Srikrishna: కురుసభలో ద్రౌపదికి శ్రీకృష్ణుడు దుస్తులు అందించడం వెనుక రహస్యం ఇదే... అంతటి భక్తి ఉంటే మీకు కూడా
మనలో భక్తి కొండలా ఉంటే... ద్రౌపది మాదిరిగా మనం కూడా ఆ భగవంతుడుడి అండదండలతో ఆపదల నుంచి రక్షించడబుతాం. దీనికి మహాభారతంలోని ఈ సంఘటనే ఓ ఉదాహరణ.
Srikrishna and Draupadi: మహాభారతంలో కురుసభ అంటే మనకు గుర్తుకు వచ్చేది ద్రౌపదికి జరిగిన పరాభవం. ద్రౌపదికి వస్త్రాపహరణం సమయంలో శ్రీకృష్ణుడు ఆమెకు అక్షయ వస్త్రాలను అందించాడు. పాండవులు జూదంలో సర్వస్వం ఓడిన నమయంలో దుశ్శాసనుడు ద్రౌపదిని సభలోకి ఈడ్చుకువచ్చి వస్త్రాపహరణానికి ఒడిగట్టాడు. ఆ ఘోరమైన దృశ్యంలో ద్రౌపది రెండు చేతులు ఎత్తి శ్రీకృష్ణుడిని ప్రార్థిస్తుంది. దుశ్శాసనుడు ఎంత లాగినా వస్త్రాలు వస్తూనే ఉన్నాయి. వస్త్రాలు లాగి లాగి అలసిపోయిన దశ్శాసనుడు కుప్పకూలిపోతాడు. ద్వారకలో ఉన్న కన్నయ్య, హస్తినాపురంలో ఉన్న ద్రౌపది ఆపదను గుర్తించి క్షణాల్లో ఎలా వచ్చాడు. దీని వెనుక ఉన్న రహస్యం ఏంటి తెలుసుకుందాం.
ఒక చిన్న గాయం ... ఒక అద్భుతమైన బంధం
భగవంతుడికి మనం ఇచ్చేది చాలా చిన్నదే కావచ్చు, కానీ ఆయన మనకు తిరిగి ఇచ్చేది అనంతం. ఈ నమ్మకానికి నిజమైన నిదర్శనమే ఈ కథ. ఒకరోజు ద్వారకలోని ఉద్యానవనంలో శ్రీకృష్ణుడు తన భార్య రుక్మిణీ దేవి...సోదరి సమానురాలైన ద్రౌపదితో కలిసి విహరిస్తున్నాడు. ఆ సమయంలో కన్నయ్యను ఒక అందమైన గులాబీ పువ్వు ఆకర్షించింది. దానిని కోసే ప్రయత్నంలో, కొమ్మకున్న పదునైన ముల్లు కృష్ణుడి వేలికి గుచ్చుకుని రక్తం ధారగా కారడం ప్రారంభమైంది. కృష్ణుడి చేతి నుండి రక్తం కారడం చూసి రుక్మిణీ దేవి, అంతఃపుర దాసీలు కంగారు పడి కట్టు కట్టడానికి అవసరమైన వస్త్రాలు, మందుల కోసం పరిగెత్తారు. కానీ, అక్కడ ఉన్న ద్రౌపది మాత్రం ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. కన్నయ్య బాధను చూడలేక, తను కట్టుకున్న పట్టుచీర కొంగును టక్కున చించి, ఆ ముక్కతో శ్రీకృష్ణుడి గాయానికి కట్టు కట్టింది.
కట్టు వస్త్రం ... అనంతమైన అక్షయ వస్త్రాలు
ఆనాడు ద్రౌపది తన చీర నుండి చించిన చిన్న వస్త్రం ముక్క కృష్ణుడి హృదయాన్ని కదిలించింది. భగవంతుడికి ధన కనక వస్తు వాహనాలు అవసరం లేదు, కేవలం సమయానికి స్పందించే ఆర్ద్రత కలిగిన హృదయం ఉంటే చాలు. ద్రౌపది చేసింది చిన్నపనే. కానీ, దానికి బదులుగా స్త్రీకి అత్యంత విలువైన మానప్రాణాలకు కన్నయ్య రక్షణగా నిలిచాడు. ఒక చిన్న గుడ్డ పీలిక చించి కట్టినందుకు ఆమెకు అనంతమైన వస్త్రాలను ప్రసాదించాడు. గాయానికి రక్షణ ఇచ్చినందుకు..కురు సభలో మానప్రాణాలను కాపాడాడు. భగవంతునిపై అంతటి నిష్కల్మషమైన భక్తి, శరణాగతి మనలో ఉంటే మనకు ఎలాంటి ఆపద వచ్చినా ఆ భగవంతుడు క్షణకాలంలో వచ్చి రక్షిస్తాడు. సనాతన ధర్మం బోధించే పరమార్థం ఇదే. ఇలాంటి శరణాగతితో కూడిన భక్తిని మనలో నింపుకుందాం. ఆ భగవంతుడిని మన దగ్గరికి చేర్చుకుందాం.




