Tirtha Yatra: వృద్ధాప్యంలో కాదు...తీర్థయాత్రలు ఎప్పటి నుంచి చేయాలో తెలిస్తే ఆశ్చర్యపోతారు

సనాతన సంప్రదాయంలో తీర్థయాత్రలకు అత్యంత విశిష్టమైన స్థానం ఉంది. తీర్థయాత్రలను వయసు మళ్లిన లేదా రిటైర్‌ అయ్యిన తరువాత చేయాలని చెబుతారు. కానీ, శాస్త్రాల ప్రకారం ఈ యాత్రలు ఎప్పుడు చేయాలో తెలుసుకుందాం.

Balachander
Published on: 30 May 2026 11:06 AM IST
Tirtha Yatra: వృద్ధాప్యంలో కాదు...తీర్థయాత్రలు ఎప్పటి నుంచి చేయాలో తెలిస్తే ఆశ్చర్యపోతారు
X

Tirtha Yatra: తీర్థయాత్రలు ఎప్పుడు చేయాలి అంటే మనం ఠక్కున వృద్ధాప్యంలో అని చెబుతుంటాం. కానీ, శాస్త్రం ప్రకారం తీర్థయాత్రలు వయసులో ఉండగానే చేయాలని, ఒంట్లో సత్తువ ఉన్నప్పుడే వీలైనంత వరకు యాత్రలు చేసి పుణ్యాన్ని మూటకట్టుకోవాలని చెబుతారు. వృద్ధాప్యంలో...చేసిన యాత్రలను వాటి విశేషాలను తలచుకుంటూ ప్రశాంతంగా జీవించాలని శాస్త్రాలు చెబుతున్నాయి. జీవితానికి ముక్తిని, పుణ్యాన్ని ప్రసాదించే ఈ యాత్రలు ఎందుకు చేయాలి... ఏయే క్షేత్రాలను దర్శించాలి. పురాణ గ్రంథాలు దీని గురించి ఏం చెబుతున్నాయి తెలుసుకుందాం.

వయసులో ఉన్నప్పుడే ఎందుకు వెళ్లాలి?

పుణ్యక్షేత్రాలు చాలావరకు కొండలపై, గుహల్లో లేదా కఠినమైన భౌగోళిక ప్రాంతాలలో ఉంటాయి. ఉదాహరణకు మనం చార్ ధామ్ దర్శించాలన్నా లేదా 12 జ్యోతిర్లింగాలు, 18 శక్తిపీఠాలను చుట్టిరావాలన్నా ఎంతో శారీరక బలం అవసరం. వయసు మళ్లిన తర్వాత సమయం దొరుకుతుంది కానీ, నడవడానికి శరీరం సహకరించదు. అందుకే యువతరం సాధ్యమైనంత త్వరగా దైవదర్శనాలకు ప్రాధాన్యం ఇవ్వాలని మన పెద్దలు చెబుతారు. శరీరం వయసులో ఉండగానే కఠినమైన పర్వత ప్రాంతాల్లో ఉన్న క్షేత్రాలను దర్శించుకోవాలి. శరీరంలో సత్తువ తగ్గుతుందని తెలిసినపుడు మైదాన ప్రాంతంలోని క్షేత్రాలను దర్శించుకోవాలి. వీటికోసం తప్పనిసరిగా కొంత సమయాన్ని కేటాయించాలి.

పురాణ పురుషులు నడచిన బాట

తీర్థయాత్రల విశిష్టత ఎంతటిదో చెప్పడానికి మన ఇతిహాసాలే గొప్ప సాక్ష్యాలు. సాక్షాత్తు దేవుళ్లే తమ దోషాల నివారణకు యాత్రలు చేశారు. రావణ సంహారం తరువాత తనకు చుట్టుకున్న బ్రహ్మహత్య దోషాన్ని పోగొట్టుకోవడానికి శ్రీరామచంద్రుడు ఎన్నో పవిత్రమైన తీర్థాలను సందర్శించినట్టుగా రామాయణ గ్రంథం మనకు తెలియజేస్తున్నది. అదే విధంగా బ్రహ్మదేవుని ఐదో శిరస్సును ఖండించిన పాపం నుంచి విముక్తి పొందడానికి మహాశివుడు బ్రహ్మకపాలాన్ని చేతబూని ఎన్నో క్షేత్రాలను తిరిగినట్టుగా కూడా పురాణాలు చెబుతున్నాయి. అంతేకాదు, ద్వాపరయుగంలో బలరాముడు కురుక్షేత్ర యుద్ధం జరగడానికి ముందే ఏ పక్షాన నిలబడకుండా తన కోపాన్ని అదుపులో ఉంచుకునేందుకు తీర్థయాత్రలకు వెళ్లినట్టుగా కూడా చెబుతారు.

సప్త మోక్ష క్షేత్రాలు ... ప్రతి ఒక్కరూ చూడాల్సినవి

హిందూ ధర్మ శాస్త్రాల ప్రకారం మనిషిగా జన్మించిన ప్రతి ఒక్కరూ తన జీవితకాలంలో ముఖ్యమైన సప్త మోక్షపురాలను తప్పకుండా సందర్శించాలి. అయోధ్య, మథుర, కంచి, హరిద్వార్‌, ఉజ్జయిని, కాశీ, ద్వారక ఈ ఏడు సప్త మోక్షపురులు. అయితే, తీర్థయాత్రలు చేసే సమయంలో కొన్ని నియమాలను తప్పకుండా పాటించాలి. తీర్థయాత్రలను విహార యాత్రలు మాదిరిగా కాకుండా భక్తితో చేయాలి. యాత్రల సమయంలో కోపం, అసూయ, అసత్యం వంటి దుర్గుణాలను పక్కనపెట్టాలి. మితాహారం మాత్రమే తీసుకోవాలి. ఒకవేళ ఈ యాత్రలు చేయడం కుదరని సమయంలో ఆయా యాత్రలకు సంబంధించిన పుస్తకాలను చదవడం, కథలను చదవడం ద్వారా యాత్ర చేసిన పుణ్యం లభిస్తుందని పండితులు చెబుతున్నారు.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story