Temple Gopurams: పూర్వీకులు చెప్పిన రహస్యం...ఆలయ గోపురాలు ఎందుకు ఎత్తుగా ఉంటాయో తెలుసా?
ఆలయ గోపురాలు ఎందుకు అంత ఎత్తుగా నిర్మిస్తారు? గోపుర దర్శనం వెనుక ఉన్న ఆధ్యాత్మిక భావన, ఆలయ నిర్మాణ రహస్యాలు, పూర్వీకుల జ్ఞానాన్ని తెలుసుకుందాం.
Temple Gopurams: సనాతన భారతీయ సంస్కృతిలో దేవాలయాలు కేవలం ప్రార్థనా మందిరాలు మాత్రమే కావు. అవి భౌతిక రక్షణను, మానసిక ప్రశాంతతను అందించే పవిత్ర శక్తి కేంద్రాలు. దారిలో వెళ్తున్నప్పుడు దూరంగా కనిపిచే ఎత్తైన ఆలయ రాజగోపురాన్ని చూడగానే మనస్సు తెలియని భక్తిభావంతో పులకరిస్తుంది. అయితే, ద్రావిడ శైలిలో నిర్మించే దక్షిణాది ఆలయాల రాజగోపురాలు అంత ఎత్తుగా ఎందుకు నిర్మిస్తారో తెలుసా? దాని వెనుక అద్భుతమైన ఆధ్యాత్మిక, విజ్ఞాన రహస్యాలు దాగి ఉన్నాయి.
ఆలయ నిర్మాణం ... దైవిక స్వరూపం
భారతీయ శిల్పశాస్త్రం ప్రకారం దేవాలయ నిర్మాణం మానవ శరీర ఆకృతిని పోలి ఉంటుంది. ఆలయంలోని ప్రతి భాగం భగవంతుడి అవయవంగా కొలవబడుతుంది. రాజగోపురం భగవంతుడి దివ్య 'పాదాలు'గా, ముఖమండపం లేదా ప్రాకారం స్వామివారి కటి భాగంగా, గర్భగుడిని పరమాత్మ వశించే శిరస్సుగా చెబుతారు. అందుకే ప్రాచీన మునులు "గోపుర దర్శనం పాప వినాశనం" అని చెప్పారు. సమయాభావం వల్లో లేదా ఇతర కారణాల వల్లో గర్భగుడిలోని మూలవిరాట్టును దర్శించుకోలేని భక్తులు, బయటి నుంచే ఆకాశాన్ని తాకే రాజగోపురానికి మనసారా నమస్కరిస్తే, స్వామివారి పవిత్ర పాద పద్మాలను స్పృశించినంత దైవిక ఫలం ప్రాప్తిస్తుందని వేద పండితులు చెబుతారు.
ఎత్తైన నిర్మాణాల వెనుక దాగివున్న అంతరార్థం
ఉత్తరాది ఆలయాల ముఖద్వారాల వద్ద తోరణాలు ప్రధానంగా కనిపిస్తే, దక్షిణాదిలో మాత్రం పదుల సంఖ్యలో అంతస్తులతో ఎత్తైన గోపురాలు దర్శనమిస్తాయి. భగవంతుడు ఒక్కరి సొత్తు కాదు, ఆయన సర్వాంతర్యామి, సృష్టి అంతటికీ అతీతుడు అని చాటిచెప్పడానికే ఈ గోపురాలను ఎత్తులో నిర్మించేవారు. అలాగే, మానవుడు సైన్స్, సాంకేతికతలో ఎంత ఎత్తుకు ఎదిగినా మహా ప్రకృతి ముందు అల్పుడేననే జీవన సత్యాన్ని కొండలపై నిర్మించే ఆలయాలు గుర్తుచేస్తాయి. పూర్వకాలంలో వరదలు, తుఫానులు వంటి ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు, గ్రామాలు నీటమునిగినా కొండలపై ఉన్న ఎత్తైన ఆలయాలు వేలాది మందికి ప్రాణరక్షణ కల్పించే పునరావాస కేంద్రాలుగా ఉపయోగపడేవి. ఇలా మన పూర్వీకులు ఆధ్యాత్మికతతో పాటు మానవాళి సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకునే ఆలయ గోపురాలను ఎత్తైన ప్రదేశాల్లో అత్యంత గంభీరంగా నిర్మించారు.




