IPL 2026 : తొమ్మిదో ఇన్నింగ్స్‌లో కానీ బాదుడు మొదలవ్వలే.. ఎట్టకేలకు ఫామ్‎లోకి వచ్చిన ఢిల్లీ కెప్టెన్

IPL 2026 : ఐపీఎల్ 2026లో ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ ఎట్టకేలకు ఫామ్‌లోకి వచ్చాడు. 9 ఇన్నింగ్స్‌ల నిరీక్షణ తర్వాత తన మొదటి సిక్సర్ బాది, 56 పరుగులతో జట్టును గెలిపించాడు.

CR Reddy
Published on: 12 May 2026 6:09 AM IST
Axar Patel
X

Axar Patel

IPL 2026 : ఐపీఎల్ అంటేనే సిక్సర్లు, ఫోర్ల విందు. క్రీజులోకి వచ్చిన ఏ బ్యాటర్ అయినా నాలుగైదు బంతులు ఆడాడంటే చాలు.. ఏదో ఒక సమయంలో బంతిని స్టేడియం దాటించేస్తుంటాడు. ముఖ్యంగా ఈ 2026 సీజన్‌లో అయితే సిక్సర్లు వర్షంలా కురుస్తున్నాయి. కానీ, వీరందరికీ భిన్నంగా ఒక టీమ్ కెప్టెన్ మాత్రం తన మొదటి సిక్సర్ కొట్టడానికి ఏకంగా 9 ఇన్నింగ్స్‌ల వరకు వేచి చూడాల్సి వచ్చింది. ఆ కెప్టెన్ మరెవరో కాదు.. ఢిల్లీ క్యాపిటల్స్ సారథి అక్షర్ పటేల్. ఎట్టకేలకు పంజాబ్ కింగ్స్‌తో జరిగిన కీలక పోరులో అక్షర్ తన సిక్సర్ల కరువును తీర్చుకోవడమే కాకుండా, జట్టును విజయతీరాలకు చేర్చాడు.

ప్రస్తుత సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ప్రయాణం ఆటుపోట్లుగా సాగుతోంది. జట్టు పగ్గాలు చేపట్టిన అక్షర్ పటేల్‌కు వ్యక్తిగతంగా కూడా ఇది చాలా గడ్డు కాలం. ఒక ఆల్‌రౌండర్‌గా జట్టులో నాలుగో లేదా ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తున్నప్పటికీ, గత ఎనిమిది ఇన్నింగ్స్‌లలో ఆయన ప్రభావం చూపలేకపోయాడు. అటు కెప్టెన్‌గా, ఇటు ఆటగాడిగా విఫలమవ్వడం జట్టు ప్రదర్శనపై కూడా తీవ్ర ప్రభావం చూపింది. పంజాబ్ మ్యాచ్‌కు ముందు వరకు ఆయన ఆడిన 8 ఇన్నింగ్స్‌లలో కేవలం 44 పరుగులు మాత్రమే చేయగలిగాడంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

అయితే, పంజాబ్ కింగ్స్‌తో జరిగిన డూ ఆర్ డై మ్యాచ్ అక్షర్ పటేల్‌లోని అసలైన బ్యాటర్‌ను బయటకు తెచ్చింది. 211 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఢిల్లీ 33 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్నప్పుడు అక్షర్ క్రీజులోకి వచ్చాడు. ఆశ్చర్యకరంగా, ఈ సీజన్‌లో తన 61వ బంతిని ఎదుర్కొన్నప్పుడు అక్షర్ మొదటి సిక్సర్‌ను బాదాడు. ఒకసారి ఖాతా తెరిచిన తర్వాత అక్షర్ ఆగలేదు. కేవలం 28 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు.

మొత్తంగా 30 బంతులు ఆడిన అక్షర్ పటేల్.. 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 56 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. చిత్రం ఏమిటంటే, గడిచిన ఎనిమిది ఇన్నింగ్స్‌లలో కలిపి చేసిన పరుగుల కంటే, ఈ ఒక్క మ్యాచ్‌లోనే ఆయన ఎక్కువ పరుగులు సాధించడం విశేషం. ఈ అద్భుత ఇన్నింగ్స్‌తో అక్షర్ తనపై వస్తున్న విమర్శలకు చెక్ పెట్టడమే కాకుండా, ఢిల్లీ ప్లేఆఫ్ ఆశలను సజీవంగా ఉంచాడు. కెప్టెన్ ఫామ్‌లోకి రావడంతో ఢిల్లీ అభిమానులు ఇప్పుడు ఫుల్ ఖుషీగా ఉన్నారు.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story