Arun Dhumal: కోహ్లీలా క్రికెట్‌పై ఫోకస్ పెట్టాలి, రీల్స్‌పై కాదు.. ఐపీఎల్ ఛైర్మన్ కీలక వ్యాఖ్యలు!

Arun Dhumal: ఐపీఎల్ 2026 సీజన్‌లో పలువురు ఆటగాళ్ల సోషల్ మీడియా కార్యకలాపాలపై చర్చలు జోరుగా సాగుతున్నాయి.

Rishvik
Published on: 18 May 2026 8:56 PM IST
Arun Dhumal
X

Arun Dhumal: కోహ్లీలా క్రికెట్‌పై ఫోకస్ పెట్టాలి, రీల్స్‌పై కాదు.. ఐపీఎల్ ఛైర్మన్ కీలక వ్యాఖ్యలు!

Arun Dhumal: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ (ఐపీఎల్) 2026 సీజన్‌లో పలువురు ఆటగాళ్ల సోషల్ మీడియా కార్యకలాపాలపై చర్చలు జోరుగా సాగుతున్నాయి. ఈ సమయంలో ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. క్రికెటర్లు రీల్స్‌, వ్లాగ్స్ కంటే మైదానంలో తమ ప్రదర్శనపై ఎక్కువ దృష్టి పెట్టాలని సూచించారు. ముఖ్యంగా టోర్నీ జరుగుతున్న సమయంలో సోషల్ మీడియా కార్యకలాపాలు ఆటపై ప్రభావం చూపకూడదని ఆయన హెచ్చరించారు.

ఐఏఎన్‌ఎస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అరుణ్ ధుమాల్ మాట్లాడుతూ.. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని ఉదాహరణగా చూపించారు. ‘క్రికెటర్లు రీల్స్ కంటే రియాలిటీస్‌పై ఫోకస్ పెట్టాలి. విరాట్ కోహ్లీకి భారీ స్థాయిలో సోషల్ మీడియా ఫాలోయింగ్ ఉంది. అయినప్పటికీ అతడు మైదానంలో ఉంటే పూర్తిగా క్రికెట్‌పైనే దృష్టి పెడతాడు. రీల్స్ వల్ల కాదు.. తన ప్రదర్శనలతోనే అభిమానులను, ఫాలోయింగ్ సాధించాడు. టోర్నీ జరుగుతున్న సమయంలో ఆటగాళ్లు రీల్స్ చేయడంలో ఎక్కువగా మునిగిపోకూడదని నేను భావిస్తున్నాను’ అని అరుణ్ ధుమాల్ చెప్పుకొచ్చారు.

ఐపీఎల్ 2026లో కొన్ని సోషల్ మీడియా వివాదాలు వెలుగులోకి రావడంతో అరుణ్ ధుమాల్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇటీవల భారత పేసర్ అర్ష్‌దీప్ సింగ్ తన వ్లాగ్స్ కారణంగా వివాదంలో చిక్కుకున్నాడు. అతడు చేసిన ఒక ట్రావెల్ వ్లాగ్‌లో టీమిండియా మణికట్టు స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ విమాన ప్రయాణ సమయంలో వేపింగ్ చేస్తున్న దృశ్యాలు బయటికి వచ్చాయి.

ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. తర్వాత అసలు వీడియోను ఎడిట్ చేశారట. మరో వీడియోలో తిలక్ వర్మపై అర్ష్‌దీప్ సరదాగా చేసిన వ్యాఖ్యలు కూడా విమర్శలకు దారితీశాయి. తిలక్‌ను ఉద్దేశించి ‘అంధేరే’ అంటూ వ్యాఖ్యానించడం, సన్‌స్క్రీన్ వాడాలని చెప్పడం సోషల్ మీడియాలో జాత్యహంకార వ్యాఖ్యలుగా కొందరు అభిప్రాయపడ్డారు. దీంతో ఆటగాళ్ల ఆన్‌లైన్ ప్రవర్తనపై మళ్లీ చర్చ మొదలైంది.

ఈ నేపథ్యంలో బీసీసీఐ అన్ని ఐపీఎల్ ఫ్రాంచైజీలకు కొత్త మార్గదర్శకాలు జారీ చేసినట్లు సమాచారం. సోషల్ మీడియా ప్రవర్తన, యాంటీ కరప్షన్ నిబంధనలు, స్మోకింగ్-వేపింగ్ నియంత్రణలు, ఆటగాళ్ల ప్రవర్తన వంటి అంశాలపై ప్రత్యేక సూచనలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఐపీఎల్ టోర్నీ ప్రతిష్ట దెబ్బతినకుండా ఉండేందుకు బీసీసీఐ కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించినట్లు సమాచారం. నిబంధనలు అతిక్రమిస్తే జరిమానాతో పాటు నిషేధం కూడా ఉంటుందని బీసీసీఐ తేల్చి చెప్పింది.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story