Lord Jagannath: పూరీ జగన్నాథుడికి పెద్ద కళ్లు ఎందుకుంటాయి...90శాతం మందికి తెలియని రహస్యం
విచిత్రమైన ఆకారంలో పెద్ద కళ్లతో, కాళ్లు చేతులు లేని గుండ్రని రూపంలో దర్శనం ఇచ్చే పూరీ జగన్నాథుడి వెనుక లోతైన ఆధ్యాత్మిక రహస్యం దాగుంది.
Lord Jagannath: భారతదేశంలోని అత్యంత పవిత్రమైన చార్‌ధామ్ క్షేత్రాలలో ఒడిశాలోని పూరీ జగన్నాథ ఆలయం ఒకటి. పూరీ అనగానే మనకు మొదట గుర్తొచ్చేది ఆషాఢ మాసంలో జరిగే జగత్ప్రసిద్ధ రథయాత్ర. అయితే, గర్భగుడిలో ఉన్న జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రా దేవి విగ్రహాలను చూసినప్పుడు ప్రతి ఒక్కరికీ ఒక సందేహం వస్తుంది. లోక రక్షకుడైన ఆ శ్రీకృష్ణుడు ఇక్కడ కాళ్లు, చేతులు లేకుండా, కేవలం గుండ్రటి పెద్ద కళ్లతో అసంపూర్ణ రూపంలో ఎందుకు దర్శనమిస్తాడు? సాధారణంగా హిందూ సంప్రదాయంలో భిన్నమైన లేదా అసంపూర్ణ విగ్రహాలను పూజించడం నిషిద్ధం, కానీ పూరీలో మాత్రం ఈ రూపమే కోట్లాది మందికి కొంగుబంగారమైంది. ఈ వింత వెనుక ఉన్న పౌరాణిక రహస్యాన్ని, ఆధ్యాత్మిక పరమార్థాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
దేవశిల్పి విశ్వకర్మ నిబంధన ... రాజు తొందరపాటు
పురాణాల ప్రకారం, పూరీని పరిపాలించిన ఇంద్రద్యుమ్న మహారాజు జగన్నాథునికి ఒక భవ్యమైన ఆలయాన్ని నిర్మించాడు. ఆలయంలో ప్రతిష్టించాల్సిన విగ్రహాలను చెక్కే బాధ్యతను దేవశిల్పి అయిన విశ్వకర్మ స్వీకరించాడు. అయితే, ఆయన రాజుకు ఒక కఠినమైన నిబంధన పెట్టాడు. తాను గది తలుపులు మూసి విగ్రహాలను చెక్కుతానని, 21 రోజులపాటు ఎవరూ కూడా గది తలుపులు తీయకూడదని, ఒకవేళ ఎవరైనా సరే తలుపులు తెరిస్తే తాను పనిని అక్కడితో వదిలేసి వెళ్తానని చెబుతాడు.
దేవశిల్పి పెట్టిన నిబంధనలను రాజు అంగీకరిస్తాడు. కానీ, కొన్ని రోజుల తర్వాత ఆ గది నుండి ఎలాంటి శబ్దాలు రాకపోవడంతో, రాజు భార్య గుండీచా దేవికి కుతూహలం, ఆందోళన పెరిగాయి. ఆమె కోరిక మేరకు రాజు నిబంధనను ఉల్లంఘించి, గడువు ముగియక ముందే తలుపులు తెరిచాడు. అంతే! మహారాజు ఊహించినట్లే దేవశిల్పి విశ్వకర్మ అక్కడ అదృశ్యమయ్యాడు. కళ్లముందు కాళ్లు, చేతులు సరిగ్గా చెక్కబడని, కేవలం పెద్ద కళ్లతో ఉన్న మూడు అసంపూర్ణ దారు విగ్రహాలు మాత్రమే మిగిలాయి. రాజు తన తప్పు తెలుసుకొని బాధపడుతుండగా, భగవంతుడు అశరీరవాణిగా తాను ఇదే నిరాకార రూపంలో, సజీవ రూపంలో ఇక్కడ పూజలు అందుకోవాలని అనుకుంటున్నట్టు చెబుతాడు.
పెద్ద కళ్లు, అసంపూర్ణ రూపం వెనుక ఉన్న తత్వజ్ఞానం
పూరీ జగన్నాథుడి రూపం వెనుక ఒక అద్భుతమైన సృష్టితత్వం దాగి ఉందని పండితులు చెబుతారు. స్వామివారికి ఉన్న పెద్ద గుండ్రటి కళ్లు 'విశ్వచక్షువు'కు ప్రతీక. అంటే, సృష్టిలోని ప్రతి అణువును, ప్రతి భక్తుడి కష్టాన్ని ఆయన ఎల్లప్పుడూ నిరంతరాయంగా గమనిస్తూనే ఉంటాడని దీని అర్థం. భగవంతుడు బ్రహ్మస్వరూపుడు. ఆయనకు నిర్దిష్టమైన ఆకారం లేదు. భౌతికమైన కాళ్లు, చేతులు లేకపోయినా ఆయన విశ్వమంతటా సంచరించగలడు, భక్తులను రక్షించగలడు అని చెప్పడమే ఇందులోని అంతరార్థం. ఈ విగ్రహాలను వేప కలపతో తయారు చేస్తారు. అందుకే స్వామిని 'దారుబ్రహ్మ' అంటారు. కాలక్రమేణా విగ్రహాలు క్షీణిస్తాయి కాబట్టి, ప్రతి 12, 14 లేదా 19 ఏళ్లకు ఒకసారి పాత విగ్రహాల స్థానంలో కొత్త విగ్రహాలను శాస్త్రోక్తంగా ప్రతిష్టిస్తారు. ఈ అద్భుతమైన ఉత్సవాన్ని 'నవకళేబర మహోత్సవం' అని పిలుస్తారు. మానవ నిర్మిత ఆకారాలకు, అలంకారాలకు లొంగని ఆ పరమాత్ముడు.. కేవలం నిష్కల్మషమైన భక్తికి మాత్రమే లొంగుతాడని చాటిచెప్పేందుకే జగన్నాథుడు పూరీ క్షేత్రంలో ఈ విలక్షణ రూపంలో కొలువై ఉన్నాడు.




