Abhishek Sharma: అదే మా కొంపముంచింది.. అసలు విషయం చెప్పిన అభిషేక్ శర్మ!
Abhishek Sharma: శుక్రవారం ఐర్లాండ్‌తో జరిగిన తొలి టీ20లో భారత్ అనూహ్య ఓటమిని చవిచూసింది. ఓపెనర్ అభిషేక్ శర్మ టీమిండియా ఓటమికి గల ప్రధాన కారణాన్ని వెల్లడించాడు.
Abhishek Sharma: అదే మా కొంపముంచింది.. అసలు విషయం చెప్పిన అభిషేక్ శర్మ!
Abhishek Sharma: శుక్రవారం ఐర్లాండ్‌తో జరిగిన తొలి టీ20లో భారత్ అనూహ్య ఓటమిని చవిచూసింది. ఓపెనర్ అభిషేక్ శర్మ టీమిండియా ఓటమికి గల ప్రధాన కారణాన్ని వెల్లడించాడు. పరిస్థితులకు త్వరగా అలవాటు పడడంలో తాము విఫలమయ్యామని, అదే మ్యాచ్ ఫలితాన్ని ప్రభావితం చేసిందని స్పష్టం చేశాడు.
వరుస మ్యాచ్‌లు ఆడే సమయంలో పరిమిత ప్రాక్టీస్ సెషన్లలోనే పిచ్, వాతావరణ పరిస్థితులను అర్థం చేసుకుని వాటికి అనుగుణంగా ఆడాల్సి ఉంటుందని పేర్కొన్నాడు. ఈ మ్యాచ్ ఓటమిని తాము జీర్ణించుకోలేకపోతున్నామని, చాలా బాధగా ఉందని అభిషేక్ చెప్పాడు.
పరిస్థితులకు తగ్గట్టు ఆడలేకపోయాం:
మ్యాచ్ అనంతరం అభిషేక్ శర్మ మీడియాతో మాట్లాడుతూ.. 'బ్యాక్ టు బ్యాక్ మ్యాచ్‌లు ఆడుతున్నప్పుడు పరిస్థితులకు ఎంత త్వరగా అలవాటు పడతామనేదే కీలకం. బలమైన జట్టుగా మేం చాలా వేగంగా అడ్జస్ట్ కావాలి. ఈ మ్యాచ్‌లో అదే ప్రయత్నం చేశాం. కానీ దురదృష్టవశాత్తూ అది సాధ్యపడలేదు. అదే మా ఓటమికి ప్రధాన కారణమైంది. ఈ ఓటమిని మేము జీర్ణించుకోలేకపోతున్నాము. అందరం చాలా నిరాశ చెందాం. రెండో మ్యాచులో తప్పక గెలుస్తాం' అని ధీమా వ్యక్తం చేశాడు.
ఐర్లాండ్ చారిత్రక విజయం
బెల్‌ఫాస్ట్ వేదికగా జరిగిన తొలి టీ20లో టాస్ గెలిచిన ఐర్లాండ్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. కెప్టెన్ లోర్కన్ టక్కర్ అర్ధ సెంచరీతో జట్టుకు మంచి స్కోరు అందించాడు. లక్ష్య ఛేదనలో బ్యాటర్లు విఫలమవడంతో టీమిండియా 18.5 ఓవర్లలో 148 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో ఐర్లాండ్ 34 పరుగుల తేడాతో చారిత్రక విజయాన్ని నమోదు చేసింది. అన్ని ఫార్మాట్లలో భారత జట్టుపై ఐర్లాండ్‌కు ఇదే తొలి విజయం కావడం విశేషం. మ్యాచ్ అనంతరం ఐర్లాండ్ ప్లేయర్స్ సంబరాలు చేసుకున్నారు.
ఒంటరి పోరాటం చేసిన అభిషేక్:
టీమిండియా తరఫున అభిషేక్ శర్మ ఒక్కడే ధాటిగా ఆడాడు. కేవలం 20 బంతుల్లోనే 50 పరుగులు చేసి భారత ఆశలను నిలబెట్టే ప్రయత్నం చేశాడు. అయితే మిగతా స్టార్ బ్యాటర్లు ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో భారత్ ఓటమి తప్పలేదు.
ఐర్లాండ్ బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్‌తో భారత బ్యాటింగ్‌ను కట్టడి చేశారు. ఎడమచేతి స్పిన్నర్ మాథ్యూ హంఫ్రీస్, మ్యాట్ హోలార్డ్ తలా మూడు వికెట్లు తీశారు. అరంగేట్ర మ్యాచ్ ఆడిన జై మూంద్రా నాలుగు ఓవర్లలో 25 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు కీలక వికెట్లు పడగొట్టి ఆకట్టుకున్నాడు. ఇక ఈ రెండు జట్లు ఆదివారం జరిగే రెండో టీ20లో తలపడనున్నాయి. సిరీస్‌ను సమం చేయాలని భారత్ పట్టుదలగా ఉండగా.. చారిత్రక విజయోత్సాహంతో ఐర్లాండ్ మరో విజయంపై కన్నేసింది.




