Ajinkya Rahane: చాలా ఆనందంగా ఉంది.. ఆ ఇద్దరి వల్లే ఈ విజయం!

Ajinkya Rahane: విజయం అనంతరం కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహానే తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ఈ విజయంతో జట్టులో మంచి ఉత్సాహం నెలకొందని తెలిపాడు.

Rishvik
Published on: 19 April 2026 8:26 PM IST
Ajinkya Rahane
X

Ajinkya Rahane: చాలా ఆనందంగా ఉంది.. ఆ ఇద్దరి వల్లే ఈ విజయం!

Ajinkya Rahane: ఐపీఎల్ 2026లో కోల్‌కతా నైట్‌ రైడర్స్ (కేకేఆర్) ఎట్టకేలకు బోణీ కొట్టింది. సొంత గడ్డపై రాజస్థాన్ రాయల్స్‌ (ఆర్ఆర్)తో జరిగిన మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ముందుగా రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 155 పరుగులు చేసింది. ఛేదనలో కేకేఆర్ 19.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది.

కోల్‌కతా విజయంలో రింకు సింగ్ (53 నాటౌట్; 34 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) హాఫ్ సెంచరీ చేయగా.. అనుకుల్ రాయ్ (29 నాటౌట్; 16 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్‌లు) రాణించాడు. 86 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన కోల్‌కతాకు రింకు, అనుకుల్ ఆదుకున్నారు. విజయం అనంతరం కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహానే తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ఈ విజయంతో జట్టులో మంచి ఉత్సాహం నెలకొందని, వ్యక్తిగతంగా కూడా చాలా సంతోషంగా ఉందని తెలిపాడు.

మ్యాచ్ అనంతరం అజింక్య రహానే మాట్లాడుతూ... 'నాకు చాలా ఆనందంగా ఉంది. మంచి ఫీలింగ్ ఇది. ఈ మ్యాచ్‌లో చాలా భావోద్వేగాలు ఉన్నాయి. రింకు సింగ్, అనుకుల్ రాయ్, వరుణ్ చక్రవర్తి ప్రదర్శనపై చాలా సంతోషంగా ఉంది. రింకు, అనుకుల్ ఇద్దరూ అద్భుత భాగస్వామ్యం నెలకొల్పారు. ఇద్దరి బ్యాటింగ్ సూపర్బ్. నాకు ఆటగాళ్లతో వ్యక్తిగతంగా మాట్లాడటం ఇష్టం. పరిస్థితులను బాగా అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఈ విజయం జట్టుకు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. బ్యాటింగ్ పరంగా ఇంకా మెరుగవ్వాల్సి ఉంది' అని చెప్పాడు.

'కార్తీక్ త్యాగి అద్భుతంగా ఆడుతున్నాడు. తన సామర్థ్యం గురించి అతనికి స్పష్టత ఉంది. ఇలాంటి యువ ఆటగాడు జట్టులో ఉండటం గొప్ప విషయం. అతను ఆత్మవిశ్వాసం రోజురోజుకు పెరుగుతోంది. అది చూడటం చాలా ఆనందంగా ఉంది. త్యాగి బౌలింగ్ చేస్తున్న వేగం అద్భుతం. ప్రతి మ్యాచ్‌ నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉంటాయి. అదే క్రికెట్ అవగాహనను పెంచుతుంది. కొన్నిసార్లు స్ట్రైక్‌రేట్‌కి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారని నాకు అనిపిస్తుంది.

కానీ మ్యాచ్‌ను చివరివరకు తీసుకెళ్లడం ముఖ్యం. ఈరోజు ఏమి జరిగిందో మనం చూశాం. ఈ విజయం మాకు ఒక పెద్ద ఉపశమనం లాంటిది. జట్టు ఇంకా నేర్చుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. ప్రతి మ్యాచ్ నుంచి పాఠాలు నేర్చుకోవడం అవసరం. జట్టు సభ్యుల మధ్య స్పష్టమైన కమ్యూనికేషన్ ఉండాలి. అందరూ కలిసి కృషి చేస్తేనే మంచి ఫలితాలు వస్తాయి. డ్రెస్సింగ్ రూమ్‌లో వాతావరణం అద్భుతంగా ఉంది. అభిమానులు కూడా బాగా మద్దతు ఇచ్చారు. ఈ విజయం వాళ్లకే అంకితం. జట్టులో చాలా సానుకూల వాతావరణం ఉంది' అని రహానే చెప్పుకొచ్చాడు.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story