలా గర్జించిన ఆంజనేయుడికి దేశంలోని ప్రతి పల్లెటూరిలోనూ ఒక గుడి, ఒక పూజారి ఖచ్చితంగా ఉంటారు. కానీ, మన దేశంలోనే ఒక విచిత్రమైన గ్రామం ఉంది. అక్కడ హనుమంతుడికి ఆలయం లేదు సరే కదా.. కనీసం ఆయన పేరు ఎత్తడం కూడా మహాపాపంగా భావిస్తారు. ఆంజనేయుడి నామస్మరణపైనే అక్కడ శతాబ్దాలుగా అలిఖిత నిషేధం అమల్లో ఉంది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. భక్తి, సనాతన నమ్మకాలతో ముడిపడి ఉన్న ఈ గ్రామం పేరే ద్రోణగిరి. ఇది ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లాలో హిమాలయ పర్వతాల నడుమ ఉంది.
రామాయణ కాలం నాటి కోపం... పర్వతాన్ని ఎత్తుకెళ్లడమే శాపమైందా?
ఈ గ్రామంలో శ్రీరామచంద్రుడిని పరమ పవిత్రంగా పూజిస్తారు కానీ, ఆయన పరమ భక్తుడైన హనుమంతుడిని మాత్రం శత్రువులా చూస్తారు. దీని వెనుక త్రేతాయుగం నాటి ఒక ఆసక్తికరమైన కథ ప్రచారంలో ఉంది. రామ-రావణ యుద్ధ సమయంలో మేఘనాథుడి అస్త్ర ధాటికి లక్ష్మణుడు మూర్ఛపోతాడు. లక్ష్మణుడి ప్రాణాలు దక్కాలంటే తెల్లవారేలోగా హిమాలయాల నుండి సంజీవని మూలికను తీసుకురావాలని లంక వైద్యుడు సుషేణుడు చెప్తాడు. రాముడి ఆజ్ఞతో హనుమంతుడు వాయువేగంతో ద్రోణగిరి పర్వత ప్రాంతానికి చేరుకుంటాడు. ద్రోణగిరి గ్రామానికి రక్షకుడిగా, గ్రామ దేవతగా ఉన్న ఆ పర్వతంపై సంజీవని మూలికను గుర్తించలేక, సమయం లేకపోవడంతో హనుమంతుడు మొత్తం పర్వతాన్నే పెకిలించి లంకకు ఎత్తుకెళ్తాడు. తమ ఆరాధ్య దైవమైన పర్వత రాజును, ఆయన అనుమతి లేకుండా, కుడి భాగాన్ని విరగ్గొట్టి ఎత్తుకెళ్లడం వల్ల గ్రామ దేవత అపవిత్రమైందని నాటి ద్రోణగిరి వాసులు నమ్మారు. నాటి నుండి నేటి వరకు యుగాల కాలం గడిచినా, ఆ పర్వత ఖండనను వారు మర్చిపోలేదు. హనుమంతుడిపై ఆ కోపం నేటికీ సజీవంగానే ఉంది.
ఆశ్చర్యకరమైన వాస్తవం
ఈ గ్రామంలో పుట్టే పిల్లలకు ఆంజనేయుడికి సంబంధించిన పేర్లు అస్సలు పెట్టరు. అంతటి రామభక్తుడిని ఒక ఊరు మొత్తం శతాబ్దాలుగా వెలివేయడం భారతదేశ ఆధ్యాత్మిక చరిత్రలోనే ఒక అరుదైన మరియు విభిన్నమైన అంశం. ఈ గ్రామంలో రాముడితో పాటు ఆశ్చర్యకరంగా రాముడికి శత్రువైన 'నింబ' అనే రాక్షసుడిని కూడా పూజిస్తారు. ప్రకృతిని, పర్వతాలను దైవంగా భావించే హిమాలయ ప్రజల సంస్కృతికి ఈ ద్రోణగిరి గ్రామం ఒక సజీవ నిదర్శనం. భగవంతుడి లీలలు, భక్తుల నమ్మకాలు ఎంత విచిత్రంగా ఉంటాయో చెప్పడానికి ఈ పల్లెటూరి కథే ఒక ఉదాహరణ. ఆశ్చర్యకరంగా ఇది వందశాతం వాస్తవం.




