Abhishek Sharma : 10 సిక్సర్లు, 10 ఫోర్లు.. బౌండరీల ద్వారానే సెంచరీ కొట్టిన సిక్సర్ల కింగ్..గేల్, కోహ్లీల రికార్డులు గల్లంతు

Abhishek Sharma : ఢిల్లీపై అభిషేక్ శర్మ సిక్సర్ల సునామీ సృష్టించాడు. 10 సిక్సర్లు, 10 ఫోర్లతో బాండీల ద్వారానే సెంచరీ పూర్తి చేసి, విరాట్ కోహ్లీ, క్రిస్ గేల్ రికార్డులను బద్దలు కొట్టాడు.

CR Reddy
Published on: 22 April 2026 6:53 AM IST
Abhishek Sharma
X

Abhishek Sharma

Abhishek Sharma : సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలనం, యంగ్ డైనమైట్ అభిషేక్ శర్మ ఐపీఎల్ 2026లో విశ్వరూపం ప్రదర్శించాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ పంజాబీ కుర్రాడు ఉప్పల్ స్టేడియాన్ని సిక్సర్ల వర్షంతో ముంచెత్తాడు. కేవలం బాండీల ద్వారానే సెంచరీ పూర్తి చేసి, క్రికెట్ చరిత్రలో ఎవరికీ సాధ్యం కాని రీతిలో భారీ రికార్డులను తిరగరాశాడు. ఢిల్లీ బౌలర్లను ఒక ఆటాడుకుంటూ 135* పరుగుల అజేయ ఇన్నింగ్స్‌తో ఆరెంజ్ ఆర్మీకి చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.

బౌండరీల ద్వారానే సెంచరీ

ఈ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ బ్యాటింగ్ తీరు చూస్తే ఎవరైనా ముక్కున వేలేసుకోవాల్సిందే. 68 బంతుల్లో 135* పరుగులు చేసిన అభిషేక్, తన ఇన్నింగ్స్‌లో 10 సిక్సర్లు (60 పరుగులు), 10 ఫోర్లు (40 పరుగులు) బాదాడు. అంటే మొత్తం 100 పరుగులు కేవలం సిక్సర్లు, ఫోర్ల ద్వారానే వచ్చాయి. మిగిలిన 35 పరుగులు మాత్రమే సింగిల్స్, డబుల్స్ ద్వారా సాధించాడు. ఇలా కేవలం బాండీల ద్వారానే సెంచరీ మార్కును అందుకోవడం ఐపీఎల్ చరిత్రలో అత్యంత అరుదైన ఫీట్ గా నిలిచింది.

విరాట్ కోహ్లీ రికార్డు బద్దలు

టీ20 క్రికెట్‌లో అభిషేక్ శర్మకు ఇది 9వ సెంచరీ. ఇదే సంఖ్యలో టీ20 సెంచరీలు చేసిన విరాట్ కోహ్లీ రికార్డును అభిషేక్ సమం చేశాడు. అయితే, ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే స్పీడ్. విరాట్ కోహ్లీ తన 9 సెంచరీల కోసం 403 ఇన్నింగ్స్‌లు తీసుకోగా, అభిషేక్ శర్మ కేవలం 184 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనత సాధించాడు. అంటే కోహ్లీ కంటే 219 ఇన్నింగ్స్‌లు ముందే అభిషేక్ ఈ మైలురాయిని చేరుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు.

క్రిస్ గేల్ సరసన అభిషేక్

ఐపీఎల్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన జాబితాలో అభిషేక్ మూడవ స్థానంలో నిలిచాడు. క్రిస్ గేల్ (175*), బ్రెండన్ మెకల్లమ్ (158*) తర్వాత 141, 135* పరుగులతో టాప్ లిస్టులో ఉన్నాడు. అంతేకాకుండా, ఒకే ఇన్నింగ్స్‌లో 10 అంతకంటే ఎక్కువ సిక్సర్లు బాదడం అభిషేక్ కి ఇది రెండోసారి. ఈ జాబితాలో క్రిస్ గేల్ (4 సార్లు) మొదటి స్థానంలో ఉండగా, అభిషేక్ రెండో స్థానంలో నిలిచాడు. టీ20ల్లో 130 కంటే ఎక్కువ పరుగులు అత్యధిక సార్లు (4 సార్లు) చేసిన ఆటగాడిగా ఆరోన్ ఫించ్, గేల్ రికార్డులను కూడా అధిగమించాడు.

రికార్డుల సునామీ - ఐదు భారీ రికార్డులు ఇవే

* బౌండరీ సెంచరీ: కేవలం ఫోర్లు, సిక్సర్ల ద్వారానే 100 పరుగులు పూర్తి చేయడం.

* కోహ్లీ రికార్డు బద్దలు: అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో (184) 9 టీ20 సెంచరీలు సాధించడం.

* హైయ్యస్ట్ స్కోరర్ జాబితా: ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోర్ల జాబితాలో 5వ స్థానంలో నిలవడం (135*).

* సిక్సర్ల కింగ్: ఒకే ఇన్నింగ్స్‌లో 10 సిక్సర్లు రెండోసారి బాది, గేల్ తర్వాత రెండో స్థానంలో నిలవడం.

* 130+ రికార్డ్: టీ20 క్రికెట్‌లో నాలుగుసార్లు 130 కంటే ఎక్కువ పరుగులు చేసి ప్రపంచ రికార్డు సృష్టించడం.

ఎస్‌ఆర్‌హెచ్ నయా సూపర్ స్టార్

ఈ అద్భుత ఇన్నింగ్స్‌తో అభిషేక్ శర్మ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఒక వెన్నెముకలా మారాడు. కేవలం పవర్ ప్లేలోనే కాకుండా, డెత్ ఓవర్లలో కూడా బౌలర్లను ఎలా ఎదుర్కోవాలో తన బ్యాటింగ్‌తో నిరూపించాడు. ఢిల్లీ బౌలర్లు కుల్దీప్ యాదవ్, అన్రిచ్ నోర్జే వంటి స్టార్లను సైతం ఉతికి ఆరేయడం చూస్తుంటే, రాబోయే రోజుల్లో భారత జట్టులో కూడా అభిషేక్ ఒక తిరుగులేని ఓపెనర్‌గా మారడం ఖాయంగా కనిపిస్తోంది.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story