Australia Cricket: వన్డే చరిత్రలోనే చెత్త రికార్డు.. బంగ్లాదేశ్ చేతిలో ఆస్ట్రేలియాకు ఘోర అవమానం!

Australia Cricket: ఆస్ట్రేలియా జట్టు చరిత్రలోనే అత్యంత అవమానకరమైన ఆరంభాన్ని నమోదు చేసింది.

Rishvik
Published on: 11 Jun 2026 6:18 PM IST
Australia Cricket
X

Australia Cricket: వన్డే చరిత్రలోనే చెత్త రికార్డు.. బంగ్లాదేశ్ చేతిలో ఆస్ట్రేలియాకు ఘోర అవమానం!

Australia Cricket: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో ఆస్ట్రేలియా జట్టు చరిత్రలోనే అత్యంత అవమానకరమైన ఆరంభాన్ని నమోదు చేసింది. ఢాకాలోని షేర్ బంగ్లా నేషనల్ స్టేడియంలో గురువారం జరిగిన రెండో వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. కేవలం రెండు ఓవర్లలోనే ఒక్క పరుగూ చేయకుండా మూడు వికెట్లు కోల్పోయింది. ఈ క్రమంలో 55 ఏళ్ల వన్డే చరిత్రలో ఎన్నడూ లేని చెత్త రికార్డును ఖాతాలో వేసుకుంది.

నాలుగో బంతికే వికెట్:

రెండో వన్డేలో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ జోష్ ఇంగ్లిస్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే ఆ నిర్ణయం ఎంత తప్పో కాపేపటికే అర్థమైంది. మొదటి ఓవర్లో నాలుగో బంతికే బంగ్లాదేశ్ పేసర్ టాస్కిన్ అహ్మద్.. ఓపెనర్ మాథ్యూ షార్ట్‌ను బౌల్డ్ చేసి ఆసీస్‌కు తొలి షాక్ ఇచ్చాడు. ముస్తాఫిజుర్ రహ్మాన్ తదుపరి ఓవర్‌లో వరుసగా కూపర్ కానోలీ, మ్యాట్ రెన్‌షా వికెట్లను పడగొట్టాడు. ఇద్దరూ ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరడంతో ఆస్ట్రేలియా స్కోరు 0/3గా నమోదైంది.

55 ఏళ్ల వన్డే చరిత్రలోనే చెత్త ఆరంభం:

1971లో వన్డే క్రికెట్ ప్రారంభమైనప్పటి నుంచి ఆస్ట్రేలియా జట్టు ఒక్క పరుగూ చేయకుండా తొలి మూడు వికెట్లు కోల్పోవడం ఇదే తొలిసారి. వన్డే చరిత్రలో ఏ జట్టు అయినా 0/3 స్కోరుకు పడిపోవడం ఇది కేవలం నాలుగోసారి మాత్రమే కావడం విశేషం. ప్రపంచ క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన జట్లలో ఒకటైన ఆస్ట్రేలియా.. ఇలాంటి చెత్త రికార్డును నమోదు చేయడం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది.

చరిత్ర సృష్టించే దిశగా బంగ్లాదేశ్:

ఈ సిరీస్ తొలి వన్డేలో బంగ్లాదేశ్ డక్‌వర్త్-లూయిస్ విధానం ప్రకారం 86 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇప్పుడు రెండో మ్యాచ్‌లో కూడా బలమైన ఆధిపత్యం కనబరుస్తూ.. సిరీస్ కైవసం చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఆస్ట్రేలియాపై బంగ్లాదేశ్ ఇప్పటివరకు ఒక్కసారి కూడా ద్వైపాక్షిక వన్డే సిరీస్ గెలవలేదు. ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే.. ఆసీస్‌పై తొలి వన్డే సిరీస్ విజయాన్ని నమోదు చేసి చరిత్ర సృష్టించనుంది.

స్టార్ బౌలర్ల గైర్హాజరీ ప్రభావం:

ఈ సిరీస్‌కు ఆస్ట్రేలియా పూర్తి స్థాయి జట్టుతో బరిలోకి దిగలేదు. ప్రధాన పేసర్లు ప్యాట్ కమిన్స్, జోష్ హేజిల్‌వుడ్, మిచెల్ స్టార్క్ జట్టుకు దూరంగా ఉండటంతో.. బౌలింగ్ విభాగం బలహీనంగా ఉంది. రెండో వన్డే కోసం లియామ్ స్కాట్ స్థానంలో ఫాస్ట్ బౌలర్ రైలీ మెరెడిత్‌ను జట్టులోకి వచ్చాడు. టాస్ సందర్భంగా జోష్ ఇంగ్లిస్ మాట్లాడుతూ.. 'మూడు విభాగాల్లో మెరుగుపడాల్సిన అవసరం ఉంది. కొద్దిపాటి తప్పిదాలే మ్యాచ్ ఫలితాన్ని మార్చుతున్నాయి. అందుకే రైలీ మెరెడిత్‌ను జట్టులోకి తీసుకొచ్చాం' అని చెప్పాడు.

ఆసీస్ తక్కువ స్కోరుకే పరిమితం:

ఈ మ్యాచులో బంగ్లా బౌలర్ల దెబ్బకు ఆసీస్ తక్కువ స్కోరుకే పరిమితం అయింది. వర్షం కారణంగా 42 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచులో ఆసీస్ 8 వికెట్లకు 187 రన్స్ చేసింది. మార్నస్ లబుషేన్ (55), జేవియర్ బార్ట్‌లెట్ (52) హాఫ్ సెంచరీలు చేశారు. బంగ్లా పేసర్లు టాస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రహ్మాన్ తలో మూడు వికెట్స్ పడగొట్టారు. ఛేదనలో బంగ్లా 12 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 72 రన్స్ చేసింది. బంగ్లా ఇంకా 120 రన్స్ చేయాల్సి ఉంది. సౌమ్య సర్కార్ (34), నజ్ముల్ హుస్సేన్ శాంటో (33) క్రీజులో ఉన్నారు. ఈ మ్యాచ్ ఫలితం బంగ్లాదేశ్‌కు చారిత్రాత్మక సిరీస్ విజయాన్ని అందిస్తుందా లేదా అన్నది ఇప్పుడు క్రికెట్ అభిమానుల్లో ఉత్కంఠ రేపుతోంది.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story