Yogini Ekadashi 2026: స్మార్త యోగిని ఏకాదశి విశిష్టత... ఐశ్వర్యంతో పాటు కుబేరుడు మీ సోంతం

యోగిని ఏకాదశి రోజున ఉపవాసం ఉండి శ్రీమహావిష్ణువును ఆరాధించిన వారికి లక్ష్మీకటాక్షంతో పాటు సకల పాపాల నుంచి విముక్తి లభిస్తుందని పండితులు చెబుతున్నారు.

Balachander
Published on: 10 July 2026 8:45 AM IST
Yogini Ekadashi 2026: స్మార్త యోగిని ఏకాదశి విశిష్టత... ఐశ్వర్యంతో పాటు కుబేరుడు మీ సోంతం
X

Yogini Ekadashi 2026: జ్యేష్ఠ బహుళ పక్షంలో వచ్చే ఏకాదశిని యోగిని ఏకాదశి అంటారు. ఈ ఒక్క ఏకాదశి వ్రతాన్ని నిష్ఠతో ఆచరిస్తే చాలు... 88,000 మంది బ్రాహ్మణులకు అన్నదానం చేసినంత పుణ్యఫలం దక్కుతుందని స్వయంగా శ్రీకృష్ణ పరమాత్ముడు ధర్మరాజుకు వివరించాడు. ఎంతటి భయంకరమైన పాపాలనైనా, కుష్టు వంటి దీర్ఘకాలిక వ్యాధులనైనా తొలగించి, జీవితంలో భోగభాగ్యాలను, అంతిమంగా మోక్షాన్ని ప్రసాదించే అద్భుతమైన శక్తి ఈ రోజుకు ఉంది. ఈ పవిత్రమైన రోజు వెనుక పురాణాల్లో ఒక ఆసక్తికరమైన కథ ప్రచారంలో ఉంది. ఆ వివారాలు తెలుసుకుందాం.

కుబేరుని శాపం ... హేమమాలి వ్యథ

స్వర్గలోకంలోని అలకాపురి నగరానికి పాలకుడు, ధనాధిపతి అయిన కుబేరుడు పరమ శివభక్తుడు. ఆయన ప్రతిరోజూ శివలింగానికి రకరకాల దివ్యమైన పుష్పాలతో పూజలు చేసేవాడు. ఆ పూజ కొరకు మానస సరోవరం నుండి తాజా పూలను తీసుకురావడానికి హేమమాలి అనే యక్షుడిని నియమించాడు. ఒకరోజు ఉదయాన్నే హేమమాలి పూలను సేకరించాడు. కానీ, తన భార్య అయిన స్వరూపావతి అందానికి ముగ్ధుడై, ఆమెతో క్రీడిస్తూ సమయాన్ని పూర్తిగా మరిచిపోయాడు. ఇటు కుబేరుడి పూజా సమయం దాటిపోతోంది. ఎంతకీ పూలు రాకపోవడంతో ఆగ్రహించిన కుబేరుడు సేవకులను పంపి విషయం తెలుసుకున్నాడు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించి, కామమోహితుడైన హేమమాలిని కుష్టురోగిగా మారిపోవాలని, భార్యకు దూరంగా భూలోకంలో ఉండిపోవాలని శపిస్తాడు.

మార్కండేయ మహర్షి ఉపాయం

శాపం తక్షణమే ఫలించింది. హేమమాలి అందమైన రూపం పోయి, ఒళ్లంతా కుష్టు వ్యాధితో బాధపడుతూ భూలోకంలో అడవుల పాలు అయ్యాడు. ఆకలి దప్పులతో, భార్యావియోగంతో ఎన్నో ఏళ్లు నరకయాతన అనుభవించాడు. అలా తిరుగుతూ ఒకరోజు అదృష్టవశాత్తూ మేరు పర్వతంపై నివసిస్తున్న మార్కండేయ మహర్షి ఆశ్రమానికి చేరుకున్నాడు. మహర్షి పాదాలపై పడి తన తప్పును ఒప్పుకొని, శాప విముక్తికై ప్రార్థించాడు. హేమమాలి దీనస్థితిని చూసి చలించిన మార్కండేయ మహర్షి ఒక దివ్యమైన ఉపాయం చెప్పారు. చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తంగా జ్యేష్ఠ బహుళ పక్ష ఏకాదశి రోజున యోగిని ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలని చెబుతాడు. ఉపవాసం చేసి ఆ లక్ష్మీనారాయణుడిని పూజించాలని, తద్వారా కర్మలన్నీ తొలగిపోతాయని చెబుతాడు మార్కండేయ మహర్షి.

లక్ష్మీనారాయణుల అనుగ్రహం .... పూర్వ వైభవం

మహర్షి మాటలపై నమ్మకంతో హేమమాలి ఆ ఏకాదశి రోజున కఠిన ఉపవాస దీక్షను చేపట్టాడు. రాత్రి జాగరణ చేస్తూ విష్ణునామస్మరణ చేశాడు. ఆ నిష్ఠకు మెచ్చిన శ్రీమహావిష్ణువు అతని పాపాలను కడిగేసి, కుష్టు వ్యాధిని పూర్తిగా నయం చేశాడు. హేమమాలికి తిరిగి పూర్వపు దివ్యరూపం లభించింది. శాపవిముక్తుడైన అతను అలకాపురి చేరి, తన భార్యతో కలిసి మళ్లీ ఆనందంగా జీవించాడు.

సాధారణ భక్తులు ఏమి చేయాలి?

ఈ కథ మనకు ఇచ్చే ముఖ్యమైన సందేశం ఒక్కటే... ఎంతటి కష్ట కాలంలో ఉన్నా, వ్యాధులతో బాధపడుతున్నా ఏకాదశి వ్రతం రక్షణ కవచంలా నిలుస్తుంది. ఈ రోజు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి, విష్ణుపూజ చేయాలి. ఆరోగ్యం సరిగా ఉండి శక్తి ఉన్నవారు ఈరోజంతా ఉపవాసం ఉంటారు. అనారోగ్యంతో బాధపడేవారు పండ్లు, పాలు తీసుకోవచ్చు. అదేవిధంగా ఈరోజు వీలైనంత వరకు ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపించాలి. ఏకాదశి తరువాత వచ్చే ద్వాదశి రోజు ఉదయం పూజ ముగించి, ఎవరికైనా అన్నదానం చేసి భోజనం చేయాలి. ఇలా చేయడం వలన ఆరోగ్య సమస్యలు తొలగడమే కాకుండా, కుబేరుడి అనుగ్రహం కలుగుతుంది. లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుందని పండితులు చెబుతున్నారు.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story