Ajinkya Rahane Retirement: క్యాప్ నంబర్ 278కి గుడ్‌బై.. చరిత్రలో నిలిచిపోయిన అజింక్య రహానే!
Ajinkya Rahane announces retirement from international cricket. టీమిండియా సీనియర్ బ్యాటర్ అజింక్య రహానే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.
Ajinkya Rahane Retirement: క్యాప్ నంబర్ 278కి గుడ్‌బై.. చరిత్రలో నిలిచిపోయిన అజింక్య రహానే!
Ajinkya Rahane Retirement: టీమిండియా సీనియర్ బ్యాటర్ అజింక్య రహానే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్ అవుతున్నట్లు ప్రకటించాడు. రహానే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) కూడా ఆడడు. ఈ విషయాన్ని 38 ఏళ్ల రహానే తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా వెల్లడించాడు. ఆస్ట్రేలియాపై 2021లో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని టీమిండియాకు అందించిన కెప్టెన్‌గా రహానే భారత చరిత్రలో నిలిచిపోతాడు. రహానే వీడ్కోలుతో భారత క్రికెట్‌లో ఓ స్వర్ణ యుగానికి ముగింపు పలికినట్లైంది.
మూడేళ్ల కిందట చివరిసారిగా భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించిన అజింక్య రహానే.. ఇన్ని రోజులుగా పునరాగమనం కోసం వేచి చూశాడు. బీసీసీఐ సెలక్టర్ల నుంచి పిలుపు రాకపోవడంతో రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్నాడు. రహానే తన కెరీర్‌లో భారత్ తరఫున 85 టెస్టులు, 90 వన్డేలు, 20 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. టెస్టుల్లో 5,077 పరుగులు చేసి 12 సెంచరీలు నమోదు చేశాడు. వన్డేల్లో 2,962 పరుగులు చేయగా.. అందులో మూడు సెంచరీలు, 24 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 20 టీ20ల్లో 375 పరుగులు చేయగా.. ఒకే ఒక్క హాఫ్ సెంచరీ బాదాడు. ఇక ఐపీఎల్‌లో 212 మ్యాచులో 5,367 పరుగులు చేశాడు. ఇందులో 2 సెంచరీలు, 35 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
అజింక్య రహానే విదేశీ గడ్డపై క్లిష్టమైన పిచ్‌లపై అద్భుతంగా బ్యాటింగ్ చేస్తూ భారత జట్టుకు ఎన్నో కీలక విజయాలు అందించాడు. జింక్స్ ఆడిన టెస్టుల్లో సగానికి పైగా విదేశాల్లోనే ఉండటం అతని ప్రత్యేకత. రహానే కెరీర్‌లో అత్యంత చిరస్మరణీయ ఘట్టం 2020-21 ఆస్ట్రేలియా పర్యటన. అడిలైడ్ టెస్టులో భారత్ 36 పరుగులకే ఆలౌట్ కావడంతో పాటు తొలి మ్యాచ్‌లో ఓటమి చవిచూసింది. అనంతరం కెప్టెన్ విరాట్ కోహ్లీ పితృత్వ సెలవుల కోసం స్వదేశానికి రావడంతో.. రహానే తాత్కాలిక కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు. మెల్‌బోర్న్ టెస్టులో భారత్‌ను ఎనిమిది వికెట్ల తేడాతో గెలిపించి సిరీస్‌ను సమం చేశాడు. అనంతరం సిడ్నీ టెస్టును డ్రా చేయించడంతో పాటు గబ్బా వేదికగా 328 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి భారత్‌కు చారిత్రాత్మక 2-1 సిరీస్ విజయాన్ని అందించాడు. ఆస్ట్రేలియా గడ్డపై భారత్‌కు ఇది రెండో టెస్టు సిరీస్ విజయం కావడం విశేషం.
రిటైర్మెంట్ సందర్భంగా రహానే భావోద్వేగంగా స్పందించాడు. 'ప్రతి దానికీ ఆరంభం, ముగింపు ఉంటుంది. సరైన సమయం వచ్చినప్పుడు వాటిని గౌరవించి ముందుకు సాగాలి. నేను కూడా అంతే. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది. తదుపరి దశకు వెళ్లేందుకు ఇదే సరైన సమయం. టీమిండియా క్యాప్‌ను ధరించాలనే కల తీరింది. వ్యక్తిగతంగా కంటే నా జట్టు, నా దేశం కోసమే ఆడాను. నిజాయతీగా ఇప్పటి వరకు నా ఆట ఆడా. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అరంగేట్రం చేసినప్పటి నుంచి భారత క్రికెట్ ఎంతో అభివృద్ధి చెందింది. గత 20 ఏళ్లుగా ఆ ప్రయాణంలో భాగం కావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. భారత క్రికెటర్‌గా నా అధ్యాయం ముగిసినా.. క్రికెట్‌తో నా ప్రయాణం మాత్రం కొనసాగుతుంది. రాబోయే తరం ఆటగాళ్ల అభివృద్ధికి నా వంతు సహకారం అందించాలనుకుంటున్నాను' అని తెలిపాడు.
'నా ప్రయాణంలో ఎన్నో గెలుపోటములు చూశా. అయితే ఆటను ఆస్వాదించడంలో మాత్రం ఎక్కడా తగ్గలేదు. బీసీసీఐ, ముంబై క్రికెట్ అసోసియేషన్, సహచరులు, కోచ్‌లు, ఐపీఎల్ ఫ్రాంచైజీలు, నా కుటుంబ సభ్యులు, స్నేహితులు.. నాకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా క్రికెట్ అభిమానులకు ప్రత్యేక కృతజ్ఞతలు. అజింక్య అంటే ఎవరూ ఓడించలేరని అర్థం. కానీ క్రికెట్‌లో ఎన్నో పరాజయాలను చూశా. విజయంతో పాటు ఓటములనూ అనుభవించా. నా మనసులో మాత్రం ఓటమికి ఏమాత్రం చోటు లేదు. ప్రతిసారి జట్టు విజయం కోసమే బరిలోకి దిగా. క్యాప్ నంబర్ 278కి గుడ్‌బై' అని అంటూ రహానే తన ఇన్‌స్టాగ్రామ్‌లో బావోద్వేగంగా మాట్లాడాడు.




