T20 World Cup 2026: భారత్‌కు టీ20 ప్రపంచకప్ గెలిచే సత్తా లేదు.. అశ్విన్ షాకింగ్ కామెంట్స్!

T20 World Cup 2026: భారత్ ప్రపంచకప్ గెలిచే అవకాశాలపై రవిచంద్రన్ అశ్విన్ సందేహం వ్యక్తం చేశాడు.

Rishvik
Published on: 15 Jun 2026 6:26 PM IST
T20 World Cup 2026
X

T20 World Cup 2026: భారత్‌కు టీ20 ప్రపంచకప్ గెలిచే సత్తా లేదు.. అశ్విన్ షాకింగ్ కామెంట్స్!

T20 World Cup 2026: ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. ఆదివారం బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో భారత్ 64 పరుగుల తేడాతో పాకిస్థాన్‌ను చిత్తు చేసింది. ఓపెనర్ స్మృతి మంధాన అద్భుత హాఫ్ సెంచరీ (64)తో రాణించగా.. దీప్తి శర్మ ఐదు వికెట్లు తీసి మ్యాచ్‌ను ఏకపక్షంగా మార్చింది. దాయాది పాకిస్థాన్‌పై ఘన విజయంతో మెగా టోర్నీలో శుభారంభం చేసినప్పటికీ.. భారత్ టైటిల్ గెలిచే అవకాశాలపై మాజీ టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సందేహం వ్యక్తం చేశాడు. యాష్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

భారత్‌కు పవర్ హిట్టింగ్ లోపం:

తన యూట్యూబ్ ఛానెల్ ‘ఆష్ కీ బాత్’లో మాట్లాడిన ఆర్ అశ్విన్.. భారత జట్టులో పవర్ హిట్టర్ల కొరత ఉందని అభిప్రాయపడ్డాడు. పాకిస్థాన్‌పై అద్భుత ప్రదర్శన చేసినప్పటికీ.. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా వంటి బలమైన జట్లను ఎదుర్కొన్నప్పుడు భారత్ ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని పేర్కొన్నాడు. 'భారత్ ఈ టీ20 ప్రపంచకప్‌లో చాలా దూరం వెళ్తుందని నాకు నమ్మకం లేదు. జట్టులో పవర్ హిట్టింగ్ లోపిస్తోంది. పాకిస్థాన్‌పై స్పిన్ బౌలింగ్ అద్భుతంగా రాణించింది. కానీ ఇంగ్లండ్, ఆస్ట్రేలియా వంటి జట్లతో పోలిస్తే భారత జట్టులో లోతు తక్కువగా కనిపిస్తోంది. కీలక మ్యాచ్‌ల్లో ఇది సమస్యగా మారవచ్చు' అని అశ్విన్ వ్యాఖ్యానించాడు.

జట్టును ప్రశంసించిన జెమీమా రోడ్రిగ్స్:

మరోవైపు భారత స్టార్ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ మాత్రం జట్టు సమిష్టి ప్రదర్శనను ప్రశంసించింది. మ్యాచ్ అనంతరం బీసీసీఐ విడుదల చేసిన వీడియోలో డ్రెస్సింగ్ రూమ్‌లో మాట్లాడిన జెమీమా.. ప్రతి ప్లేయర్ కృషిని గుర్తుచేసింది. ఓపెనర్ షెఫాలీ వర్మను ప్రశంసిస్తూ.. 'పెద్ద టోర్నీలో తొలి బంతికే సిక్స్ కొట్టడం ప్రత్యేక విషయం. షెఫాలీ జట్టుకు అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చింది' అని తెలిపింది.

స్మృతి మంధాన, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ మధ్య నెలకొన్న కీలక భాగస్వామ్యం మ్యాచ్‌ను భారత్ వైపు తిప్పిందని జెమీమా పేర్కొంది. 'స్మృతి, హర్మన్‌ప్రీత్ ఇద్దరూ పరిస్థితికి తగ్గట్టుగా అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. జట్టును కష్టాల్లో నుంచి బయటపడేశారు. ఇద్దరి అనుభవం ఈ మ్యాచ్‌లో స్పష్టంగా కనిపించింది' అని ప్రశంసించింది.

రిచా, దీప్తి ముగింపు అద్భుతం:

భారత్ ఇన్నింగ్స్ చివర్లో రిచా ఘోష్, దీప్తి శర్మ వేగంగా పరుగులు సాధించడం కూడా విజయానికి కీలకమైందని జెమీమా తెలిపింది. 'మ్యాచ్‌ను రిచా, దీప్తి అద్భుతంగా ముగించారు. జట్టు స్కోరును పోటీ స్థాయికి తీసుకెళ్లడంలో వారి పాత్ర ఎంతో ముఖ్యమైనది" అని పేర్కొంది. పాకిస్థాన్‌పై భారీ విజయంతో ఆత్మవిశ్వాసం పెరిగినప్పటికీ.

ప్రపంచకప్‌లో భారత్‌కు అసలు పరీక్ష ఇంకా మిగిలే ఉందని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ వంటి బలమైన జట్లను ఎదుర్కొన్నప్పుడు భారత బ్యాటింగ్‌లో పవర్ హిట్టింగ్ లోపం బయటపడే అవకాశం ఉందని అశ్విన్ హెచ్చరించాడు. అయితే పాకిస్థాన్‌పై సమిష్టి ప్రదర్శనతో గెలిచిన టీమిండియా.. అదే జోరును కొనసాగిస్తే టైటిల్ రేసులో బలమైన పోటీదారుగా నిలవగలదనే ఆశాభావం అభిమానుల్లో వ్యక్తమవుతోంది.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story