Vaibhav Suryavanshi: ఐపీఎల్ అనుకుంటివా..? మడత మడతెట్టేస్తారు!

Vaibhav Suryavanshi: 15 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ ఇంగ్లాండ్‌పై అరంగేట్రం చేసి సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న సరికొత్త రికార్డును బద్దలు కొట్టాడు.

Naresh.k
Published on: 5 July 2026 10:27 AM IST
Vaibhav Suryavanshi
X

Vaibhav Suryavanshi: ఐపీఎల్ అనుకుంటివా..? మడత మడతెట్టేస్తారు!

India vs England 2nd T20: అద్భుతమైన ఐపీఎల్ ఫామ్‌.. అంతకుమించిన భారీ అంచనాలు.. కానీ కట్ చేస్తే, ఇంటర్నేషనల్ క్రికెట్ పిచ్‌పై తొలి అడుగే తడబడింది. ఐపీఎల్‌లో పరుగుల వరద పారించి భారత జాతీయ జట్టులోకి దూసుకొచ్చిన 15 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీకి తన అరంగేట్రం మ్యాచ్‌లోనే తీవ్ర నిరాశ ఎదురైంది. ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో ఈ కుర్రాడు దారుణంగా విఫలమవడంతో సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు, క్రికెట్ ఫ్యాన్స్ తీవ్ర స్థాయిలో విమర్శల వర్షం కురిపిస్తున్నారు.

మాంచెస్టర్ వేదికగా ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానంలో ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్ ద్వారా వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ మ్యాచ్‌తో వైభవ్ ఒక అరుదైన మైలురాయిని అందుకున్నాడు. కేవలం 15 ఏళ్ల 99 రోజుల వయసులోనే టీమిండియా క్యాప్ ధరించి, అంతర్జాతీయ క్రికెట్ ఆడిన అత్యంత పిన్న వయస్కుడైన భారతీయ క్రికెటర్‌గా వైభవ్ సూర్యవంశీ రికార్డులకెక్కాడు. 1989లో పాకిస్థాన్‌పై అరంగేట్రం చేసిన గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ టెండూల్కర్ రికార్డును వైభవ్ తుడిచేసాడు.

ఈ మ్యాచ్‌లో సీనియర్ ప్లేయర్, వరల్డ్ కప్ విన్నింగ్ టీమ్ మెంబర్ సంజూ శాంసన్‌ను పక్కనపెట్టి మరీ టీమిండియా మేనేజ్‌మెంట్ ఈ 15 ఏళ్ల కుర్రాడికి ఓపెనర్‌గా బరిలోకి దించింది. ఇంగ్లాండ్ స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ వేసిన ఓవర్లో భీకరమైన సిక్సర్‌తో ఇన్నింగ్స్ ప్రారంభించిన వైభవ్.. ఫ్యాన్స్‌లో భారీ ఆశలు రేకెత్తించాడు. కానీ, ఆ ఊపును ఎంతోసేపు కొనసాగించలేకపోయాడు. క్రీజులో ఎదుర్కొన్నది 10 బంతులే అయినా, అందులో కేవలం 14 పరుగులు మాత్రమే చేసి, పార్ట్ టైమ్ స్పిన్నర్ విல் జాక్స్ బౌలింగ్‌లో జోస్ బట్లర్‌కు దొరికిపోయి స్టంపౌట్ అయ్యాడు.

ఐపీఎల్ 2026 సీజన్‌లో పరుగుల వరద పారించి ఏకంగా ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్న వైభవ్.. ఇంగ్లాండ్ స్వింగ్ పిచ్‌లపై తేలిపోవడంతో నెటిజన్లు సోషల్ మీడియాలో ఆటాడుకుంటున్నారు. ఇంగ్లాండ్‌లో ఐపీఎల్ లాంటి ఫ్లాట్ పిచ్‌లు ఉండవు తమ్ముడూ.. ఇక్కడ బంతి స్వింగ్ అవుతుంది, పరుగులు చేయడం అంత ఈజీ కాదు అంటూ కొందరు ఘాటుగా కామెంట్లు పెడుతున్నారు. మరికొందరైతే.. కేవలం ఒకే ఒక్క ఐపీఎల్ సీజన్ చూసి, విరాట్ కోహ్లీ లాంటి లెజెండ్స్‌తో పోల్చడం ఆపండి అని విమర్శిస్తున్నారు.

మరోవైపు సంజూ శాంసన్ అభిమానులు బీసీసీఐపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. వరల్డ్ కప్ గెలిచిన ఒక సీనియర్ వికెట్ కీపర్ బ్యాటర్‌ను బెంచ్‌కే పరిమితం చేసి, కేవలం ఐపీఎల్ అనుభవంతో ఒక కుర్రాడికి ఎలా ఓపెనింగ్ ఛాన్స్ ఇస్తారంటూ నిలదీస్తున్నారు. వైభవ్ ఔటైన తీరును చూపిస్తూ సంజూ శాంసన్ డ్రెస్సింగ్ రూమ్‌లో నవ్వుకుంటున్నాడనే మీమ్స్‌తో సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు.

అంతర్జాతీయ వేదికపై తొలి మ్యాచ్‌లోనే విఫలమైనంత మాత్రాన వైభవ్ సూర్యవంశీ టాలెంట్‌ను తక్కువ అంచనా వేయలేం. కేవలం 15 ఏళ్ల వయసులో ఇంగ్లాండ్ లాంటి కఠినమైన కండిషన్స్‌లో, ఆర్చర్ లాంటి వరల్డ్ క్లాస్ బౌలర్లను ఫేస్ చేయడం అంత సాదాసీదా విషయం కాదు. ఈ విమర్శలన్నింటినీ పక్కనపెట్టి, తన తొలి మ్యాచ్ తప్పుల నుండి పాఠాలు నేర్చుకుని రాబోయే మ్యాచుల్లో ఈ వండర్ కిడ్ ఎలా పుంజుకుంటాడనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Naresh.k

Naresh.k

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story