Tirumala: శనివారం నాడే శ్రీనివాసుడిని ఎందుకు దర్శించుకోవాలి? ఈ ఏడు రహస్యాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు
తిరుమల క్షేత్రాన్ని నిత్యకళ్యాణం పచ్చతోరణం అంటారు. ఈ క్షేత్రం ఎప్పుడూ భక్తులతో కళకళలాడుతూనే ఉంటుంది. ఇక శనివారం వచ్చిందంటే చాలు...ఆ ఏడుకొండలు గోవింద నామస్మరణతో మరింతగా మారుమోగిపోతాయి.
Saturday Venkateswara Worship: తిరుమల క్షేత్రాన్ని నిత్యకళ్యాణం పచ్చతోరణం అంటారు. ఈ క్షేత్రం ఎప్పుడూ భక్తులతో కళకళలాడుతూనే ఉంటుంది. ఇక శనివారం వచ్చిందంటే చాలు...ఆ ఏడుకొండలు గోవింద నామస్మరణతో మరింతగా మారుమోగిపోతాయి. అసలు వేంకటేశ్వర స్వామికి, శనివారానికి ఉన్న అవినాభావ సంబంధం ఏమిటి? శనివారం నాడు స్వామిని దర్శించుకుంటే శని దోషాలు ఎలా పోతాయి? దీని వెనుక ఉన్న 7 అద్భుత ఆధ్యాత్మిక రహస్యాలు ఇప్పుడు తెలుసుకుందాం.
శనిదేవుడి వాగ్దానం.. భక్తులకు అభయం!
పురాణ గాథల ప్రకారం, శనిదేవుడు శ్రీవేంకటేశ్వర స్వామికి ఒక గొప్ప వాగ్దానం చేశాడు. ఎవరైతే శనివారం నాడు భక్తితో గోవిందుడిని కొలుస్తారో, వారిని తాను పీడించనని, వారి జీవితాల్లోని కష్టాలను తొలగిస్తానని స్వామికి మాట ఇచ్చాడు. అందుకే జాతకంలో శని దోషం ఉన్నవారు, ఏలినాటి శనితో ఇబ్బంది పడేవారు శనివారం నాడు వేంకటేశ్వరుని ఆశ్రయిస్తే సకల శుభాలు కలుగుతాయి. అందుకే చాలామంది శనివారాల వ్రతం చేస్తుంటారు. ఈ శనివారాల వ్రతం ఏడు శనివారాలు చేస్తే శనిదోషాలు పూర్తిగా తొలగిపోతాయి.
శనివారమే ఎందుకు ప్రత్యేకం?
స్వామివారి దివ్య లీలలో జరిగిన అత్యంత కీలకమైన ఘట్టాలన్నీ శనివారంతోనే ముడిపడి ఉండటం విశేషం. అందులో మొదటిది ఓంకారం ఆవిర్భావం. విశ్వానికి మూలమైన ఓంకారం ప్రభవించిన రోజు శనివారమే. అంతేకాదు, శ్రీమహాలక్ష్మి స్వామివారి వక్షస్థలంలో స్థిరనివాసం ఏర్పాటుచేసుకున్నది కూడా శనివారమే. ఆకాశరాజు పుత్రిక పద్మావతి దేవిని స్వామివారు వివాహం చేసుకున్నది కూడా శనివారం రోజునే అని చెబుతారు. స్వామివారి స్థిరనివాసం ఆనందనిలయం నిర్మాణం చేపట్టాలని తొండమాన్ చక్రవర్తిని ఆదేశించింది కూడా శనివారం రోజునే అని అంటారు. అంతేకాదు, స్వామివారు తిరుమల కొండపై భక్తుల కోసం శిలారూపంలో కొలువైన రోజు కూడా శనివారమే. లోకకళ్యాణం కోసం ఈ వైకుంఠనాథుడు శ్రీనివాసుడి రూపంలో భూలోకంలో అడుగుపెట్టిన రోజు కూడా శనివారమే. భక్తుల కష్టాలను తీర్చే నిత్య కళ్యాణ చక్రవర్తిగా స్వామివారు స్థిరపడింది కూడా శనివారమే. ఇలా శనివారంతో స్వామివారికి విడదీయలేని అనుబంధం ఉంది.
మనం ఏం చేయాలి?
శనివారం నాడు ఇంటిని శుభ్రం చేసుకుని, వేంకటేశ్వర స్వామి పటాన్ని పూలతో అలంకరించి, నెయ్యితో దీపం వెలిగించాలి. గోవింద నామాలను పఠించడం వల్ల ఇంట్లోని ప్రతికూల శక్తి తొలగిపోయి, సానుకూలత పెరుగుతుంది. నిత్యం గోవిందనామాలు స్మరించుకునేవారికి ఎలాంటి లోటు రానివ్వని స్వయంగా స్వామివారే ప్రకటించారు. అందుకే చాలామంది తమ కులదేవతగా శ్రీవేంకటేశ్వరుడిని ఆరాధిస్తారు.




