Nayeem Hasan: స్టార్ క్రికెటర్‌పై దాడి.. ముగ్గురు పోలీసు అధికారుల సస్పెన్షన్!

Nayeem Hasan: స్టార్ క్రికెటర్‌పై దాడి చేసిన ముగ్గురు పోలీసు అధికారులు సస్పెండ్ అయ్యారు.

Rishvik
Published on: 14 Jun 2026 6:44 PM IST
Nayeem Hasan
X

Nayeem Hasan: స్టార్ క్రికెటర్‌పై దాడి.. ముగ్గురు పోలీసు అధికారుల సస్పెన్షన్!

Nayeem Hasan: బంగ్లాదేశ్ టెస్ట్ క్రికెటర్‌ మొహమ్మద్‌ నయీమ్ హసన్‌పై చట్టోగ్రామ్‌లో దాడి చేసిన ముగ్గురు పోలీసు అధికారులు సస్పెండ్ అయ్యారు. స్థానిక మీడియా కథనాల ప్రకారం.. కానిస్టేబుల్ మొహమ్మద్ రసెల్ చౌదరి, సబ్‌ఇన్‌స్పెక్టర్ మొహమ్మద్ షఫికుల్ ఇస్లాం భుయాన్‌తో పాటు పోలీసు ఆపరేషన్స్ మేనేజ్‌మెంట్ యూనిట్‌కు చెందిన మరో అధికారి సస్పెన్షన్‌కు గురయ్యారు. నయీమ్ హసన్‌ దాడి ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపేందుకు ముగ్గురు సభ్యులతో ప్రత్యేక కమిటీని కూడా పోలీసు ఉన్నతాధికారులు ఏర్పాటు చేశారు.

చట్టోగ్రామ్ మెట్రోపాలిటన్ పోలీస్ (సీఎంపీ) కమిషనర్ షౌకత్ అలీ శనివారం నయీమ్ హసన్ నివాసానికి వెళ్లారు. విచారణ అనంతరం ముగ్గురు పోలీసు అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ ఘటనపై ఇప్పటికే దర్యాప్తు ప్రారంభమైందని సీఎంపీ డిప్యూటీ కమిషనర్ అమీరుల్ ఇస్లాం తెలిపారు.

'ప్రాథమికంగా చూస్తే ఆపరేషన్ సమయంలో సంబంధిత అధికారులు విధి విధానాలను పాటించనట్లు కనిపిస్తోంది. నయీమ్‌కు న్యాయం జరిగేలా చూస్తాం. ఎవరైనా తప్పు చేసినట్లు తేలితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం' అని అమీరుల్ ఇస్లాం పేర్కొన్నారు.

శుక్రవారం అర్ధరాత్రి సమయంలో ఢాకా నుంచి చట్టోగ్రామ్‌కు నయీమ్ హసన్‌ వచ్చాడు. ఢాకా ప్రీమియర్ డివిజన్ క్రికెట్ లీగ్ మ్యాచ్‌లో తన జట్టు ప్రైమ్ బ్యాంక్ క్రికెట్ క్లబ్‌తో కలిసి ఆయన ప్రయాణించాడు. చిట్టగాంగ్ నుంచి ఆటోలో ఇంటికి బయలుదేరాడు. లాల్‌ఖాన్ బజార్ సమీపంలో తాను ప్రయాణిస్తున్న సిఎన్‌జీ ఆటోరిక్షాను పోలీసులు అడ్డగించి.. అతడితో దురుసుగా ప్రవర్తించారు.

హసన్‌ను ఆటో నుంచి బలవంతంగా దించి.. పోలీసు వాహనం ఎక్కించారు. గొంతు పట్టుకుని.. కారు ఎక్కు అంటూ వాహనంలోకి తీసుకెళ్లారు. బంగ్లా క్రికెటర్‌ను అని చెప్పినప్పటికీ.. అతడి మాట వినిపించుకోలేదు. హసన్‌పై ముగ్గురు పోలీసులు దౌర్జన్యంగా దాడి చేశాక ఖుల్షి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు.

ఈ సమయంలో అక్కడున్న కొంతమంది నయీమ్ హసన్‌ అంతర్జాతీయ క్రికెటర్ అని పోలీసులకు చెప్పినా.. వారు పట్టించుకోలేదని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించిచారు. స్టేషన్ వెళ్లాక బోర్డుకు సమాచారం అందించాడు. పోలీసులకు పై అధికారుల నుంచి ఫోన్ కాల్స్ రావడంతో వదిలేశారు. శనివారం తెల్లవారుజామున విడుదలైన నయీమ్ తన ఇంటికి చేరుకున్నారు.

ఈ ఘటన వెలుగులోకి రావడంతో బంగ్లాదేశ్ క్రికెట్ వర్గాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ప్రముఖ క్రికెటర్లు లిటన్ దాస్, ముష్ఫికుర్ రహీమ్ తదితరులు సోషల్ మీడియా వేదికగా స్పందించి నయీమ్‌కు మద్దతు ప్రకటించారు. క్రికెటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ బంగ్లాదేశ్, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) కూడా ఈ ఘటనను ఖండించాయి. బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి.

బీసీబీ అధ్యక్షుడు తమీమ్ ఇక్బాల్ కూడా నయీమ్ హసన్‌కు పూర్తి మద్దతు ప్రకటించారు. తమ ఆటగాళ్ల భద్రత విషయంలో రాజీ ఉండదని, అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ ఘటనపై విచారణ కొనసాగుతుండగా, నివేదిక వెలువడిన తర్వాత మరిన్ని చర్యలు తీసుకునే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story