Ajinkya Rahane: ఇటీవలే క్రికెట్‌కు వీడ్కోలు.. భారత్, శ్రీలంక తొలి టెస్టులో అజింక్య రహానే!

Ajinkya Rahane: ఇటీవలే క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అజింక్య రహానే కొత్త ఇన్నింగ్స్‌కు సిద్ధమయ్యాడు.

Rishvik
Published on: 12 Aug 2026 6:52 PM IST
Ajinkya Rahane
X

Ajinkya Rahane: ఇటీవలే క్రికెట్‌కు వీడ్కోలు.. భారత్, శ్రీలంక తొలి టెస్టులో అజింక్య రహానే!

Ajinkya Rahane: ఇటీవలే క్రికెట్‌కు వీడ్కోలు పలికిన భారత మాజీ కెప్టెన్, బ్యాటర్ అజింక్య రహానే కొత్త ఇన్నింగ్స్‌కు సిద్ధమయ్యాడు. 18 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌కు గుడ్‌బై చెప్పిన రహానే.. ఇక నుంచి కామెంటేటర్‌గా అభిమానులను అలరించనున్నాడు. భారత్, శ్రీలంక మధ్య ఆగస్టు 15 నుంచి 27 వరకు జరగనున్న రెండు టెస్టుల సిరీస్‌లో తొలిసారి కామెంటరీ చేయబోతున్నాడు. సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్ తరఫున వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నానని రహానే సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టాడు. కామెంట్రీ ప్యానల్‌లోకి రహానేను ఆహ్వానిస్తున్నట్లు సోనీ స్పోర్ట్స్‌ నెట్‌వర్క్స్‌ సీఆర్‌వో, బిజినెస్ హెడ్ రాజేశ్‌ కౌల్ తెలిపారు.

అజింక్య రహానే ప్రశాంతత, పట్టుదల, ఆటను లోతుగా అర్థం చేసుకునే సామర్థ్యంతో ఎప్పుడూ ప్రత్యేకంగా నిలిచాడని రాజేశ్‌ కౌల్ అన్నారు. ఇప్పుడు టెస్ట్ కామెంటరీలోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో.. అభిమానులకు రహానే అందించే విశ్లేషణ మరింత ప్రత్యేకంగా ఉంటుందని పేర్కొన్నారు. తన కొత్త పాత్రపై రహానే కూడా స్పందించాడు. 'టెస్ట్ క్రికెట్‌లో ఎన్నో సంవత్సరాలు భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించా. ఇప్పుడు ఆటను మరో కోణంలో చూసే అవకాశం రావడం గౌరవంగా భావిస్తున్నా. మ్యాచ్‌ను ప్రభావితం చేసే నిర్ణయాలు, వ్యూహాలు, కీలక సందర్భాలను అభిమానులకు వివరించడంతో పాటు.. టెస్ట్ క్రికెట్‌లోని సూక్ష్మమైన అంశాలను ప్రేక్షకులకు మరింత దగ్గర చేయడమే లక్ష్యం' అని జింక్స్ చెప్పాడు.

టెస్ట్ క్రికెట్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అజింక్య రహానే.. ఇప్పుడు మైదానం బయట నుంచి ఆటను విశ్లేషించబోతున్నాడు. ఆటగాడిగా ఎన్నో కీలక మ్యాచ్‌లను ఆడిన అనుభవం, మ్యాచ్ పరిస్థితులను అంచనా వేసే సామర్థ్యం, రెడ్ బాల్ క్రికెట్‌పై లోతైన అవగాహన అతడి కామెంటరీకి ప్రత్యేక ఆకర్షణగా మారనుంది. టెస్ట్ మ్యాచ్‌లో కీలక నిర్ణయాలు, వ్యూహాలు, ఆటగాళ్ల ఆలోచనా విధానాన్ని అభిమానులకు మరింత సులభంగా వివరించే అవకాశం రహానేకు లభించనుంది. భారత్ తరఫున రహానే 85 టెస్టులు ఆడాడు. సాంప్రదాయ ఫార్మాట్‌లో 5,077 పరుగులు చేశాడు. ఇందులో 12 సెంచరీలు, 26 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ముఖ్యంగా విదేశీ పరిస్థితుల్లో, ఒత్తిడితో కూడిన మ్యాచ్‌ల్లో రహానే తన బ్యాటింగ్‌తో ఎన్నోసార్లు జట్టుకు అండగా నిలిచాడు. కెప్టెన్‌గా కూడా భారత జట్టును నడిపించిన అనుభవం ఆయనకు ఉంది.

ఆగస్టు 15 నుంచి భారత్, శ్రీలంక మధ్య రెండు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌ను సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ప్రసారం చేయనుండగా.. సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సిరీస్‌తోనే రహానే టెస్ట్ కామెంటరీలోకి అధికారికంగా అడుగుపెట్టనున్నాడు. దాదాపు రెండు దశాబ్దాల పాటు మైదానంలో తన ఆటతో అభిమానులను అలరించిన రహానే.. ఇక మైక్‌ చేతపట్టి తన అనుభవాన్ని పంచుకోబోతున్నాడు. ఆటగాడిగా సాధించిన అనుభవాన్ని కామెంటరీలో ఉపయోగిస్తూ టెస్ట్ క్రికెట్‌ను అభిమానులకు మరింత చేరువ చేస్తాడని అభిమానులు భావిస్తున్నారు. ఇప్పుడు రహానే రెండో ఇన్నింగ్స్‌పై క్రికెట్ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story