FIFA World Cup 2026 : సెమీస్‌లోకి అర్జెంటీనా.. మెస్సీ మ్యాజిక్.!
FIFA World Cup 2026 : ఫిఫా ప్రపంచకప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా తన జైత్రయాత్రను కొనసాగిస్తూ సెమీఫైనల్లోకి అడుగుపెట్టింది. ఆదివారం ఉదయం జరిగిన
FIFA World Cup 2026
FIFA World Cup 2026 : ఫిఫా ప్రపంచకప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా తన జైత్రయాత్రను కొనసాగిస్తూ సెమీఫైనల్లోకి అడుగుపెట్టింది. ఆదివారం ఉదయం జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో అర్జెంటీనా 3-1 తేడాతో స్విట్జర్లాండ్‌ను చిత్తు చేసి ఘన విజయం సాధించింది. మైదానంలో ఇరు జట్లు హోరాహోరీగా తలపడటంతో నిర్ణీత సమయంలో మ్యాచ్ డ్రాగా ముగిసింది. అయితే, ఆ తర్వాత లభించిన ఎక్స్ట్రా టైంలో అర్జెంటీనా ఆటగాళ్లు అటాకింగ్ గేమ్ ఆడి వరుసగా రెండు గోల్స్ చేయడంతో స్విట్జర్లాండ్ కథ ముగిసింది.
మెస్సీ సూపర్ పాస్.. అలిస్టర్ తొలి గోల్
మ్యాచ్ ప్రారంభమైన కొద్దిసేపటికే గ్రౌండ్లో అర్జెంటీనా హవా కనిపించింది. ఆట 10వ నిమిషంలోనే స్టార్ ప్లేయర్ లియోనల్ మెస్సీ డిఫెండర్లను ఛేదిస్తూ ఇచ్చిన ఒక అద్భుతమైన పాస్‌ను అలెక్సిస్ మాక్ అలిస్టర్ అందుకన్నాడు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా బంతిని నేరుగా గోల్ పోస్ట్‌లోకి పంపించి అర్జెంటీనాకు 1-0తో సంచలన ఆధిక్యాన్ని అందించాడు. ఈ గోల్‌తో మైదానమంతా అర్జెంటీనా అభిమానుల అరుపులతో మారుమోగిపోయింది. తొలి హాఫ్‌లో అర్జెంటీనా డిఫెన్స్ విభాగాన్ని ఛేదించలేక స్విట్జర్లాండ్ ఆటగాళ్లు చాలా ఇబ్బంది పడ్డారు.
పుంజుకున్న స్విట్జర్లాండ్.. రెడ్‌కార్డ్ సెగ
ఫస్ట్ హాఫ్ లో పూర్తిగా వెనుకబడిన స్విట్జర్లాండ్, సెకండ్ హాఫ్‌లో మాత్రం సరికొత్త వ్యూహాలతో బరిలోకి దిగింది. అర్జెంటీనాపై ఒత్తిడి పెంచుతూ వరుస అటాక్స్ చేసింది. ఈ క్రమంలోనే ఆట 67వ నిమిషంలో స్విస్ ప్లేయర్ డాన్ నోయే డిఫెండర్ల కళ్లుగప్పి ఒక సూపర్ గోల్ కొట్టాడు. దీంతో స్కోరు 1-1తో సమమైంది. మ్యాచ్ ఉత్కంఠగా సాగుతున్న సమయంలో, 72వ నిమిషంలో స్విట్జర్లాండ్‌కు ఊహించని షాక్ తగిలింది. ఆ జట్టు కీలక ఆటగాడు బ్రీల్ ఎంబోలో ఫౌల్ చేయడంతో అంపైర్ అతనికి రెడ్‌కార్డ్ చూపించి మైదానం వెలుపలికి పంపించేశారు. దీంతో స్విట్జర్లాండ్ కేవలం పది మంది ఆటగాళ్లతోనే మ్యాచ్‌ను కొనసాగించాల్సి వచ్చింది. అయినప్పటికీ పట్టుదలతో ఆడిన స్విస్ టీమ్, నిర్ణీత సమయంతో పాటు స్టాపింగ్ టైమ్‌లోనూ అర్జెంటీనాకు మరో గోల్ ఇవ్వకుండా అడ్డుకుంది.
ఎక్స్ట్రా టైమ్‌లో అర్జెంటీనా రుద్రరూపం
నిర్ణీత 90 నిమిషాల్లో స్కోరు సమం కావడంతో మ్యాచ్ ఫలితం కోసం అదనపు సమయాన్ని (ఎక్స్ట్రా టైమ్) కేటాయించారు. ఇక్కడే అర్జెంటీనా తన అనుభవాన్నంతా ఉపయోగించి స్విట్జర్లాండ్‌పై పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఆట 112వ నిమిషంలో జులియన్ అల్వారెజ్ పవర్ఫుల్ గోల్ చేసి అర్జెంటీనాకు 2-1తో మళ్లీ లీడ్ అందించాడు. ఇక మ్యాచ్ ముగియడానికి మరో కొన్ని సెకన్లు మాత్రమే మిగిలి ఉన్నాయనగా (121వ నిమిషంలో) లౌటారో మార్టినేజ్ మూడో గోల్ కొట్టి స్విట్జర్లాండ్ ఆశలపై పూర్తిగా నీళ్లు చల్లాడు. దీంతో అర్జెంటీనా 3-1తో విజయాన్ని ఖరారు చేసుకుంది.
సెమీస్‌లో ఇంగ్లండ్‌తో అమీతుమీ.. ఫైనల్ రిపీట్ అవుతుందా?
ఈ విజయంతో సెమీఫైనల్‌కు చేరిన అర్జెంటీనా, అక్కడ బలమైన ఇంగ్లండ్ జట్టుతో తలపడనుంది. మరో సెమీఫైనల్ మ్యాచ్‌లో స్పెయిన్, ఫ్రాన్స్ జట్లు పోటీ పడబోతున్నాయి. ఫుట్‌బాల్ అభిమానులంతా ఇప్పుడు ఒక ఆసక్తికరమైన సమీకరణం కోసం ఎదురుచూస్తున్నారు. ఒకవేళ సెమీస్‌లో అర్జెంటీనా, ఫ్రాన్స్ రెండు జట్లూ విజయం సాధిస్తే.. 2022 ఫిఫా వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్ మరోసారి రిపీట్ అయ్యే అవకాశం ఉంది. గత వరల్డ్‌కప్ ఫైనల్లో ఫ్రాన్స్‌ను పెనాల్టీ షూటౌట్లో ఓడించి అర్జెంటీనా మూడోసారి ట్రోఫీని ముద్దాడిన సంగతి తెలిసిందే. మరి ఈసారి కప్ ఎవరు కొడతారో చూడాలి.




