MS Dhoni: సీఎస్‌కేపై ధోనీ లవ్ కనిపించలేదు.. ఎందుకో అర్థం కావడం లేదు.. అశ్విన్ షాకింగ్ కామెంట్స్!
MS DHoni: ఎంఎస్ ధోనీపై రవిచంద్రన్ అశ్విన్ చేసిన వ్యాఖ్యలు అభిమానుల్లో చర్చకు దారితీశాయి.
MS Dhoni: సీఎస్‌కేపై ధోనీ లవ్ కనిపించలేదు.. ఎందుకో అర్థం కావడం లేదు.. అశ్విన్ షాకింగ్ కామెంట్స్!
MS DHoni: ఐపీఎల్ 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) తన చివరి హోం మ్యాచ్ ఆడేసింది. చెపాక్ వేదికగా మే 18న సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్)తో ఆడింది. ఈ మ్యాచ్‌లో క్రికెట్ దిగ్గజం, సీఎస్‌కే మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఆడుతాడని అందరూ అనుకున్నా.. అది జరగలేదు. అయితే మహీ మైదానంలోకి వచ్చి అభిమానులకు అభివాదం చేశాడు. అంతేకాదు జట్టు ఫోటోషూట్‌లో పాల్గొన్నాడు. కాలి కండరాల గాయం కారణంగా ఈ సీజన్లో ఇప్పటివరకు ఆడలేదు. ఫిట్‌నెస్ సాధించినా.. జట్టు కాంబినేషన్ దెబ్బతినకూడదనే ఉద్దేశంతోనే ధోనీ ప్లేయింగ్ ఎలెవన్‌కు దూరంగా ఉన్నట్లు సీఎస్‌కే వర్గాలు తెలిపాయి.
మ్యాచ్ అనంతరం భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దిగ్గజ కెప్టెన్ ఎంఎస్ ధోనీపై అశ్విన్ చేసిన వ్యాఖ్యలు అభిమానుల్లో చర్చకు దారితీశాయి. ప్రతి సీజన్‌లాగే చివరి హోం మ్యాచ్ అనంతరం సీఎస్‌కే ఆటగాళ్లు అభిమానులకు కృతజ్ఞతగా చెపాక్ మైదానంలో ల్యాప్ ఆఫ్ హానర్ నిర్వహించారు. అయితే ఈ సందర్భంగా ధోనీ ప్రవర్తనపై అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడిన అశ్విన్.. ‘ఎంఎస్ ధోనీకి సీఎస్‌కేపై ఎంతో ప్రేమ ఉందనడంలో సందేహం లేదు. కానీ నిన్న ల్యాప్ ఆఫ్ హానర్ సమయంలో ఆ ప్రేమ పెద్దగా కనిపించలేదు. అతడిలో ఆ ఆనందం కనిపించలేదనిపించింది. ఎందుకో నాకు అర్థం కాలేదు’ అని పేర్కొన్నాడు.
ఎంఎస్ ధోనీ మైదానానికి రాకపోవడంపై కూడా ఆర్ అశ్విన్ ప్రశ్నలు లేవనెత్తాడు. ‘ధోనీ ఎన్నో ఏళ్లుగా చెన్నై జట్టులో భాగం. ప్రతి మ్యాచ్‌లో డ్రెస్సింగ్ రూమ్‌లో ఉండే ఆటగాడు అతడు. ఆడకపోయినా మైదానానికి రావచ్చు కదా. నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్న ధోనీని మనం చూశాం. అయినా ఒక్క మ్యాచ్‌లో అయినా ఆడలేదు ఎందుకో అని నా మనసులో ఓ ప్రశ్న మెదులుతోంది’ అని అశ్విన్ అన్నాడు. అభిమానుల దృష్టి మొత్తం తనపై పడుతుందని, జట్టు దృష్టి మరలిపోతుందని ధోనీ భావించాడేమోనని కూడా అశ్విన్ అభిప్రాయపడ్డాడు. ‘ఒకవేళ నేను వస్తే అందరి దృష్టి నాపైనే ఉంటుంది, అది జట్టును డిస్టర్బ్ చేస్తుందని ధోనీ అనుకుని ఉండొచ్చు. కానీ అలా అయితే అభిమానులు తమ అభిమాన ఆటగాడిని చూసే అవకాశాన్ని కోల్పోతారు’ అని చెప్పుకొచ్చాడు.
ఎంఎస్ ధోనీ ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకడు. ఐదు ఐపీఎల్ టైటిళ్లతో ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాడు. ధోనీ నాయకత్వంలో చెన్నై సూపర్ కింగ్స్ 2010, 2011, 2018, 2021, 2023 సీజన్లలో ఛాంపియన్‌గా నిలిచింది. ప్రస్తుతం ధోనీ భవిష్యత్తుపై స్పష్టత లేకపోవడంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో అశ్విన్ చేసిన వ్యాఖ్యలు మరింత ఆసక్తికరంగా మారాయి.




