అతడిని తప్పించి మరో తప్పు చేయొద్దు, మూల్యం చెల్లించుకోక తప్పదు.. బీసీసీఐకి మాజీ కోచ్ హెచ్చరిక!
వరుస పరాజయాల నేపథ్యంలో శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Abhishek Nayar Warns BCCI Against Sacking Shreyas Iyer as T20I Captain
ఇంగ్లండ్ పర్యటనను భారత జట్టు అత్యంత నిరాశాజనకంగా ముగించింది. కొత్త టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో ఐర్లాండ్‌తో రెండు, ఇంగ్లండ్‌తో ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడిన భారత్.. ఒక్క విజయాన్ని కూడా అందుకోలేకపోయింది. ఐర్లాండ్‌పై 2-0, ఇంగ్లండ్‌పై 4-0తో సిరీసులను కోల్పోయింది. వరుస పరాజయాల నేపథ్యంలో శ్రేయస్ కెప్టెన్సీపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీ20 కెప్టెన్‌గా అతడిని కొనసాగించాలా? వద్దా? అనే చర్చ కూడా నెట్టింట మొదలైంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇప్పుడే శ్రేయస్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించడం తొందరపాటు నిర్ణయమవుతుందని, అలా చేస్తే మూల్యం చెల్లించుకోక తప్పదు అని బీసీసీఐని హెచ్చరించాడు.
'టీ20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌కు ఇదే తొలి పర్యటన. ఒక ఛాంపియన్ జట్టు బాధ్యతలను కొత్త కెప్టెన్‌కు అప్పగించినప్పుడు.. అతడికి తన ఆలోచనలకు అనుగుణంగా జట్టును నిర్మించుకునే స్వేచ్ఛ, తగినంత సమయం ఇవ్వాలి. తొలి సిరీస్‌లోనే కెప్టెన్ తనకు కావాల్సిన జట్టును పూర్తిగా తయారు చేసుకోలేడు. ఐర్లాండ్, ఇంగ్లండ్ సిరీస్‌ల తర్వాత జట్టుకు ఏం అవసరం?, ఆటగాళ్లు ఎలా ఆడాలి?, సపోర్ట్ స్టాఫ్ నుంచి ఎలాంటి సహకారం కావాలి? అనే విషయాలపై శ్రేయస్‌కు స్పష్టత వస్తుంది. ఈ సమయంలో అతడి కెప్టెన్సీ భవిష్యత్తు ప్రమాదంలో ఉందని చెప్పడం సరికాదు' అని అభిషేక్ నాయర్ పేర్కొన్నాడు.
'ఐపీఎల్‌లో వరుసగా రెండు సీజన్లలో తన జట్లను ఫైనల్‌కు తీసుకెళ్లిన నాయకత్వ అనుభవం శ్రేయస్ అయ్యర్‌కు ఉంది. శ్రేయస్ నాయకత్వంలో కేకేఆర్ ఒకసారి టైటిల్ కూడా గెలిచింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి లభించినట్లే శ్రేయస్‌కు కూడా జట్టుపై పూర్తి బాధ్యత, స్వేచ్ఛ ఇవ్వాలి. ఆ తర్వాతే అతడి కెప్టెన్సీని సరైన విధంగా అంచనా వేయగలం. శుభ్‌మన్ గిల్ కూడా వన్డే కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన ఆరంభంలో కొన్ని సిరీస్‌లు గెలవలేదదు. కాబట్టి ఇప్పుడే తొందరపాటు నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం లేదు. అయితే జట్టు భవిష్యత్ ప్రయాణంపై స్పష్టమైన దిశ ఉండాలి' అని అభిషేక్ నాయర్ చెప్పాడు.
ఇంగ్లండ్ పర్యటన టీమిండియాకు గట్టి హెచ్చరికగా నిలిచిందని అభిషేక్ నాయర్ పేర్కొన్నాడు. 'భారత బ్యాటర్ల బలహీనతలను గుర్తించిన ఇంగ్లండ్ బౌలర్లు షార్ట్ బాల్స్‌తో నిరంతరం పరీక్షించారు. దాదాపు ప్రతి బ్యాటర్‌ను ఇదే వ్యూహంతో ఇబ్బంది పెట్టారు. ప్రత్యర్థి జట్టు భారత్ కంటే మెరుగైన ప్రణాళికతో బరిలోకి దిగింది. విదేశీ పరిస్థితులకు వేగంగా అలవాటు పడడంలో భారత ఆటగాళ్లు విఫలమయ్యారరు. అయితే ఈ పరాజయాల నుంచి పాఠాలు నేర్చుకుంటే రాబోయే ప్రపంచకప్ నాటికి మరింత బలమైన జట్టుగా మారే అవకాశం ఉంది. జట్టులో పదేపదే మార్పులు చేయడం సమస్యకు పరిష్కారం కాదు. ముఖ్యంగా స్పిన్నర్ల విషయంలో స్థిరత్వం అవసరం. అక్షర్ పటేల్ గతంలో భారత్‌కు ఎన్నో విజయాలు అందించాడు. ప్రస్తుతం అతడి బౌలింగ్‌లో సహజమైన డ్రిఫ్ట్ కనిపించకపోవడానికి అధిక క్రికెట్ లేదా యాక్షన్‌కు సంబంధించిన అంశాలు కారణం కావచ్చు. కుల్దీప్ యాదవ్ వికెట్లు తీసే సామర్థ్యం ఉన్నప్పటికీ జట్టులోకి వస్తూ పోతున్నాడు. వరుణ్ చక్రవర్తి గాయాలతో ఇబ్బంది పడుతున్నాడు. వీరిని పక్కన పెట్టకుండా సపోర్ట్ స్టాఫ్ వారి సమస్యలపై పనిచేయాలి' అని అభిషేక్ సూచించాడు.
వరుస పరాజయాల తర్వాత బీసీసీఐ, సెలెక్టర్లు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదని అభిషేక్ నాయర్ హెచ్చరించాడు. ఆటగాళ్ల నుంచి ఏం ఆశిస్తున్నారో స్పష్టంగా చెప్పడంతో పాటు వారు ఏ అంశాల్లో మెరుగుపడాలో కూడా తెలియజేయాలని సూచించాడు. ఓటమి ఎదురైనప్పుడు జట్టుకు సరైన దిశ చూపించాలి తప్ప.. వరుస మార్పులతో గందరగోళం సృష్టించకూడదని అభిప్రాయపడ్డాడు. ఇంగ్లండ్ పర్యటనలో టీ20 సిరీస్ ముగియగా.. జూన్ 14 నుంచి వన్డే సిరీస్ ఆరంభం కానుంది.




