దిగ్గజ ఆటగాడికి ఇచ్చే గౌరవం ఇదేనా?.. రోహిత్ వీడ్కోలు వార్తలపై నిప్పులు చెరిగిన అశ్విన్..!

Rohit Sharma Retirement: లార్డ్స్ మైదానంలో ఇంగ్లాండ్‌తో జరగబోయే మూడో వన్డే మ్యాచ్ రోహిత్ శర్మ అంతర్జాతీయ కెరీర్‌లో చివరిది కానుందనే వార్తలు కోట్లాది మంది అభిమానుల హృదయాలను గాయపరుస్తున్నాయి.

Venkat
Published on: 17 July 2026 8:15 PM IST
Rohit Sharma Retirement
X

దిగ్గజ ఆటగాడికి ఇచ్చే గౌరవం ఇదేనా?.. రోహిత్ వీడ్కోలు వార్తలపై నిప్పులు చెరిగిన అశ్విన్..!

Rohit Sharma Retirement: భారత క్రికెట్ దిగ్గజం రోహిత్ శర్మ వన్డే కెరీర్‌కు అర్ధాంతరంగా ముగింపు పలకనున్నారనే వార్తలు క్రీడాలోకంలో తీవ్ర కలకలం రేపుతున్నాయి. రాబోయే 2027 ప్రపంచకప్ ప్రణాళికల నుంచి రోహిత్‌ను బీసీసీఐ పక్కన పెట్టడంపై భారత సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, సెలక్టర్ల తీరును అశ్విన్ తప్పుబట్టారు.

రోహిత్‌కు బీసీసీఐ అవమానం.. అశ్విన్ సంచలన వ్యాఖ్యలు..

లార్డ్స్ మైదానంలో ఇంగ్లాండ్‌తో జరగబోయే మూడో వన్డే మ్యాచ్ రోహిత్ శర్మ అంతర్జాతీయ కెరీర్‌లో చివరిది కానుందనే వార్తలు కోట్లాది మంది అభిమానుల హృదయాలను గాయపరుస్తున్నాయి. భవిష్యత్తు కోసం యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలనే సాకుతో బీసీసీఐ రోహిత్ శర్మను జట్టుకు దూరం పెట్టాలని భావిస్తోంది. ఈ వ్యవహారంపై భారత దిగ్గజ ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ బహిరంగంగానే పెదవి విరిచారు. ఒక యూట్యూబ్ ఛానెల్ చర్చా కార్యక్రమంలో అశ్విన్ మాట్లాడుతూ.. దేశం కోసం ఎన్నో రికార్డులు సృష్టించిన ఒక దిగ్గజ ఆటగాడిని జట్టుకు అనవసరమైన వ్యక్తిగా మార్చేయడం అత్యంత విచారకరమని, ఇలాంటి వాతావరణంలో ఏ ఆటగాడూ తన అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వలేడని ఆవేదన వ్యక్తం చేశారు.

కమ్యూనికేషన్ లోపం..

సెలక్టర్లు రోహిత్ శర్మను పక్కన పెట్టాలనుకుంటే, ఆ విషయాన్ని ముందే చెప్పి ఉండాల్సిందని అశ్విన్ అభిప్రాయపడ్డారు. 2025లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసిన వెంటనే రోహిత్‌తో మాట్లాడి ఉంటే బాగుండేదన్నారు. ప్రపంచకప్ ముంగిట, 2026లో వన్డే సిరీస్ మధ్యలో రోహిత్ శర్మకు ఈ సమాచారం ఇవ్వడం పద్ధతి కాదని దుయ్యబట్టారు. వన్డేల్లో అద్భుతమైన రికార్డు ఉన్న ఆటగాడికి కనీస గౌరవం ఇవ్వకుండా, ఇలాంటి కీలక సమయంలో మానసిక వేదనకు గురిచేయడం బోర్డు చేసిన పెద్ద తప్పిదమని అశ్విన్ సెలక్షన్ కమిటీ, కోచ్ గౌతమ్ గంభీర్ నేతృత్వంలోని మేనేజ్‌మెంట్‌ను నిలదీశారు.

జైస్వాల్ కోసం ‘హిట్‌మ్యాన్’ బలి?

నివేదికల ప్రకారం, సెలక్షన్ కమిటీ యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌ను పూర్తి స్థాయిలో వన్డేల్లోకి తీసుకురావడానికి మొగ్గు చూపుతోంది. జైస్వాల్ వన్డేల్లో 70కి పైగా సగటుతో రాణిస్తూ, ఇటీవల అఫ్గానిస్తాన్‌పై మ్యాచ్ విన్నింగ్ సెంచరీతో అదరగొట్టాడు. ఈ నేపథ్యంలోనే 39 ఏళ్ల రోహిత్ శర్మను జట్టు నుంచి తప్పించాలని బీసీసీఐ నిర్ణయించినట్లు తెలుస్తోంది. కేవలం ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ప్రస్తుత వన్డే సిరీస్‌లోని మొదటి రెండు మ్యాచ్‌లలో రోహిత్ తక్కువ పరుగులు (37 పరుగులు) చేశాడనే కారణంతోనే ఇంతటి కఠినమైన నిర్ణయం తీసుకోవడం క్రీడా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఛాంపియన్స్ ట్రోఫీ హీరోను మరువొచ్చా?

కేవలం ఒకటిన్నర సంవత్సరం క్రితమే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ (UAE) వేదికగా జరిగిన 2025 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో రోహిత్ శర్మ భారత జట్టును విజేతగా నిలిపారు. ఫైనల్ మ్యాచ్‌లో అద్భుత ఇన్నింగ్స్ ఆడి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డును కూడా అందుకున్నారు. ఆ తర్వాత ఆస్ట్రేలియా పర్యటనలో సెంచరీ బాదడంతో పాటు, స్వదేశంలో దక్షిణాఫ్రికాపై రెండు అర్ధశతకాలు సాధించి అద్భుతమైన ఫామ్‌ను కనబరిచారు. అటువంటి రికార్డు ఉన్న రోహిత్ శర్మకు, జూలై 19 ఆదివారం నాడు లార్డ్స్ మైదానంలో ఇంగ్లాండ్‌తో జరగబోయే మ్యాచ్ే ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్ కానుండటం నిజంగా క్రికెట్ అభిమానులకు జీర్ణించుకోలేని విషయమే.

క్రికెట్ ప్రపంచంలో తనదైన శైలితో రారాజుగా వెలిగిన రోహిత్ శర్మ కెరీర్ ముగింపు ఇలా వివాదాలు, అవమానాల మధ్య జరగడం అత్యంత దురదృష్టకరం. రవిచంద్రన్ అశ్విన్ లాంటి సీనియర్ ఆటగాడు బోర్డుపై తిరుగుబాటు జెండా ఎగరేయడం, భారత డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్న అసంతృప్తిని బయటపెట్టింది. బోర్డు వ్యూహాలు ఎలా ఉన్నప్పటికీ, లార్డ్స్ మైదానంలో తన ఆఖరి ఇన్నింగ్స్ ఆడబోతున్న 'హిట్‌మ్యాన్' మరొకసారి తన బ్యాట్‌తో గర్జించి, సగర్వంగా వీడ్కోలు పలకాలని క్రికెట్ ప్రపంచం ఆకాంక్షిస్తోంది.

Venkat

Venkat

2013లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌, పలు పత్రికల్లో 13 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాస్తుంటాను. స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాస్తుంటాను.

Next Story