ఆగస్టులో క్రీడల సందడి.. హాకీ వరల్డ్ కప్, యూఎస్ ఓపెన్, భారత్-శ్రీలంక సిరీస్ సహా మరెన్నో టోర్నీలు!

August 2026 Sports Calendar: August 2026 Sports Calendar. 2026 కామన్వెల్త్ గేమ్స్ ముగింపు పోటీలతో ప్రారంభమయ్యే ఆగస్టు నెల.. మెగా టోర్నీలతో క్రీడా క్రీడాభిమానులను అలరించనుంది.

Rishvik
Published on: 1 Aug 2026 5:08 PM IST
August 2026 Sports Calendar
X

ఆగస్టులో క్రీడల సందడి.. హాకీ వరల్డ్ కప్, యూఎస్ ఓపెన్, భారత్-శ్రీలంక సిరీస్ సహా మరెన్నో టోర్నీలు!

August 2026 Sports Calendar: ప్రపంచ క్రీడాభిమానులకు ఆగస్టు 2026 మాసం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. 2026 కామన్వెల్త్ గేమ్స్ ముగింపు పోటీలతో ప్రారంభమయ్యే ఈ నెల.. మెగా టోర్నీలతో క్రీడా క్రీడాభిమానులను అలరించనుంది. హాకీ ప్రపంచ కప్, యూరోపియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌ షిప్, ప్రీమియర్ లీగ్ ఫుట్‌బాల్ సీజన్, యూఎస్ ఓపెన్ టెన్నిస్, భారత్-శ్రీలంక టెస్ట్ సిరీస్ సహా మరెన్నో టోర్నీలు వరుసగా జరగనున్నాయి. పలు దేశాల్లో జరిగే ఈ టోర్నీలపై ప్రపంచవ్యాప్తంగా క్రీడాభిమానుల దృష్టి నెలకొంది.

స్కాట్లాండ్‌లోని గ్లాస్గో వేదికగా జూలై 23న ఆరంభమైన కామన్వెల్త్ గేమ్స్ ఆగస్టు 2 వరకు జరగనున్నాయి. టోర్నీ చివరి దశకు చేరుకోవడంతో పతకాల కోసం పోటీ పడుతున్న అథ్లెట్ల ప్రదర్శనలు అభిమానులను అలరిస్తున్నాయి. పతకాల వేటలో భారత్ అదరగొడుతున్న విషయం తెలిసిందే. ఆగస్టు 10 నుంచి 16 వరకు ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్‌లో యూరోపియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌ షిప్ జరగనుంది. ఆగస్టు 14 నుంచి 30 వరకు బెల్జియం, నెదర్లాండ్స్ సంయుక్తంగా పురుషుల, మహిళల ఎఫ్‌ఐహెచ్ హాకీ ప్రపంచ కప్‌కు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఆగస్టు 21 నుంచి సెప్టెంబర్ 3 వరకు ఇటలీలోని టరాంటోలో మెడిటరేనియన్ గేమ్స్ జరగనున్నాయి.

ఆగస్టు 12న ఆస్ట్రియాలో యూఈఎఫ్ఏ ఫుట్‌బాల్ సూపర్ కప్ మ్యాచ్ జరగనుంది. ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన లీగ్‌లలో ఒకటైన ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్ 2026-27 సీజన్ ఆగస్టు 22న ప్రారంభం కానుంది. కొత్త సీజన్‌లో అగ్ర జట్ల పోరును అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మోటార్ స్పోర్ట్స్‌ ఈవెంట్లు అభిమానులను అలరించనున్నాయి. ఆగస్టు 9న బ్రిటిష్ మోటోజీపీ సిల్వర్‌స్టోన్‌లో జరుగుతుండగా.. ఆగస్టు 15న లండన్ ఈ-ప్రి ఫార్ములా ఈ రేస్ జరగనుంది. ఆగస్టు 21 నుంచి 23 వరకు నెదర్లాండ్స్‌లోని జాండ్వోర్ట్‌లో ఫార్ములా-1 డచ్ గ్రాండ్ ప్రీ జరగనుంది. ఆగస్టు 22 నుంచి సెప్టెంబర్ 13 వరకు స్పెయిన్‌లో ప్రతిష్టాత్మక వుయెల్టా ఎ ఎస్పానా సైక్లింగ్ గ్రాండ్ టూర్ కొనసాగనుంది.

క్రికెట్, టెన్నిస్, గోల్ఫ్ మ్యాచ్‌లు కూడా అభిమానులను అలరించనున్నాయి. ఆగస్టు 15–19 మధ్య గాలే అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో భారత్-శ్రీలంక జట్ల మధ్య తొలి టెస్టు జరగనుంది. 2వ టెస్ట్ ఆగస్టు 23–27 మధ్య సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా జరగనుంది. రెండు టెస్టులు ఉదయం 10 గంటలకు ఆరంభం అవుతాయి. ఆగస్టు 19 నుంచి 23 వరకు ఇంగ్లండ్-పాకిస్థాన్ మధ్య తొలి టెస్టు హెడ్డింగ్లీలో జరగనుండగా.. ఆగస్టు 27 నుంచి 31 వరకు లార్డ్స్‌లో రెండో టెస్టు జరగనుంది. గోల్ఫ్‌లో ఆగస్టు 27 నుంచి 30 వరకు అమెరికాలోని అట్లాంటాలో పీజీఏ టూర్ ఛాంపియన్‌షిప్ జరగనుంది. ప్రతిష్టాత్మక యూఎస్ ఓపెన్ ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 13 వరకు న్యూయార్క్‌లో షెడ్యూల్ అయి ఉంది.

ఆగస్టు 2026లో ప్రపంచవ్యాప్తంగా జరిగే ఈ మెగా టోర్నీలు క్రీడాభిమానులకు వినోదంతో పాటు ఉత్కంఠభరిత పోటీలను అందించనున్నాయి. హాకీ, అథ్లెటిక్స్, ఫుట్‌బాల్, క్రికెట్, టెన్నిస్, మోటార్ స్పోర్ట్స్, సైక్లింగ్ వంటి విభిన్న క్రీడల్లో ప్రపంచ అత్యుత్తమ ఆటగాళ్లు తమ ప్రతిభను చాటుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈ టోర్నీల కోసం ఫాన్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story