Asian Games 2026: హర్మన్‌ప్రీత్‌కే మరోసారి బాధ్యతలు.. ఆసియా గేమ్స్‌కు భారత మహిళల జట్టు ఇదే!

Asian Games 2026: ఆసియా క్రీడల కోసం బీసీసీఐ)భారత మహిళల క్రికెట్ జట్టును ప్రకటించింది.

Rishvik
Published on: 30 Jun 2026 8:03 PM IST
Asian Games 2026
X

Asian Games 2026: హర్మన్‌ప్రీత్‌కే మరోసారి బాధ్యతలు.. ఆసియా గేమ్స్‌కు భారత మహిళల జట్టు ఇదే!

Asian Games 2026: 2026 ఆసియా క్రీడల కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారత మహిళల క్రికెట్ జట్టును మంగళవారం ప్రకటించింది. మహిళల టీ20 ప్రపంచకప్‌ 2026లో నిరాశాజనక ప్రదర్శన చేసినప్పటికీ.. హర్మన్‌ప్రీత్ కౌర్‌పైనే బీసీసీఐ సెలెక్టర్లు మరోసారి నమ్మకం ఉంచారు. హర్మన్‌ప్రీత్ జట్టు కెప్టెన్‌గా ఉండగా.. స్టార్ ఓపెనర్ స్మృతి మంధానను వైస్ కెప్టెన్‌గా సెలెక్టర్లు కొనసాగించారు.

భారత మహిళల జట్టు డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఈ టోర్నీలో బరిలోకి దిగనుంది. 2023లో చైనాలోని హాంగ్‌జౌలో జరిగిన ఆసియా క్రీడల్లో భారత్ స్వర్ణ పతకం సాధించి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు జపాన్‌లోని ఐచి-నగోయా వేదికగా సెప్టెంబర్ మాసంలో జరిగే ఆసియా క్రీడల్లోటైటిల్ నిలబెట్టుకోవాలనే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. ప్రపంచకప్ జట్టులో ఒకే ఒక్క మార్పు చోటుచేసుకుంది. వికెట్ కీపర్ బ్యాటర్ యాస్తిక భాటియాను జట్టు నుంచి తప్పించగా.. ఆమె స్థానంలో యువ వికెట్ కీపర్ జి. కమలినికి అవకాశం కల్పించారు.

మరోవైపు గాయంతో మహిళల టీ20 ప్రపంచకప్ మధ్యలోనే టోర్నీ నుంచి తప్పుకున్న శ్రేయాంక పాటిల్‌కు భారత జట్టులో స్థానం దక్కింది. అయితే ఆమె తుది ఎంపిక పూర్తిగా ఫిట్‌నెస్ క్లియరెన్స్‌పై ఆధారపడి ఉంటుందని బీసీసీఐ స్పష్టం చేసింది. బ్యాటింగ్ విభాగంలో హర్మన్‌ప్రీత్ కౌర్‌, స్మృతి మంధాన, షెఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ ఎంపికయ్యారు. బౌలింగ్ బాధ్యతలను దీప్తి శర్మ, రేణుకా ఠాకూర్, శ్రీ చరణి, అరుంధతి రెడ్డి, నందిని శర్మలు మోయనున్నారు.

'2026 సెప్టెంబర్‌లో జపాన్‌లోని ఐచి-నగోయాలో జరిగే ఆసియా క్రీడల కోసం మహిళల ఎంపిక కమిటీ భారత జట్టును ఎంపిక చేసింది. గత ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం సాధించిన భారత మహిళల జట్టు డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఈ టోర్నీలో పాల్గొంటుంది' అని బీసీసీఐ ప్రకటన విడుదల చేసింది.

2026 ఆసియా క్రీడల కోసం భారత మహిళల జట్టు:

హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షెఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, రిచా ఘోష్ (వికెట్ కీపర్), జి. కమలిని (వికెట్ కీపర్), భారతి ఫుల్మాలి, శ్రీ చరణి, రేణుకా ఠాకూర్, క్రాంతి గౌడ్, అరుంధతి రెడ్డి, శ్రేయాంక పాటిల్, రాధా యాదవ్, నందిని శర్మ.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story