Yanamadurru Temple: ప్రపంచంలో మరెక్కడా కనిపించని వింత...ఇక్కడ మహాశివుడు శీర్షాసనంతో దర్శనం
పశ్చిగోదావరి జిల్లా యనమదుర్రు గ్రామంలోని శివాలయంలో మహాశివుడు ఎక్కడా లేని విధంగా శీర్షాసనంలో భక్తులకు దర్శనం ఇస్తారు. ఆలయం ప్రత్యేకత ఏమిటో తెలుసుకుందాం.
Yanamadurru Temple: సనాతన ధర్మంలో పరమేశ్వరుని లింగాకారంలోనూ, శాంత మూర్తిగానూ పూజించడం మనకు తెలుసు. అయితే, ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా శివుడు శీర్షాసనంలో యోగ నిద్రలో దర్శనమిచ్చే అరుదైన దివ్య క్షేత్రం ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సమీపంలో ఉన్న 'యనమదుర్రు' ఉంది. త్రేతాయుగం నాటి ప్రాచీన చరిత్ర కలిగిన ఈ శక్తేశ్వరస్వామి ఆలయం నిండైన ఆధ్యాత్మికతకు, పౌరాణిక అద్భుతాలకు నిలయం. భూమిని తాకే జటాజూటంతో శీర్షాసనంలో శివుడు, ఆయన పక్కనే మూడు నెలల పసిబిడ్డ అయిన కుమారస్వామిని ఒడిలో పడుకోబెట్టుకుని రక్షించే పార్వతీదేవి ఒకే పీఠంపై కొలువై ఉండటం ఈ క్షేత్ర విశేషం
యమపురి ... యనమదుర్రు క్షేత్ర పౌరాణిక కథ
త్రేతాయుగంలో శ్రీరామచంద్రుని కాలంలో భీమవరం సమీపంలోని బంగాళాఖాతం తీరంలో శంబరీవి ద్వీపం ఉండేది. అక్కడ శంబరుడు అనే ఘోర రాక్షసుడు సంచరిస్తూ మునుల తపస్సుకు ఆటంకం కలిగిస్తుండేవాడు. మునుల ప్రార్థన మేరకు యమధర్మరాజు శంబరుడితో యుద్ధం చేసినప్పటికీ అనేకసార్లు అపజయం పాలయ్యాడు. తీవ్ర అవమాన భారంతో యమధర్మరాజు ఈ ప్రాంతంలో పరమశివుని కోసం ఘోరమైన తపస్సు ఆచరించాడు. అయితే శివుడు లోతైన యోగనిద్రలో ఉండిపోవడంతో, పార్వతీదేవి యముని ఆరాధనకు మెచ్చి తన దివ్య 'శక్తి' అంశను ప్రసాదించింది. ఆ మహాశక్తి సహాయంతో యముడు శంబరుడిని సంహరించాడు. తన విజయానికి కృతజ్ఞతగా ఈ ప్రాంతానికి 'యమపురి' అని నామకరణం చేయగా, కాలక్రమంలో అది యమునాపురంగా, ప్రస్తుతం 'యనమదుర్రు'గా ప్రసిద్ధి చెందింది.
శీర్షాసన శివ స్వరూపం ... అరుదైన స్వయంభూ మూర్తి
యముని అభ్యర్థన మేరకు రాక్షసుల భయం లేకుండా ఉండేందుకు పార్వతీ పరమేశ్వరులు ఇక్కడ స్వయంభూగా వెలిశారు. సుమారు 1000 సంవత్సరాల క్రితం జరిగిన భూమి తవ్వకాల్లో ఈ దివ్య విగ్రహాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఆలయంలోని శక్తేశ్వరస్వామి శీర్షాసనంలో ఉంటారు. స్వామివారి తల, జటాజూటం భూమిని తాకుతుండగా... ముఖం, కంఠం, ఉదరం, మోకాళ్లు, పాదాలు ఆకాశం వైపు ఊర్థ్వ ముఖంగా స్పష్టంగా కనిపిస్తాయి. యోగ నిద్రలో ఉన్న పరమేశ్వరుడికి ఎలాంటి భంగం కలగకుండా చూసేందుకు, జగన్మాత పార్వతీదేవి తన మూడు నెలల పసికందు కుమారస్వామిని ఒడిలో ఉంచుకుని కాపలాగా నిలబడినట్లుగా దర్శనమిస్తుంది. అమ్మవారి దివ్య శక్తితో రక్షించబడుతున్న ఈ శక్తేశ్వరస్వామిని నాగపంచమి, కార్తీక మాసం, శివరాత్రి పర్వదినాల్లో దర్శించుకోవడం వల్ల సమస్త భయాలు, సర్ప దోషాలు తొలగి ఆయురారోగ్యాలు లభిస్తాయని భక్తుల విశ్వాసం.




