Kuja Graha Effects: జ్యోతిష్యశాస్త్రం హెచ్చరికః మంగళవారం అప్పులు ఇస్తున్నారా? మీ డబ్బుకు గ్యారెంటీ లేనట్టే
మంగళవారం రోజున ఎవరకీ అప్పుగా డబ్బు ఇవ్వకూడదు. ఒకవేళ ఇలా ఇస్తే తిరిగి రాదని జ్యోతిష్యపండితులు చెబుతున్నారు. ఎందుకో తెలుసుకుందాం.
Kuja Graha Effects: ధనమేరా అన్నిటికీ మూలం అన్నట్టుగానే ఈ కలియుగంలో చేతిలో ధనం లేకుంటే ఎలాంటి పనులు కూడా ముందుకు సాగవు. మనిషి పుట్టినప్పటి నుంచి కాటిలో కలిసిపోయే వరకు డబ్బుకావాలి. కొంతమంది ఎంత కష్టపడినా చేతిలో చిల్లిగవ్వ కూడా మిగలదు. అలాంటి వారు తరచుగా అప్పులు చేస్తుంటారు. అప్పులు ఇవ్వడం, తీసుకోవడం సాధారణమే. అయితే, భారతీయ ధర్మశాస్త్రం, జ్యోతిష్యశాస్త్రంలో కొన్ని పనులకు నిర్ధిష్టమైన రోజులు ఉంటాయి. వారంలోని ఏడు రోజుల్లో మంగళవారం రోజున ఎట్టిపరిస్థితుల్లోనూ ఎవరికీ అప్పు ఇవ్వకూడదని పండితులు చెబుతున్నారు. దీని వెనుక ఆధ్యాత్మిక, ఖగోళ రహస్యాలు కూడా ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.
కుజుడి ప్రభావం - ఆర్థిక నష్టాలు
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మంగళవారానికి అధిపతి నవగ్రహాలలో ఒకరైన కుజుడు. కుజుడిని భూమి పుత్రుడిగా అభివర్ణిస్తారు. ఈ గ్రహానికి ఉగ్రత, పట్టుదల, కాస్త కలహకారక లక్షణాలు ఎక్కువ. మంగళవారం నాడు ఎవరికైనా ధనాన్ని అప్పుగా ఇస్తే, ఆ డబ్బు తిరిగి రావడం దాదాపు అసాధ్యమని శాస్త్రాలు చెబుతున్నాయి. ఒకవేళ వచ్చినా అనేక గొడవలు, మనస్పర్థల తర్వాతే వస్తుంది. అలాగే, ఈ రోజున ఎవరి దగ్గరైనా అప్పు తీసుకుంటే, ఆ ఋణ భారం మూడు రెట్లు పెరిగిపోయే ప్రమాదం ఉంది. తీసుకున్న అప్పు తీరకపోగా, మరిన్ని ఆర్థిక ఇబ్బందులు చుట్టుముడతాయి. కాబట్టి వీలైనంత వరకు మంగళవారాన్ని దృష్టిలో ఉంచుకొని అప్పు ఇవ్వడం తీసుకోవడం చేయాలి.
ధన లావాదేవీలు మాత్రమే కాదు.. ఇవి కూడా నిషిద్ధం!
మంగళవారం నాడు కేవలం డబ్బు ఇవ్వడమే కాకుండా, శరీరానికి సంబంధించిన కొన్ని పనులు చేయడం కూడా అరిష్టంగా భావిస్తారు. అందులో ప్రధానమైనవి గోళ్లు కత్తిరించుకోవడం, మంగలిషాపుకు వెళ్లి జుట్టు కత్తిరించుకోవడం వంటివి చేయకూడదు. మంగళవారం రోజున ఇలా చేయడం వలన జాతకంలో కుజదోషం పెరిగి రక్తసంబంధిత అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయని పండితులు చెబుతున్నారు.
శాస్త్రీయ కోణంలో
అయితే, సైన్స్ అభివృద్ధి చెంది చంద్రుడి మీదకు రాకెట్లను పంపుతున్న ఈ రోజుల్లో వీటిని నమ్మేవారు ఉండకపోవచ్చు. ఇవన్నీ మూఢనమ్మకాలేనని ప్రశ్నించవచ్చు. కానీ, మన పూర్వీకులు కేవలం మూఢనమ్మకాలతో ఈ విషయాలను చెప్పలేదు. మానసిక ఒత్తిడి, గ్రహ తరంగాల శక్తి మానవ శరీరంపై చూపే ప్రభావాలను పరిశోధించి పరిశీలించిన తరువాతే ఈ నియమాలను రూపొందించారు. ఈ విషయాలు తెలుసుకొని మసలుకుంటే మనకు మన భవిష్యత్తుకు మంచిది. ఇక మంగళవారం రోజున చేసిన అప్పులు తీరడానికి రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని పఠించడం లేదా హనుమంతుడిని ఆరాధించడం వలన ఆర్థిక బాధల నుంచి త్వరగా బయటపడతారని శాస్త్రాలు చెబుతున్నాయి.




