Abhishek Sharma: మరో 59 పరుగులే.. అరుదైన రికార్డుపై కన్నేసిన కాటేరమ్మ కొడుకు!
Abhishek Sharma: ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ ఓపెనర్, కాటేరమ్మ కొడుకు అభిషేక్ శర్మ ఓ అరుదైన రికార్డు సాధించే అవకాశాలు ఉన్నాయి.
Abhishek Sharma: మరో 59 పరుగులే.. అరుదైన రికార్డుపై కన్నేసిన కాటేరమ్మ కొడుకు!
Abhishek Sharma: ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్), ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ) మధ్య ఈరోజు మ్యాచ్ జరగనుంది. ఉప్పల్ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ స్టార్ ఓపెనర్, కాటేరమ్మ కొడుకు అభిషేక్ శర్మ ఓ అరుదైన రికార్డు సాధించే అవకాశాలు ఉన్నాయి. ఎస్‌ఆర్‌హెచ్ ఫ్రాంచైజీ తరఫున 2000 పరుగుల మైలురాయికి అభిషేక్ కొద్ది దూరంలో ఉన్నాడు. ఐపీఎల్ 2026లో అతడి ఫామ్ చూస్తే.. ఢిల్లీపై ఈ రికార్డు ఈజీగా సాధించే అవకాశాలు ఉన్నాయి.
ప్రస్తుతం అభిషేక్ శర్మ ఎస్‌ఆర్‌హెచ్ తరఫున 1941 పరుగులు చేశాడు. కేవలం 59 పరుగులు చేస్తే సన్‌రైజర్స్ తరఫున 2000 పరుగులు పూర్తి చేసిన నాలుగో ఆటగాడిగా రికార్డుల్లో నిలుస్తాడు. ఇప్పటివరకు డేవిడ్ వార్నర్ (4014), శిఖర్ ధావన్ (2768), కేన్ విలియమ్సన్ (2101) మాత్రమే ఈ ఘనత సాధించారు.
భారత ఆటగాళ్లలో ధావన్ తర్వాత ఈ రికార్డు అందుకోబోతున్న రెండో భారతీయుడిగా అభిషేక్ నిలిచే అవకాశం ఉంది. ఇక ఐపీఎల్ కెరీర్‌లో కూడా ఓ ప్రత్యేకమైన రికార్డును అభిషేక్ నమోదు చేశాడు. మొత్తంగా ఐపీఎల్‌లో 2000 పరుగులు అత్యంత వేగంగా సాధించిన భారత ఆటగాడిగా నిలిచాడు. కేవలం 1193 బంతుల్లో ఈ ఘనతను అందుకున్నాడు. మొత్తం చూస్తే ప్రపంచంలో రెండో వేగవంతమైన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు.
ఐపీఎల్ 2026 సీజన్‌లో అభిషేక్ శర్మ మంచి ఫామ్‌లోనే ఉన్నాడు. ఇప్పటివరకు 6 ఇన్నింగ్స్‌ల్లో 188 పరుగులు చేశాడు. అందులో 74 పరుగులు అత్యధిక స్కోర్. 2025 సీజన్‌లో పంజాబ్ కింగ్స్‌పై 55 బంతుల్లో 141 పరుగులు చేసి ఎస్‌ఆర్‌హెచ్ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోర్ కూడా నమోదు చేశాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో అభిషేక్ ఈ అరుదైన మైలురాయిని చేరే అవకాశం ఉంది. అభిమానులు కూడా అతడి నుంచి మెరుపు ఇన్నింగ్స్ ఆశిస్తున్నారు. ఈ మ్యాచ్‌లో కాటేరమ్మ కొడుకు అభిషేక్ రాణిస్తే.. సన్‌రైజర్స్ కీలక పాత్ర పోషించడంతో పాటు ఐపీఎల్ చరిత్రలో తన పేరు నమోదు చేసుకునే అవకాశం ఉంది.
ఐపీఎల్ 2026లో అభిషేక్ శర్మ ప్రపంచ రికార్డు నెలకొల్పిన విషయం తెలిసిందే. టీ20 ఫార్మాట్‌లో ఆరు సార్లు 20 బంతుల్లోపే హాఫ్ సెంచరీలు చేసిన మొదటి ఆటగాడిగా నిలిచాడు. టీ20 క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు ఏ ఆటగాడూ కనీసం ఐదు సార్లు 20 బంతుల్లోపు హాఫ్ సెంచరీలు బాధలేదు. అభిషేక్ తన టీ20 కెరీర్‌లో 15 అంతకంటే తక్కువ బంతుల్లో నాలుగు సార్లు అర్ధ శతకాలు బాదాడు. ఈ ఘనతను సాధించిన ఏకైక ఆటగాడు కూడా అభిషేక్ కావడం విశేషం.




