Akhilesh Reddy Ban: హైదరాబాద్ క్రికెటర్‌పై 8 ఏళ్ల నిషేధం.. ఇక కెరీర్ క్లోజ్.. ఏం చేశాడో తెలుసా?
Akhilesh Reddy Ban: Hyderabad-Born USA Cricketer Akhilesh Reddy Banned. అమెరికా క్రికెటర్ అఖిలేష్ రెడ్డిపై అంతర్జాతీయ క్రికెట్ మండలి ఎనిమిదేళ్ల నిషేధం విధించింది.
Akhilesh Reddy Ban: హైదరాబాద్ క్రికెటర్‌పై 8 ఏళ్ల నిషేధం.. ఇక కెరీర్ క్లోజ్.. ఏం చేశాడో తెలుసా?
Akhilesh Reddy Ban: అంతర్జాతీయ క్రికెట్‌లో మరోసారి మ్యాచ్ ఫిక్సింగ్ వ్యవహారం కలకలం రేపింది. భారత సంతతి, అమెరికా యువ క్రికెటర్ బొడుగుం అఖిలేష్ రెడ్డిపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఎనిమిదేళ్ల నిషేధం విధించింది. ఐసీసీ యాంటీ కరప్షన్ కోడ్‌లోని మూడు కీలక నిబంధనలను ఉల్లంఘించినట్లు యాంటీ కరప్షన్ ట్రైబ్యునల్ నిర్ధారించడంతో.. బోర్డు నిర్ణయం తీసుకుంది. 2025లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో జరిగిన అబుదాబి టీ10 టోర్నమెంట్‌లో మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడిన నేపథ్యంలో అఖిలేష్ రెడ్డిపై ఐసీసీ కఠిన చర్యలు తీసుకుంది.
అఖిలేష్ రెడ్డి శిక్షను 2025 నవంబర్ 21 నుంచే అమల్లోకి వచ్చినట్లుగా ఐసీసీ వెల్లడించింది. అదే రోజున అతడిని క్రికెట్ నుంచి తాత్కాలికంగా సస్పెండ్ చేశారు. యూఏఈ క్రికెట్ బోర్డు తరఫున అబుదాబి టీ10 లీగ్‌కు డిజిగ్నేటెడ్ యాంటీ కరప్షన్ అధికారిగా ఐసీసీ వ్యవహరించింది. మ్యాచ్ ఫలితం, మ్యాచ్ తీరును అఖిలేష్ ప్రభావితం చేసే ప్రయత్నం చేశాడని విచారణ అనంతరం ట్రైబ్యునల్ తేల్చింది. అలాగే మరో ఆటగాడిని కూడా ఫిక్సింగ్‌కు ప్రేరేపించే ప్రయత్నం చేసినట్లు గుర్తించింది. ఈ కేసులో అత్యంత కీలకమైన ఘటన 2025 నవంబర్ 19న అబుదాబిలోని ఓ హోటల్‌లో చోటుచేసుకుంది.
ఆస్పిన్ స్టాలియన్స్ జట్టు తొలి మ్యాచ్‌కు ముందు అఖిలేష్ రెడ్డి తన సహచర ఆటగాడితో మాట్లాడాడని, బౌలింగ్ సమయంలో ఉద్దేశపూర్వకంగా ఎక్కువ పరుగులు ఇవ్వాలని కోరినట్లు విచారణలో వెల్లడైంది. జట్టు యాజమాన్యం సూచనల మేరకే ఈ ప్రతిపాదన చేశాడని కూడా ట్రైబ్యునల్ పేర్కొంది. అయితే సదరు ఆటగాడు ఫిక్సింగ్ ప్రతిపాదనను తిరస్కరించి.. వెంటనే ఐసీసీ యాంటీ కరప్షన్ యూనిట్కు ఫిర్యాదు చేశాడు. అనంతరం అఖిలేష్ రెడ్డిని మ్యాచ్‌కు ముందు తుది జట్టు నుంచి తప్పించారు.
దర్యాప్తు సమయంలో అఖిలేష్ రెడ్డి తన మొబైల్ ఫోన్‌లోని వాట్సాప్ మెసేజెస్, కాల్ లిస్టును తొలగించిన విషయం కూడా వెలుగులోకి వచ్చింది. ఇది సాధారణంగా ఫోన్‌ను క్లీన్ చేసే ప్రక్రియలో భాగమేనని అతడు వాదించినప్పటికీ.. ట్రైబ్యునల్ ఆ వాదనను తిరస్కరించింది. దర్యాప్తుకు సంబంధించిన కీలక ఆధారాలను ఉద్దేశపూర్వకంగానే తొలగించాడని తేల్చింది. ఈ కారణంగా యాంటీ కరప్షన్ దర్యాప్తును అడ్డుకునే ప్రయత్నం చేసినట్లు కూడా అతడిపై ఆరోపణలు రుజువయ్యాయి. మైఖేల్ జే. బెలాఫ్ కేఎసీ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ట్రైబ్యునల్ ఈ కేసును విచారించి తుది తీర్పు వెలువరించింది. జస్టిస్ కేట్ ఓ'రేగన్, లాయిడ్ మహిషి ఇతర సభ్యులుగా ఉన్నారు.
అఖిలేష్ రెడ్డి నార్త్ అమెరికా టీ20 కప్‌లో కేమన్ దీవులపై యూఎస్ఏ తరఫున అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు అమెరికా జట్టు తరఫున నాలుగు టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి ఒక వికెట్ పడగొట్టాడు. అయితే ఇప్పుడు ఐసీసీ విధించిన ఎనిమిదేళ్ల నిషేధంతో అతని క్రికెట్ కెరీర్ క్లోజ్ అయినట్లే. 2033 వరకు ఎలాంటి మ్యాచ్‌లు ఆడకూడదు. హైదరాబాద్‌లో జన్మించిన 26 ఏళ్ల అఖిలేష్.. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు నెట్ బౌలర్‌గా పనిచేశాడు. విజయ్ హజరే ట్రోఫీ జట్టులో సభ్యుడిగా కూడా ఉన్నాడు. ఆపై యూస్ వెళ్లి జాతీయ జట్టులో చోటు దక్కించుకున్నాడు.




