Yaganti: యాగంటిలో బసవడికే కాదు...కాకులకు ఓ కథ ఉంది...

యాగంటి ఆలయంలో నందీశ్వరుడి విగ్రహం రోజు రోజుకు పెరుగుతుంది. అంతేకాదు, ఆలయ ప్రాంగణంలో కాకులు కూడా కనిపించవు. దీనికి సంబంధించిన విశేషాలను తెలుసుకుందాం.

Balachander
Published on: 26 Jun 2026 11:55 AM IST
Yaganti: యాగంటిలో బసవడికే కాదు...కాకులకు ఓ కథ ఉంది...
X

Yaganti: సృష్టిలోని అద్భుతాలన్నింటినీ తన గర్భంలో దాచుకున్న నల్లమల అరణ్యాలలో వెలిసిన పరమ పవిత్ర శైవక్షేత్రం ‘యాగంటి’. కర్నూలు జిల్లా బనగానపల్లె సమీపంలో కొలువైన ఈ ఆలయంలో ఉమామహేశ్వరుడు ఏకశిలా లింగరూపంలో భక్తులకు దర్శనమిస్తాడు. అయితే, ఈ క్షేత్ర ప్రశస్తి ప్రపంచవ్యాప్తం కావడానికి ఇక్కడి రెండు అంతుచిక్కని రహస్యాలే కారణం. ఒకటి... శతాబ్దాలుగా నిరంతరం పెరుగుతూ, జీవకళతో ఉట్టిపడే నందీశ్వరుడి విగ్రహం కాగా, రెండోది.. చుట్టూ దట్టమైన అడవి ఉన్నప్పటికీ ఈ ఆలయ ప్రాంగణంలో ఒక్క కాకి కూడా అడుగుపెట్టకపోవడం.

శాస్త్రవేత్తలను విస్మయపరుస్తున్న బసవన్న ఎదుగుదల

యాగంటి క్షేత్రంలో అడుగుపెట్టగానే భక్తులను మొట్టమొదట ఆకర్షించేది ఇక్కడి నంది విగ్రహం. పూర్వం స్వయంభూవుగా వెలిసిన ఈ బసవన్న విగ్రహం తొలినాళ్లలో ఎంతో చిన్నదిగా ఉండేదట. కానీ కాలం గడుస్తున్న కొద్దీ ఈ శిలా విగ్రహంలో పెరుగుదల కనిపిస్తూ వస్తోంది. పురావస్తు శాఖ పరిశోధనల ప్రకారం... ఈ నందీశ్వరుని విగ్రహం ప్రతి 20 సంవత్సరాలకు ఒక అంగుళం చొప్పున పెరుగుతోంది. విగ్రహం పరిమాణం నిరంతరం పెరుగుతుండటం వల్ల, ఆలయ నిర్వాహకులు ప్రాంగణంలోని కొన్ని స్తంభాలను సైతం తొలగించాల్సి వచ్చింది. ఈ వింతను ఛేదించడానికి ఎందరో అంతర్జాతీయ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసినా, శిల ఎలా పెరుగుతోందనే దానికి సమాధానం దొరకలేదు. శ్రీపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి తన కాలజ్ఞానంలో చెప్పినట్లు... కలియుగాంతంలో ఈ యాగంటి బసవన్న లేచి నిలబడి రంకె వేస్తుందనే నమ్మకం భక్తులలో బలంగా ఉంది.

కాకులు దూరని కారడవి ... అగస్త్య మహర్షి శాపం

కథల్లో ‘కాకులు దూరని కారడవి’ అని వింటుంటాం, కానీ యాగంటి విషయంలో అది అక్షరాలా నిజం. చుట్టూ ఎత్తైన కొండలు, చెట్లు ఉన్నా ఆలయ పరిసరాల్లో ఒక్క కాకి కూడా వాలదు. దీని వెనుక ఒక పురాణ గాథ ఉంది. పూర్వం అగస్త్య మహాముని ఈ పవిత్ర భూమిపై పరమశివుని అనుగ్రహం కోసం యాగం తలపెట్టారు. ఆ సమయంలో రాక్షసులు కొందరు కాకుల రూపం ధరించి, యాగ గుండంలో మాంసం ముక్కలు వేస్తూ యాగానికి భంగం కలిగించారు. తీవ్ర ఆగ్రహానికి లోనైన అగస్త్య మహర్షి... "ఇకపై ఏ కాకి కూడా ఈ క్షేత్ర పరిధిలోకి అడుగుపెట్టకూడదు" అని శపించారు. ముని శాప ప్రభావంతో నాటి నుండి నేటివరకు యాగంటిలో కాకులు సంచరించవు. శనిదేవుని వాహనమైన కాకి ఇక్కడ ఉండదు కాబట్టి, ఈ క్షేత్రంలో అడుగుపెడితే శని దోషాలన్నీ తొలగిపోతాయని పండితులు చెబుతారు. ఆధ్యాత్మిక ప్రశాంతతను, దైవ మహిమను ఒకేచోట అనుభవించాలనుకునే భక్తులకు యాగంటి ఒక దివ్యధామం.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story