Anvay Dravid: తండ్రికి తగ్గ తనయుడు.. శ్రీలంకపై మెరుపు ఇనింగ్స్.. తృటిలో మిస్ అయిన అన్వయ్ ద్రవిడ్!

Anvay Dravid Shines With 87 vs Sri Lanka U19. భారత క్రికెట్ దిగ్గజం రాహుల్ ద్రవిడ్ తనయుడు అన్వయ్ మరోసారి తన ప్రతిభను చాటుకున్నాడు.

Rishvik
Published on: 6 July 2026 6:24 PM IST
Anvay Dravid
X

Anvay Dravid: తండ్రికి తగ్గ తనయుడు.. శ్రీలంకపై మెరుపు ఇనింగ్స్.. తృటిలో మిస్ అయిన అన్వయ్ ద్రవిడ్!

అన్వయ ద్రావిడ్: భారత క్రికెట్ దిగ్గజం, ది వాల్ రాహుల్ ద్రవిడ్ తనయుడు అన్వయ్ ద్రవిడ్ మరోసారి తన ప్రతిభను చాటుకున్నాడు. శ్రీలంక అండర్-19 జట్టుతో జరుగుతున్న రెండో యూత్ వన్డేలో అద్భుత బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. అన్వయ్ కేవలం 67 బంతుల్లో 87 పరుగులు చేసి భారత్ జట్టుకు పోరాడే స్కోరు అందించాడు. అయితే తృటిలో అతడు సెంచరీ మిస్ అయ్యాడు. మహింద రాజపక్స అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఈరోజు జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ 47.2 ఓవర్లలో 285 పరుగులకు ఆలౌట్ అయింది.

టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. 19 ఓవర్లలోనే 81 పరుగులకు నాలుగు కీలక వికెట్లు కోల్పోయి భారత్ కష్టాల్లో పడింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన అన్వయ్ ద్రవిడ్.. అర్జున్ రాజ్‌పుత్‌తో కలిసి అద్భుతంగా ఇన్నింగ్స్‌ను నిర్మించాడు. వీరిద్దరూ ఐదో వికెట్‌కు 145 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టును బలమైన స్థితిలో నిలిపారు. 17 ఏళ్ల అన్వయ్ తన ఇన్నింగ్స్‌లో దూకుడు కనబరిచాడు. 67 బంతుల్లో 87 పరుగులు చేసిన అతడు తొమ్మిది ఫోర్లు, ఒక సిక్సర్ బాదాడు. కేవలం 47 బంతుల్లోనే తన తొలి యూత్ వన్డే అర్ధశతకాన్ని పూర్తి చేశాడు. శతకం దిశగా దూసుకెళ్తున్న సమయంలో శ్రీలంక పేసర్ గిమ్హాన్ మెండిస్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. అన్వయ్ 129.85 స్ట్రైక్‌రేట్‌తో బ్యాటింగ్ చేసి తన ప్రతిభను మరోసారి నిరూపించుకున్నాడు.

మరోవైపు అర్జున్ రాజ్‌పుత్ కూడా 81 బంతుల్లో 76 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అయితే దిమంత మహవితాన అద్భుత త్రోతో రనౌట్‌గా వెనుదిరిగాడు. అనంతరం అన్వయ్ ద్రవిడ్ 263 పరుగుల వద్ద ఏడో వికెట్‌గా ఔటవడంతో.. మిగతా బ్యాటర్లు వరుసగా పెవిలియన్ చేరారు. చివరి మూడు వికెట్లు కేవలం 22 పరుగుల వ్యవధిలోనే కోల్పోవడంతో భారత్ 285 పరుగులకే పరిమితమైంది. శ్రీలంక బౌలర్లలో గిమ్హాన్ మెండిస్ ఐదు వికెట్లు తీసి భారత బ్యాటింగ్‌ను దెబ్బతీశాడు. అతడు 5/41 బౌలింగ్ గణాంకాలు నమోదు చేశాడు. ఛేదనలో దిమంత మహావితన (155) సెంచరీ చేయడంతో లంక 8 వికెట్ల తేడాతో గెలిచింది. సెనుజ వెకునగోడ (60), విమత్ దిన్సార (56) సెంచరీలు బాదారు.

కర్ణాటక తరఫున వినూ మాంకడ్ ట్రోఫీలో కెప్టెన్‌గా వ్యవహరించిన అన్వయ్ ద్రవిడ్.. ఆ టోర్నీలో 220 పరుగులు చేసి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. రానున్న అండర్-19 ప్రపంచకప్‌కు అతడు బలమైన పోటీదారుడిగా నిలుస్తున్నాడు. అన్వయ్ సోదరుడు సమిత్ ద్రవిడ్ కూడా గతంలో ఆస్ట్రేలియా అండర్-19 సిరీస్‌కు భారత జట్టులో ఎంపికైనప్పటికీ.. మోకాలి గాయం కారణంగా ఆ సిరీస్‌కు దూరమయ్యాడు. ఇక మూడు మ్యాచ్‌ల ఈ యూత్ వన్డే సిరీస్‌ ప్రస్తుతం 1-1తో సమంగా ఉంది. తొలి మ్యాచ్‌లో 321 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి నాలుగు వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించిన భారత జట్టు.. ఇప్పుడు రెండో మ్యాచ్‌లో ఓడిపోయింది. అన్వయ్ ద్రవిడ్ ప్రదర్శనతో భారత యువ జట్టుకు మరో భవిష్యత్ స్టార్ సిద్ధమవుతున్నాడనే సంకేతాలు కనిపిస్తున్నాయి.


Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story