Festivals: పండుగలను ఎందుకు జరుపుకుంటారు...మన పెద్దలు చెప్పిన రహస్యం ఏమిటో తెలుసా?

ఉగాది నుంచి హోలీ వరకు మనం జరుపుకునే పండుగల వెనుక ఉన్న ఆధ్యాత్మిక, సామాజిక సందేశాలేమిటి? ప్రతి పండుగ మనకు చెప్పే జీవన పాఠాలు, భారతీయ సంప్రదాయాల విశిష్టతలు గురించి తెలుసుకుందాం.

Balachander
Published on: 11 Sept 2026 9:24 AM IST
Festivals: పండుగలను ఎందుకు జరుపుకుంటారు...మన పెద్దలు చెప్పిన రహస్యం ఏమిటో తెలుసా?
X

Festivals: పండుగ అంటే కొత్త బట్టలు, రకరకాల పిండి వంటలు, ఇంట్లో సందడి, దేవుడి పూజ, బంధువుల రాకపోకలు.. ఇవే చాలామందికి గుర్తొస్తాయి. కానీ మనం జరుపుకునే ప్రతి పండుగను ఒకసారి లోతుగా చూస్తే మరో ఆసక్తికరమైన విషయం కనిపిస్తుంది. మన పండుగలు కేవలం పూజలు, వ్రతాల కోసం ఏర్పడినవి కావు.. మనిషి ఎలా జీవించాలో చెప్పే జీవన పాఠాల్లా కూడా ఉన్నాయి. అందుకే ఉగాది నుంచి హోలీ వరకు ఒక్కో పండుగకు ఒక్కో ప్రత్యేకమైన సందేశాన్ని మన పెద్దలు జోడించారు.

ఉగాది

ఏడాది ప్రారంభాన్ని సూచించే ఉగాదినే తీసుకుంటే.. జీవితంలో తీపి, పులుపు, చేదు, వగరు, కారం, ఉప్పు వంటి భిన్న రుచులు ఎలా ఉంటాయో, మన జీవితంలోనూ సుఖదుఃఖాలు అలాగే ఉంటాయని చెబుతుంది. ఆనందం వచ్చినప్పుడు పొంగిపోకుండా, కష్టం వచ్చినప్పుడు కుంగిపోకుండా అన్నింటినీ సమానంగా స్వీకరించాలనే భావన ఇందులో కనిపిస్తుంది.

శ్రీరామనవమి...అక్షయతృతీయ

శ్రీరామనవమి దాంపత్య జీవితానికి, కుటుంబ విలువలకు ప్రతీకగా నిలుస్తుంది. శ్రీరాముడు, సీతాదేవి జీవితాన్ని గుర్తుచేసుకుంటూ భార్యాభర్తల మధ్య నమ్మకం, బాధ్యత, అనుబంధం ఎంత ముఖ్యమో ఈ పండుగ గుర్తుచేస్తుంది. అదేవిధంగా, అక్షయ తృతీయ పేరు వినగానే సంపద, బంగారం కొనుగోళ్లు గుర్తొస్తాయి. అయితే సంపదను కూడబెట్టడమే కాదు.. విలువైన దానిని సృష్టించడం, దానం చేయడం, మంచి పనులకు శ్రీకారం చుట్టడం కూడా జీవితంలో ముఖ్యమేననే భావనను ఈ పర్వదినంతో అనుసంధానించారు.

గురుపూర్ణిమ...నాగుల చవితి

గురుపూర్ణిమ మాత్రం మనిషి ఎదుగుదల వెనుక ఉన్న గురువు విలువను గుర్తుచేస్తుంది. మనకు విద్యను, జ్ఞానాన్ని, జీవితాన్ని అర్థం చేసుకునే దారిని చూపిన గురువులను మరచిపోవద్దని చెబుతుంది. అంతేకాదు, ప్రకృతితో మనిషికి ఉన్న బంధాన్ని గుర్తుచేసే పండుగల్లో నాగులచవితి ఒకటి. పాములంటే భయం ఉన్నప్పటికీ వాటిని కూడా ప్రకృతిలోని జీవులుగా గౌరవించే సంప్రదాయాన్ని ఇది ప్రతిబింబిస్తుంది. భూమిపై మనిషికే కాదు, ఇతర జీవులకు కూడా స్థానం ఉందనే ఆలోచన ఇందులో కనిపిస్తుంది.

వరలక్ష్మీవ్రతం...వినాయకచవితి

సంపద అంటే కేవలం ఇంట్లో దాచుకునే వస్తువు కాదని వరలక్ష్మీవ్రతం గుర్తుచేస్తుంది. మన దగ్గర ఉన్న ఐశ్వర్యం, సంతోషం, ఆహారం, సామర్థ్యాన్ని ఇతరులతో పంచుకున్నప్పుడే దానికి అసలైన విలువ వస్తుందనే సందేశం ఇందులో ఉంది. ఇక, రాఖీ పౌర్ణమి అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య అనుబంధానికి ప్రతీక. కాలం ఎంత మారినా తోడబుట్టినవారిని మరచిపోకుండా, కష్టసుఖాల్లో ఒకరికొకరు అండగా నిలవాలనే కుటుంబ విలువను ఈ పండుగ గుర్తుచేస్తుంది. ఇక ఇదిలా ఉంటే, వినాయకచవితి మాత్రం కుటుంబాన్ని దాటి సమాజం వైపు తీసుకెళ్లే పండుగగా కనిపిస్తుంది. వీధి, ఊరు, ప్రాంతం అనే తేడాలు లేకుండా అందరూ కలిసి పండుగ జరుపుకోవడం ద్వారా ఐక్యతలోనే ఆనందం ఉందనే భావనను బలపరుస్తుంది. వినాయకచవితి సమయంలో వచ్చే మరో ముఖ్యమైన విశేషం పితృపక్షాలు. మన పూర్వీకులను స్మరించుకునే పితృ అమావాస్య కూడా అంతే ముఖ్యమైనది. మన కోసం జీవితాన్ని త్యాగం చేసిన పెద్దలను గుర్తు చేసుకోవడం, వారి పట్ల కృతజ్ఞత చూపడం మన బాధ్యత అనే విషయాన్ని ఇది గుర్తుచేస్తుంది.

దసరా...దీపావళి

దసరాలో చెడుపై మంచి సాధించిన విజయాన్ని జరుపుకుంటాం. అయితే ఇందులో మరో సామాజిక సందేశం కూడా ఉంది. మన జీవితంలో మనకు సహకరించే వ్యక్తులను, మన పనుల్లో అండగా నిలిచే వారిని గౌరవించడం కూడా విజయానికి అవసరమే. దీపావళి చీకటిని తొలగించి వెలుగును నింపే పండుగ. దీపం వెలిగించడం వెనుక ఉన్న భావనను జీవితానికి అన్వయిస్తే.. మన జీవితం మనకే కాకుండా మరో పది మందికి ఉపయోగపడేలా ఉండాలనే సందేశం కనిపిస్తుంది.

కార్తీకం..సంక్రాంతి

చలికాలంలో వచ్చే కార్తీకమాసం, కార్తీక పౌర్ణమి ఆధ్యాత్మిక సాధనకు ప్రాధాన్యం ఇస్తాయి. తెల్లవారుజామున స్నానం, దీపారాధన, నియమాలు వంటి ఆచారాల ద్వారా శరీరం, మనసుపై నియంత్రణ పెంచుకోవాలనే భావనను పెద్దలు చెప్పారు. సంక్రాంతి మాత్రం మన జీవనాధారమైన వ్యవసాయాన్ని గుర్తుచేసే పండుగ. రైతు, పంట, పశువులు, ప్రకృతి.. ఇవన్నీ మన జీవనంతో ఎంతగా ముడిపడి ఉన్నాయో ఈ మూడు రోజుల సంక్రాంతి సంబరాలు తెలియజేస్తాయి.

మహాశివరాత్రి...హోళి

మహాశివరాత్రి ఉపవాసం, జాగరణ, ధ్యానం వంటి ఆచారాలతో మనస్సును అదుపులో ఉంచుకోవడం, కోరికలపై నియంత్రణ సాధించడం వంటి ఆధ్యాత్మిక భావనను ముందుకు తెస్తుంది. ఇక చివరగా హోలీ. ఎన్నో రంగులు కలిసి ఒక అందమైన దృశ్యాన్ని సృష్టించినట్టే, భిన్నమైన ఆలోచనలు, స్వభావాలు, అభిప్రాయాలు కలిగిన మనుషులు కూడా కలిసి జీవిస్తే సమాజం మరింత అందంగా మారుతుందనే సందేశాన్ని ఈ పండుగ ఇస్తుంది.

అందుకే మన పండుగలను కేవలం సంవత్సరంలో వచ్చే కొన్ని సెలవు రోజులుగా చూడకూడదు. ఉగాది నుంచి హోలీ వరకు కనీసం 15కు పైగా ముఖ్యమైన పండుగలు, పర్వదినాలు మన జీవితంలోని ఏదో ఒక విలువను గుర్తుచేస్తాయి. భక్తిని ముందు ఉంచి ఆచారాలను పాటించినా.. వాటి వెనుక ఉన్న సామాజిక ప్రయోజనాన్ని అర్థం చేసుకున్నప్పుడే ఆ పండుగకు మరింత అర్థం వస్తుంది. మన పెద్దలు పండుగను సృష్టించలేదు.. ఒక జీవన విధానాన్ని పండుగ రూపంలో మనకు అందించారు. అదే మన పండుగల అసలైన ప్రత్యేకత.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story