200కిపైగా రీల్స్, కోహ్లీతో వైరల్ వీడియో డిలీట్ చేసిన అర్ష్‌దీప్.. ఎందుకంటే
Arshdeep Singh: టీమిండియా ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ తన ఇన్స్టాగ్రామ్ నుంచి 200కు పైగా పోస్టులను డిలీట్ చేయడం సంచలనమైంది.
200కిపైగా రీల్స్, కోహ్లీతో వైరల్ వీడియో డిలీట్ చేసిన అర్ష్‌దీప్.. ఎందుకంటే
Arshdeep Singh: టీమిండియా యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ తాజాగా తన ఇన్స్టాగ్రామ్ ఖాతా నుంచి 200కు పైగా పోస్టులను అకస్మాత్తుగా డిలీట్ చేయడమే కాకుండా, తన ప్రొఫైల్ పిక్చర్‌ను కూడా మార్చేశాడు. అంతేకాకుండా ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సమయంలో విరాట్ కోహ్లీతో కలిసి అర్ష్‌దీప్ చేసిన రీల్, దాదాపు 15 కోట్ల వ్యూస్ సాధించిన ఆ వైరల్ వీడియోను కూడా అతడు తొలగించడం గమనార్హం.
అర్ష్‌దీప్ సింగ్ ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక ఉన్న కారణాన్ని అధికారికంగా వెల్లడించలేదు. ఇలా అతడు ఎందుకు చేశాడన్న విషయంపై సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. అతడు డిలీట్ చేయని పోస్టుల్లో కేవలం కుటుంబ సభ్యుల ఫోటోలు, క్రికెట్ మైలురాళ్లు, కొన్ని బ్రాండ్ ప్రమోషన్లు మాత్రమే కనిపిస్తున్నాయి.
ఐపీఎల్ 2026లో వివాదాలు..
ఈ పోస్టుల తొలగింపునకు, ఐపీఎల్ 2026 సీజన్లో అర్ష్‌దీప్ ఎదుర్కొన్న వివాదాలకు సంబంధం ఉందేమోనని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. పంజాబ్ కింగ్స్ తరపున ఆడుతున్న అర్ష్‌దీప్, ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్ సందర్భంగా తోటి ఆటగాడు తిలక్ వర్మపై జాత్యహంకార వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు ఎదుర్కొన్నాడు. దీనిపై మాజీ క్రికెటర్ లక్ష్మణ్ శివరామకృష్ణన్ లాంటివారు తీవ్రంగా స్పందించారు. అంతేకాకుండా, పంజాబ్ ఓటమి తర్వాత ఒక అభిమానిపై స్నాప్‌చాట్‌లో అతడు చేసిన వ్యాఖ్యలు కూడా సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి.
ఈ ఐపీఎల్ సీజన్ అర్ష్‌దీప్‌కు అంతగా కలిసి రాలేదు. 14 మ్యాచ్‌లలో కేవలం 14 వికెట్లు మాత్రమే తీయగలిగాడు, అలాగే అతడి ఎకానమీ రేటు కూడా 10 కంటే ఎక్కువగా నమోదైంది. క్షేత్రస్థాయిలో వరుస వైఫల్యాలు, బయట వివాదాల నడుమ అర్ష్‌దీప్ తీసుకున్న ఈ నిర్ణయం క్రీడాభిమానులలో ఆసక్తిని కలిగిస్తోంది.




