Lord Venkateswara: తిరుమల శ్రీవేంకటేశ్వరుడిని చూడగానే మీకేం అనిపిస్తుంది...ఇలానే ఎందుకు దర్శనం ఇస్తాడో తెలుసా?
శ్రీనివాసుడు ఆయుధాలతో కాకుండా అభయ, వరద హస్తాలతో ఎందుకు దర్శనం ఇస్తాడో తెలుసా? తన ఆయుధాలను ఎవరికి ధారాదత్తం చేశాడో తెలుసుకుందాం.
Lord Venkateswara: తిరుమల అంటే గుర్తుకు వచ్చేది శ్రీవేంకటేశ్వరుడే. స్వామివారు కొలువైన తిరుమల క్షేత్రం నిత్య కళ్యాణం, పచ్చతోరణంగా వెలుగొందుతోంది. ఎంతో మంది మహానుభావులు, అన్నమయ్య వంటి గొప్ప గొప్ప కీర్తనాకారులు స్వామివారిని కీర్తించారు. అయితే, ఇక్కడే మనం ఓ విషయాన్ని గమనించాలి. ఏ దేవాలయంలో చూసినా భగవంతుడు కొన్ని రకాలైన ఆయుధాలు ధరించి దర్శనం ఇస్తారు. కానీ, శ్రీవేంకటేశ్వరుడు మాత్రమే ఎటువంటి ఆయుధాలు లేకుండా వరద, అభయ హస్తంతో భక్తులకు కటాక్షిస్తూ ప్రశాంత వదనంతో దర్శనం ఇస్తాడు. ఇలా ఎందుకు మనకు దర్శనం ఇస్తాడో ఎప్పుడైనా ఆలోచించారా... ఆ కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
శ్రీవేంకటేశ్వరుని దివ్యమంగళరూపం
తిరుమల అనగానే మన మనోనేత్రంలో ఆరడుగుల ఎత్తైన దివ్యమంగళ రూపం కనిపిస్తుంది. నల్లని రూపం, తెల్లని కర్పూర తిలకం, ఒంటినిండా ఆభరణాలు, తలపై కిరీటం, వివిధ రకాలైన సుగంధభరిత పుష్పాలంకరణతో స్వామివారు దర్శనం ఇస్తారు. నిజరూప దర్శనం సమయంలో మనకు ఆభరణాలు లేకుండా కనిపించినా అక్కడ కూడా మనకు వరద, అభయ హస్తాలే ఉంటాయి తప్పించి ఆయుధాలు కనిపించవు. ప్రశాంత వదనంతో వచ్చిన వారి మనసులోని కోరికలు గ్రహించి వారికి కటాక్షిస్తుంటారు స్వామివారు. స్వామివారు ఆయుధాలు లేకుండా ఉండటానికి కారణం ఎవరో తెలుసా... తిరుమలలో ఆలయాన్ని నిర్మించిన తొండమాన్ చక్రవర్తి. ఆకాశరాజు సోదరుడైన తొండమాన్ చక్రవర్తి కోరిక మేరకు ఆయన ఆయుధాలు ధరించలేదని చెబుతారు. దీని వెనుక ఆసక్తికరమైన కథ ఒకటి ఉంది. అదేంటో తెలుసుకుందాం.
ఆయుధాలు ఎందుకు ఉండవు
పురాణాల ప్రకారం సింహద అనే రాక్షసుడు బ్రహ్మదేవుడి నుంచి వరం పొందాడు. దేవతలు, రాక్షసులు, జంతువులు, మానవులెవ్వరి చేతిలో మరణం లేకుండా వరం పొందుతాడు. పుట్టిన వాడికి మరణం తప్పదు. సింహద బాధలు భరించలేక అందరూ వెళ్లి శ్రీనివాసుడిని వేడుకుంటారు. దేవతలను బ్రాహ్మణుల రూపంలో వెళ్లి తొండమాన్ చక్రవర్తిని కలవమని చెప్పగా...అందరూ శ్రీనివాసుడు చెప్పిన విధంగా వెళ్లి తొండమాన్ చక్రవర్తికి మొరపెట్టుకుంటాడు. పాలకుడు కావడంతో అభయం ఇస్తాడు. కానీ, ఆ రాక్షసుడిని ఎలా అంతం చేయాలో తెలియక వేంకటేశ్వరుడిని ఆశ్రయించగా...స్వామివారు తన ఆయుధాలైన శంఖం, చక్రం, గద, ఖడ్గం, ధనస్సులను ఆయనకు ఇచ్చి యుద్ధానికి పంపుతాడు. ఈ యుద్ధంలో తొండమాన్ చక్రవర్తి సింహదను అంతం చేస్తాడు. తాను సింహదను అంతం చేయలేదని, ఆయుధాలే సంహరించాయని, అయితే, ఈ విషయం మన ఇద్దరి మధ్యనే ఉండాలని, ఆయుధాల ప్రస్తావన వచ్చినపుడు తనకు ఈ ప్రస్తావన రావాలని, తనకు శాశ్వత కీర్తిని ఇవ్వాలని కోరతాడు. తొండమాన్ కోరిన విధంగానే శ్రీవేంకటేశ్వరుడు నిరాయుధారుడిగా తిరుమల గిరుల్లో దర్శనం ఇస్తున్నాడు. ఆయుధాలు మనలో తెలియని ఒక విధమైన భయాన్ని తీసుకొస్తాయి. కానీ, శ్రీనివాసుడు ఎటువంటి ఆయుధాలు లేకుండా శాంత స్వభావంతో దర్శనం ఇవ్వడం వలనే కోట్లాదిమంది స్వామిని దర్శించుకుంటున్నారు.




