Ajinkya Rahane Retirement: అజింక్య రహానే అన్‌బీటెన్‌ రికార్డు.. కోహ్లీ, ధోనీ, రోహిత్‌కు కూడా సాధ్యం కాలేదు!

Ajinkya Rahane have a unique unbeaten captaincy record in Tests. అజింక్య రహానే రిటైర్మెంట్ నేపథ్యంలో అతని కెరీర్‌లోని ఓ అరుదైన కెప్టెన్సీ రికార్డు ఇప్పుడు చర్చనీయాంశమైంది.

Rishvik
Published on: 30 July 2026 5:08 PM IST
Ajinkya Rahane Retirement
X

Ajinkya Rahane Retirement: అజింక్య రహానే అన్‌బీటెన్‌ రికార్డు.. కోహ్లీ, ధోనీ, రోహిత్‌కు కూడా సాధ్యం కాలేదు!

Ajinkya Rahane Retirement: టీమిండియా మాజీ కెప్టెన్ అజింక్య రహానే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్ అవుతున్నట్లు తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా వెల్లడించాడు. 85 టెస్టులు, 90 వన్డేలు, 20 టీ20 మ్యాచ్‌లలో భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. రహానే బ్యాటర్‌గానే కాకుండా సారథిగానూ అదరగొట్టాడు. జింక్స్ రిటైర్మెంట్ నేపథ్యంలో అతని కెరీర్‌లోని ఓ అరుదైన కెప్టెన్సీ రికార్డు ఇప్పుడు చర్చనీయాంశమైంది. పూర్తి స్థాయి కెప్టెన్‌గా ఎక్కువ అవకాశాలు రాకపోయినా.. జట్టుకు నాయకత్వం వహించిన ప్రతిసారీ రహానే తన ప్రత్యేకతను చాటుకున్నాడు.

2-1తో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సొంతం:

ముఖ్యంగా 2020-21 బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియా గడ్డపై భారత్‌కు చారిత్రాత్మక సిరీస్ విజయాన్ని అందించడం అజింక్య రహానే కెరీర్‌లో చిరస్థాయిగా నిలిచిపోయింది. అడిలైడ్ టెస్టులో భారత్ కేవలం 36 పరుగులకే ఆలౌట్ కావడం, తొలి మ్యాచ్‌లో ఘోర పరాజయం పాలవడంతో సిరీస్‌పై ఎన్నో అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆ సమయంలో కెప్టెన్ విరాట్ కోహ్లీ పితృత్వ సెలవుల కోసం స్వదేశానికి రావడంతో.. రహానే జట్టు పగ్గాలు అందుకున్నాడు. మెల్‌బోర్న్ టెస్టులో అద్భుత సెంచరీతో భారత్‌ను గెలిపించిన రహానే.. సిడ్నీ టెస్టును డ్రా చేయించాడు. ఇక గబ్బా వేదికగా 328 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి 2-1 తేడాతో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని భారత్‌కు అందించాడు. ఆస్ట్రేలియా గడ్డపై భారత్ సాధించిన అత్యంత గొప్ప విజయాల్లో ఇది ఒకటిగా నిలిచింది.

ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు:

అజింక్య రహానే తన అంతర్జాతీయ కెరీర్‌లో మొత్తం ఆరు టెస్టులకు టీమిండియాకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఈ ఆరు టెస్టుల్లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. నాలుగు విజయాలు, రెండు డ్రాలతో అజేయ రికార్డును సొంతం చేసుకున్నాడు. కనీసం ఐదు టెస్టులకు నాయకత్వం వహించిన భారత కెప్టెన్లలో అత్యధిక విజయ శాతాన్ని నమోదు చేసిన కెప్టెన్‌గా రహానే ప్రత్యేక స్థానం సంపాదించాడు. ఈ ఘనతను మోస్ట్ సక్సెస్ ఫుల్ కెప్టెన్స్ విరాట్ కోహ్లీ, మహేంద్ర సింగ్ ధోనీ, రోహిత్ శర్మలు కూడా అందుకోలేకపోయారు.

ఒక మ్యాచ్‌లో విజయం, మరొక మ్యాచ్‌లో ఓటమి:

2017లో ధర్మశాల టెస్టులో ఆస్ట్రేలియాపై భారత్‌ను విజయపథంలో నడిపించిన రహానే.. 2018లో అఫ్గానిస్థాన్‌తో జరిగిన చారిత్రాత్మక టెస్టులో కూడా ఇన్నింగ్స్ 262 పరుగుల భారీ తేడాతో గెలిపించాడు. అలాగే వన్డేల్లో జింబాబ్వేపై మూడు మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించి మూడింట్లోనూ విజయాలు అందుకున్నాడు. టీ20ల్లో రెండు మ్యాచ్‌లకు నాయకత్వం వహించగా.. ఒక మ్యాచ్‌లో విజయం, మరొక మ్యాచ్‌లో ఓటమి ఎదురైంది.

వ్యక్తిత్వంలోనూ జింక్స్ సూపర్:

మొత్తంగా భారత జట్టుకు 11 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో కెప్టెన్‌గా వ్యవహరించిన అజింక్య రహానే కేవలం ఒక్క మ్యాచ్‌లో మాత్రమే ఓడిపోయాడు. టెస్టులు, వన్డేల్లో ఒక్క పరాజయం కూడా లేకుండా తన నాయకత్వ ప్రయాణాన్ని ముగించాడు. వ్యక్తిత్వంలోనూ జింక్స్ సూపర్. ఆటగాడిగా, సారథిగా మైదానంలో రహానే ప్రత్యర్థులతో గొడవపడిన సందర్భాలు లేవు. కఠిన సమయాల్లోనూ ప్రశాంతంగా ఉంటూ నిర్ణయాలు తీసుకున్నాడు. ప్రశాంత స్వభావం, ఒత్తిడిలోనూ చాకచక్యమైన నిర్ణయాలు తీసుకునే నాయకుడిగా గుర్తింపు పొందిన రహానే.. భారత క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన తాత్కాలిక కెప్టెన్లలో ఒకడిగా ఎప్పటికీ గుర్తుండిపోతాడు.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story