Yanamadurru Temple: మహాశివుడు ఇక్కడ తలక్రిందులుగా దర్శనం ఇస్తాడు...ఎందుకో తెలిస్తే ఆశ్చర్యపోతారు
యనమదుర్రు శక్తేశ్వరస్వామి ఆలయంలో మహాశివుడు శీర్షాసనంలో యోగనిద్రలో దర్శనమిస్తారు. ఈ అరుదైన క్షేత్రం వెనుక ఉన్న యమధర్మరాజు తపస్సు కథ ఏమిటో తెలుసుకుందాం.
Yanamadurru Temple: భారతదేశంలో ఎన్నో శివాలయాలు ఉన్నాయి. కానీ స్వామివారు శీర్షాసనంలో, అంటే తలక్రిందులుగా దర్శనమిచ్చే ఏకైక క్షేత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమ గోదావరి జిల్లాలోని యనమదుర్రు. ఇక్కడి శక్తేశ్వరస్వామి ఆలయంలో పరమశివుడు శీర్షాసనం వేసి యోగ నిద్రలో విగ్రహ రూపంలో కొలువుదీరగా, ఆయన పక్కనే మూడు నెలల పసికందు అయిన కుమారస్వామిని ఒడిలో లాలిస్తూ జగన్మాత పార్వతీదేవి దర్శనమిస్తుంది. త్రేతాయుగం నాటిదిగా విశ్వసించే ఈ దివ్య మూర్తులు సుమారు 1,000 సంవత్సరాల క్రితం జరిపిన తవ్వకాల్లో ఒకే పీఠంపై స్వయంభూవుగా వెలుగుచూశాయి.
యమధర్మరాజు తపస్సు .... యనమదుర్రు పేరు వెనుక చరిత్ర
త్రేతాయుగంలో శంబరీవి ద్వీప ప్రాంతంలో ప్రస్తుతం భీమవరం సమీపంలో శంబరుడనే రాక్షసుడు మునులను, ఋషులను తీవ్రంగా హింసించేవాడు. మునుల ప్రార్థన మేరకు యమధర్మరాజు శంబరునితో పోరాడినప్పటికీ పలుమార్లు పరాజయం పాలయ్యాడు. అవమాన భారంతో యముడు శివుని కోసం తీవ్రమైన తపస్సు చేశాడు. అయితే పరమేశ్వరుడు యోగ నిద్రలో ఉండిపోగా, యముడి తపస్సుకు మెచ్చిన పార్వతీదేవి తన శక్తి అంశను యమధర్మరాజుకు ప్రసాదించింది. ఆ దివ్య శక్తితో యముడు రాక్షసుడిని సంహరించాడు. ఈ విజయానికి గుర్తుగా యమధర్మరాజు ఈ ప్రాంతాన్ని 'యమపురి'గా నామకరణం చేయగా, కాలక్రమేణా అది యమునాపురంగా, ప్రస్తుతం 'యనమదుర్రు'గా మారింది.
శీర్షాసనంలో శివుడు ... పార్వతీదేవి కాపలా
శంబరుని సంహారం తర్వాత రాక్షసుల భయం లేకుండా ఈ ప్రాంతంలోనే కొలువుదీరాలని యమధర్మరాజు ఆదిదంపతులను ప్రార్థించాడు. యముని కోరిక మేరకు పరమశివుడు శీర్షాసన స్థితిలోనే యోగ నిద్రను కొనసాగిస్తూ స్థిరపడ్డాడు. యోగ నిద్రలో ఉన్న స్వామివారికి ఎలాంటి భంగం కలగకుండా చూసేందుకు, అమ్మవారు తన మూడు నెలల పసిబిడ్డ కుమారస్వామిని ఒడిలో పెట్టుకుని నిత్యం కాపలాగా ఉంటూ శక్తేశ్వరిగా వెలిసింది.
ప్రపంచంలోనే అరుదైన విగ్రహ రూపం
ఈ ఆలయంలోని శక్తేశ్వరస్వామి విగ్రహం అత్యంత విస్మయకరమైన శిల్పకళా శైలి కలిగి ఉంది. స్వామివారి జటాజూటం కింద భూమిని తాకుతుండగా, పాదాలు ఆకాశం వైపు ఉంటాయి. విగ్రహాన్ని పరిశీలిస్తే జటాజూటం, ముఖం, కంఠం, ఉదరం, మోకాళ్లు, చీలమండలు, పాదాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఒకే పీఠంపై శీర్షాసనంలో ఉన్న పరమేశ్వరుడు, కుమారస్వామితో కూడిన పార్వతీదేవి, నందీశ్వరుడు దర్శనమిచ్చే ఈ యనమదుర్రు క్షేత్రం ఆధ్యాత్మికంగా అత్యంత అరుదైన నిలయం.




