Puri Jagannath Temple: పూరీ ఆలయంలో అద్భుతం...ఆ 15 రోజులు జగన్నాథుడు భక్తులకు దూరం...ఎందుకంటే

జ్యేష్ఠమాసంలో పూరి జగన్నాథుని ఆలయంలో రథయాత్రకు సన్నాహాలు ప్రారంభమౌతాయి. జ్యేష్ఠపౌర్ణమి నుంచి స్వామివారు 15 రోజులపాటు జ్వరంతో బాధపడతారు. ఎందుకో ఏమిటో తెలుసుకుందాం.

Balachander
Published on: 12 Jun 2026 8:35 AM IST
Puri Jagannath Temple: పూరీ ఆలయంలో అద్భుతం...ఆ 15 రోజులు జగన్నాథుడు భక్తులకు దూరం...ఎందుకంటే
X

Puri Jagannath Temple: వైష్ణవులకు పవిత్రమైన 108 దివ్యదేశాలలో ఒకటైన పూరీ జగన్నాథ క్షేత్రాన్ని ‘మోక్షపురి’ అని పిలుస్తారు. సప్త మోక్షపురుల్లో పూరీ కూడా ఒకటి. ఇక్కడ ఆ శ్రీమహావిష్ణువే ఇక్కడ జగన్నాథుడిగా కొలువై భక్తుల కష్టాలను తీరుస్తున్నాడు. అయితే, ప్రతి సంవత్సరం జ్యేష్ట మాస పౌర్ణమి నాటి నుండి సరిగ్గా 15 రోజుల పాటు ఆ జగన్నాథుడు భక్తులకు దర్శనమివ్వడు. ఎందుకంటే ఆ సమయంలో స్వామివారు తీవ్రమైన జ్వరం బారిన పడతారు. విశ్వాన్ని రక్షించే భగవంతుడే అనారోగ్యం బారిన పడటం, మానవ రూపుడిగా చికిత్స పొందడం వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం, ఒక పరమ భక్తుడి కథ గురించి తెలుసుకుందాం.

108 కలశాల జలాభిషేకం ...అనసర లీల ప్రారంభం

ప్రతి ఏటా జ్యేష్ట పూర్ణిమ నాడు ఆలయంలో అత్యంత వైభవంగా 'పహండీ యాత్ర' నిర్వహిస్తారు. స్వామివారిని గర్భాలయం నుండి బయటకు తీసుకొచ్చి, ప్రత్యేక వేదికపై ఉంచుతారు. అనంతరం వివిధ పవిత్ర తీర్థాల నుండి సేకరించిన సుగంధభరితమైన గంగాజలంతో, 108 కలశాలతో స్వామివారికి మహాభిషేకం చేస్తారు. ఈ జలాభిషేకం కారణంగా స్వామివారి పవిత్ర విగ్రహం వేడెక్కి, జ్వరం వస్తుంది. దీనినే జ్యోతిష్య, ఆధ్యాత్మిక పరిభాషలో ‘అనసర లీల’ లేదా ఏకాంత సేవ అంటారు. ఈ 15 రోజులు ఆలయ ప్రధాన ద్వారాలను పూర్తిగా మూసివేస్తారు. జగన్నాథుడి అఖండ వంటశాలను సైతం 24 గంటల పాటు పూర్తిగా బంద్ చేస్తారు. ‘దయిదాపతి’ అనే ప్రత్యేక వంశస్థులు మాత్రమే స్వామివారికి రహస్యంగా సేవలు అందిస్తారు. ఈ సమయంలో స్వామికి కేవలం వనమూలికల కషాయాలు, లేపనాలను మాత్రమే నైవేద్యంగా సమర్పిస్తారు.

భగవంతుడిని జ్వరపీడితుణ్ణి చేసిన భక్తుడి ప్రేమ!

సృష్టికర్తకే జ్వరం రావడం వెనుక ఒక అద్భుతమైన యదార్థ గాథ ఉంది. పూర్వం పూరీ క్షేత్రంలో ‘మాధవదాస్’ అనే జగన్నాథుని భక్తుడు ఉండేవాడు. ఒకసారి అతను తీవ్రమైన అనారోగ్యంతో స్పృహతప్పి పడిపోగా, జగన్నాథుడే స్వయంగా బాలుడి రూపంలో వచ్చి సేవలు చేశాడు. మాధవదాస్ కోలుకున్నాక, "స్వామి! నీవు దైవానివి కదా, నా రోగాన్ని ఒక్క క్షణంలో నయం చేయవచ్చు కదా! నీవెందుకు శ్రమపడ్డావు?" అని అడిగాడు. దానికి ఆ జగన్నాథుడు నవ్వుతూ... విధిరాతను మార్చడం నాకూ సాధ్యం కాదు. నీవు అనుభవించాల్సిన 15 రోజుల కర్మఫలాన్ని, నీ నిష్కల్మషమైన భక్తికి మెచ్చి నేనే స్వీకరించాను అని చెబుతాడు జగన్నాథుడు. అప్పటి నుంచి ప్రతి ఏడాది స్వామివారు తన భక్తుల తరపున 15 రోజులపాటు అనారోగ్యాన్ని స్వీకరిస్తాడు. 15 రోజుల విరామం తరువాత స్వామివారు ఆషాఢ శుద్ధ విదియ రోజున నూతనోత్సాహంతో నవయవ్వన రూపంలోకి మారి రథయాత్ర ద్వారా భక్తులకు దర్శనం ఇస్తాడు. రథయాత్ర నిర్వహించడాని కారణం కూడా ఇదే.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story