Ajit Agarkar: సెలెక్టర్లు, బీసీసీఐ మధ్య అభిప్రాయ భేదాలు.. చీఫ్ సెలెక్టర్‌గా అజిత్ అగార్కర్ కొనసాగుతారా?

Ajit Agarkar's Future. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ భవిష్యత్తుపై బీసీసీఐ త్వరలో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

Rishvik
Published on: 15 Aug 2026 12:17 PM IST
Ajit Agarkar
X

Ajit Agarkar: సెలెక్టర్లు, బీసీసీఐ మధ్య అభిప్రాయ భేదాలు.. చీఫ్ సెలెక్టర్‌గా అజిత్ అగార్కర్ కొనసాగుతారా?

Ajit Agarkar Future: టీమిండియా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ భవిష్యత్తుపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) త్వరలో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. శ్రీలంక-భారత్ టెస్టు సిరీస్ ముగిసిన తర్వాత బీసీసీఐ పెద్దలు అగార్కర్‌తో సమావేశం కానున్నట్లు ఓ జాతీయ మీడియా తమ కథనంలో పేర్కొంది. ఈ భేటీలో ఆయన పదవీకాలం పొడిగింపు, సెలక్షన్ కమిటీ భవిష్యత్తు వంటి అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

అజిత్ అగార్కర్ చీఫ్ సెలెక్టర్‌గా సెప్టెంబర్‌లో మూడేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసుకోనున్నాడు. బీసీసీఐ నిబంధనల ప్రకారం.. అగార్కర్ మరో ఏడాది పాటు పదవిలో కొనసాగేందుకు అర్హత ఉంది. అయితే టీమిండియా సీనియర్ ఆటగాడు రోహిత్ శర్మ భవిష్యత్తుపై సెలెక్టర్లు, బీసీసీఐ మధ్య అభిప్రాయ భేదాలు ఉన్నాయనే వార్తల నేపథ్యంలో అగార్కర్‌తో జరగనున్న సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది.

రోహిత్‌ను వన్డే జట్టు నుంచి తప్పించే విషయంపై సెలెక్టర్లు ఇప్పటికే అతడికి సమాచారం ఇచ్చినట్లు గతంలో వార్తలు వచ్చాయి. అయితే బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా మాత్రం హిట్‌మ్యాన్ తన ఫామ్, జట్టు అవసరాలకు అనుగుణంగా కొనసాగుతున్నంత కాలం దేశానికి ప్రాతినిధ్యం వహిస్తాడని చెప్పారు. దీంతో రోహిత్ భవిష్యత్తుపై సెలక్షన్ కమిటీ ఆలోచనలకు, బీసీసీఐ వైఖరికి మధ్య కొంత వ్యత్యాసం ఉన్నట్లు స్పష్టం అయింది.

2027 వన్డే ప్రపంచ కప్‌ను దృష్టిలో పెట్టుకుని రోహిత్ శర్మ భవిష్యత్తును సిరీస్‌ల వారీగా అంచనా వేయాలని బీసీసీఐ భావిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ విషయంలో బీసీసీఐ కార్యదర్శి చేసిన వ్యాఖ్యలు సెలెక్టర్లకు అసంతృప్తి కలిగించినట్లు సదరు నివేదిక పేర్కొంది. ఈ పరిణామాల నేపథ్యంలో శ్రీలంక సిరీస్ అనంతరం అజిత్ అగార్కర్‌తో జరిగే సమావేశంలో కీలక అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఈ భేటీ అనంతరం బీసీసీఐ ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. చీఫ్ సెలెక్టర్‌గా అగార్కర్ తన పదవిలో కొనసాగుతారా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్‌తో జరిగిన మూడో వన్డేలో రోహిత్ శర్మ అద్భుత సెంచరీతో చెలరేగాడు. లార్డ్స్ వేదికగా జరిగిన ఆ మ్యాచ్‌లో హిట్‌మ్యాన్ 138 పరుగులతో మెరిశాడు. లార్డ్స్‌లో వన్డే సెంచరీ చేసిన తొలి భారత బ్యాటర్‌గా కూడా నిలిచాడు. అయితే రోహిత్ అద్భుత ఇన్నింగ్స్‌ ఆడినప్పటికీ.. భారత్ 27 పరుగుల తేడాతో ఓడిపోయి, మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-2తో కోల్పోయింది. రోహిత్ అద్భుత ఇన్నింగ్స్‌పై మాజీలు ప్రశంసలు కురిపించారు.

వన్డేల్లో రోహిత్ భవిష్యత్తుపై వస్తున్న ఊహాగానాలకు ఆ సెంచరీతోనే సమాధానం చెప్పాడని రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. ఒక ఆటగాడు ఎంతో సాధించిన తర్వాత కూడా తనను తాను నిరూపించుకోవాల్సిన అవసరం లేదని, ఇంకా క్రికెట్ ఆడాలనే ఆసక్తి, కష్టపడే సామర్థ్యం ఉన్నంతకాలం అతడికి అవకాశం ఇవ్వాలని పేర్కొన్నాడు.

రోహిత్ శర్మ ఇప్పటికే టీ20, టెస్టులకు వీడ్కోలు పలికాడు. హిట్‌మ్యాన్ వన్డే కెరీర్‌పై తుది నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత బీసీసీఐ, సెలక్షన్ కమిటీపై ఉన్నప్పటికీ.. లార్డ్స్ సెంచరీతో పరిస్థితులు ఒక్కసారిగా ఆసక్తికరంగా మారాయి. అతడిని తప్పించే అవకాశాలు ఇప్పుడు లేవు. మరోవైపు అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపుపైనా త్వరలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. శ్రీలంక టెస్టు సిరీస్ అనంతరం జరిగే బీసీసీఐ సమావేశం అగార్కర్‌తో పాటు భారత వన్డే జట్టు భవిష్యత్తుపైనా కీలక ప్రభావం చూపే అవకాశముంది.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story