Abhishek Sharma: అభిషేక్ శర్మ ఊచకోత.. 25 సిక్సర్లు, 13 ఫోర్లు.. 91 బంతుల్లోనే 233 పరుగులు!

Abhishek Sharma: Abhishek Sharma Slams 233 runs off just 91 balls. టీమిండియా యువ ఓపెనర్, కాటేరమ్మ కొడుకు అభిషేక్ శర్మ దేశవాళీ క్రికెట్‌లో మరోసారి పెను విధ్వంసం సృష్టించాడు.

Rishvik
Published on: 2 Aug 2026 5:05 PM IST
Abhishek Sharma
X

Abhishek Sharma: అభిషేక్ శర్మ ఊచకోత.. 25 సిక్సర్లు, 13 ఫోర్లు.. 91 బంతుల్లోనే 233 పరుగులు!

Abhishek Sharma: టీమిండియా యువ ఓపెనర్, కాటేరమ్మ కొడుకు అభిషేక్ శర్మ దేశవాళీ క్రికెట్‌లో మరోసారి పెను విధ్వంసం సృష్టించాడు. పంజాబ్ ఇంటర్-డిస్ట్రిక్ట్ సీనియర్ టోర్నీలో అమృత్‌సర్ తరఫున ఆడిన అభిషేక్.. తార్న్ తారన్ జట్టుపై చెలరేగి ఆడాడు. కేవలం 91 బంతుల్లో 233 పరుగులు చేసి ప్రత్యర్థి బౌలర్లను ఊచకోత కోశాడు. అభిషేక్ మెరుపు ఇన్నింగ్స్‌లో 15 ఫోర్లు, ఏకంగా 25 సిక్సర్లు ఉండడం విశేషం. అతడి స్ట్రైక్‌రేట్ 256.04గా ఉంది. అభిషేక్ విధ్వంసక బ్యాటింగ్‌తో అమృత్‌సర్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 533 పరుగులు భారీ స్కోరు చేసింది.

అభిషేక్ శర్మ ఇన్నింగ్స్ ప్రారంభం నుంచే దూకుడుగా ఆడాడు. తార్న్ తారన్ బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా వరుస బౌండరీలు, భారీ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. దాంతో అమృత్‌సర్ స్కోర్‌ బోర్డు పరుగులు పెట్టింది. అభిషేక్ ఇన్నింగ్స్‌లో 15 ఫోర్లతో పాటు 25 సిక్సర్లు ఉండటం అతడి ఆధిపత్యానికి నిదర్శనం. ఈ ఇన్నింగ్స్‌కు సంబంధించిన స్కోర్‌కార్డు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ స్కోర్‌కార్డు చూసి ఫాన్స్ షాక్ అవుతున్నారు. మరికొందరు అభిమానులు అతడి బ్యాటింగ్‌ను ప్రశంసిస్తూ పోస్టులు చేస్తున్నారు. టీమిండియాకు ఆడేటప్పుడు ఏమైంది బాసూ? అంటూ నెటిజెన్స్ ప్రశ్నిస్తున్నారు.

ఈ మెరుపు ఇన్నింగ్స్ అభిషేక్‌ శర్మకు కీలక సమయంలో వచ్చింది. ఇటీవల జింబాబ్వేతో జరిగిన టీ20 సిరీస్‌లో అతడు మూడు ఇన్నింగ్స్‌ల్లో కలిపి కేవలం 11 పరుగులే చేసి తీవ్రంగా నిరాశపరిచాడు. అంతకుముందు ఇంగ్లాండ్‌తో ఐదు టీ20ల్లో 131 పరుగులు, ఐర్లాండ్‌తో రెండు మ్యాచ్‌ల్లో 49 పరుగులు మాత్రమే చేశాడు. గత 10 టీ20 అంతర్జాతీయ ఇన్నింగ్స్‌ల్లో ఒకే ఒక్క అర్ధశతకం మాత్రమే నమోదు చేశాడు. ముఖ్యంగా జింబాబ్వే పేసర్ బ్లెస్సింగ్ ముజరబానీ బౌలింగ్‌లో వరుసగా మూడు సార్లు ఔట్ కావడం అభిషేక్ బలహీనతలను బయటపెట్టింది. ఆఫ్ స్టంప్ వెలుపల వేగంగా వచ్చే బంతులను ఎదుర్కోవడంలో అతడు ఇబ్బంది పడుతున్నాడనే విమర్శలు వచ్చాయి. టీ20 ప్రపంచ కప్ 2026 తర్వాత అతని సగటు 37.05 నుంచి 19.4కి పడిపోగా.. స్ట్రైక్‌రేట్ కూడా దాదాపు 195 నుంచి 165కు తగ్గింది.

అయితే దేశవాళీ క్రికెట్‌లో ఆడిన ఈ అద్భుత ఇన్నింగ్స్ అభిషేక్ శర్మలో ఎంతో ఆత్మవిశ్వాసాన్ని పెంచే అవకాశముంది. అంతర్జాతీయ క్రికెట్‌లో తిరిగి తన పాత ఫామ్‌ను అందుకోవడానికి ఈ ద్విశతకం కీలక మలుపుగా మారుతుందా లేదా అన్నది చూడాలి. ప్రస్తుతం సోషల్ మీడియాలో అభిమానులు 'అభిషేక్ ఈ ఫామ్‌ను టీమిండియా జెర్సీలో కూడా కొనసాగించాలని' ఆకాంక్షిస్తున్నారు. మైదానం నలుమూలలా అభిషేక్ బాదిన షాట్ల వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మీరు కూడా ఆ వీడియో చూసేయండి.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story