Abhishek Sharma: మూడు మ్యాచ్‌లలో ముజరబానికే బలి.. అభిషేక్ ఇంకా జట్టులో ఎందుకు సార్.. తీసేయండి!
Abhishek Sharma's Struggles Continue as Blessing Muzarabani. హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జింబాబ్వేతో జరిగిన మూడో టీ20లో టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ మరోసారి నిరాశపరిచాడు.
Abhishek Sharma: మూడు మ్యాచ్‌లలో ముజరబానికే బలి.. అభిషేక్ ఇంకా జట్టులో ఎందుకు సార్.. తీసేయండి!
Abhishek Sharma: హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జింబాబ్వేతో జరిగిన మూడో టీ20లో టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ మరోసారి నిరాశపరిచాడు. జింబాబ్వే స్టార్ పేసర్ బ్లెస్సింగ్ ముజరబాని బౌలింగ్‌లో మరోసారి ఔటై తన బలహీనతను బయటపెట్టుకున్నాడు. ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లో ముజరబాని వేసిన ఐదవ బంతిని భారీ షాట్ ఆడే ప్రయత్నంలో అభిషేక్ వికెట్ కీపర్ తాడివనాషే మరుమానికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఈ సిరీస్‌లో ముజరబాని చేతిలో అభిషేక్ ఔటవడం ఇది మూడోసారి కావడం విశేషం. మూడు మ్యాచ్‌లలో ముజరబానికే బలవ్వడంతో టీమిండియా ఫాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
టీ20 క్రికెట్‌లో అభిషేక్ శర్మపై బ్లెస్సింగ్ ముజరబాని పూర్తి ఆధిపత్యం చెలాయిస్తున్నాడు. ఇప్పటివరకు ఇద్దరి మధ్య జరిగిన పోరులో అభిషేక్ 29 బంతులు ఎదుర్కొని కేవలం 17 పరుగులు మాత్రమే చేశాడు. అదే సమయంలో ఐదు సార్లు ముజరబాని బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఈ పోరులో అభిషేక్ సగటు కేవలం 3.4 మాత్రమే కాగా, స్ట్రైక్‌రేట్ 58.62గా ఉంది. అంతేకాదు 29 బంతుల్లో 20 డాట్ బాల్స్ ఆడటం అభిషేక్ ఎంతలా ఇబ్బంది పడుతున్నాడో ఇట్టే అర్ధమవుతోంది.
ఈ సిరీస్‌లో కూడా ముజరబాని బౌలింగ్‌లో అభిషేక్ శర్మ పూర్తిగా తడబడ్డాడు. తొలి మూడు మ్యాచ్‌ల్లో కలిపి ముజరబాని బౌలింగ్‌లో 14 బంతులు ఎదుర్కొన్న అతడు కేవలం 2 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అదే సమయంలో మూడు సార్లు వికెట్ సమర్పించుకున్నాడు. దీంతో జింబాబ్వే పేసర్‌కు అభిషేక్ వరుసగా బలి అవుతూ ఉండటం భారత జట్టు యాజమాన్యానికి ఆందోళన కలిగించే అంశంగా మారింది. టీ20 ప్రపంచ కప్ 2026 తర్వాత అభిషేక్ పూర్తిగా తేలిపోయాడు. ఐర్లాండ్, ఇంగ్లాండ్, జింబాబ్వే సిరీస్‌లలో అభిషేక్ ఆకట్టుకోలేకపోయాడు. 10 మ్యాచ్‌ల్లో 160 రన్స్ మాత్రమే చేశాడు. దాంతో 'అభిషేక్ ఇంకా జట్టులో ఎందుకు సార్', 'అభిషేక్ శర్మను తీసేయండి' అంటూ నెటిజెన్స్ బీసీసీఐ సెలెక్టర్లకు కామెంట్స్ చేస్తున్నారు.
టీ20 ప్రపంచ కప్ 2026 తర్వాత అభిషేక్ శర్మ పేస్ బౌలర్లపై నెలకొల్పిన గణాంకాలు కూడా ఆసక్తికరంగా ఉన్నాయి. తక్కువ రిలీజ్ పాయింట్ (1.85 మీటర్లలోపు) ఉన్న బౌలర్లపై అతడు 183.33 స్ట్రైక్‌రేట్‌తో దూకుడుగా ఆడుతున్నాడు. 1.85 నుంచి 2 మీటర్ల మధ్య ఎత్తులో బంతులు విడుదల చేసే బౌలర్లపై అయితే 254.05 స్ట్రైక్‌రేట్‌తో విధ్వంసం సృష్టించాడు. 2 నుంచి 2.15 మీటర్ల మధ్య ఉన్న పేసర్లపై కూడా 181.96 స్ట్రైక్‌రేట్‌తో పరుగులు చేశాడు. అయితే 2.15 మీటర్లకు పైగా ఎత్తు నుంచి బంతులు విడుదల చేసే పొడవైన పేసర్ల బౌలింగ్‌లో మాత్రం అభిషేక్ తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాడు. 32 బంతుల్లో కేవలం 18 పరుగులే చేసి ఐదు సార్లు ఔటయ్యాడు. ఈ ఐదింటిలో మూడుసార్లు బ్లెస్సింగ్ ముజరబాని, ఓసారి దక్షిణాఫ్రికా స్టార్ మార్కో జాన్సెన్, మరోసారి ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ చేతిలో ఔటయ్యాడు. ఈ గణాంకాలు చూస్తే.. ఎత్తైన పేసర్ల బౌలింగ్‌ను ఎదుర్కోవడంలో అభిషేక్ ఇంకా మెరుగుపడాల్సిన అవసరం ఉంది.




