149 ఏళ్ల టెస్ట్ చరిత్రలో అరుదైన ఫీట్.. డకౌట్ అవ్వని 5గరు.. లిస్ట్‌లో భారత ఆటగాడు..!
No ducks in Test career: టెస్టు క్రికెట్‌లో స్వింగ్ బంతులు, కఠినమైన పిచ్ పరిస్థితులను తట్టుకుని తొలి బంతి నుంచే నిలదొక్కుకోవడం బ్యాటర్లకు పెను సవాల్.
149 ఏళ్ల టెస్ట్ చరిత్రలో అరుదైన ఫీట్.. డకౌట్ అవ్వని 5గరు.. లిస్ట్‌లో భారత ఆటగాడు..!
No ducks in Test career: టెస్టు క్రికెట్‌లో స్వింగ్ బంతులు, కఠినమైన పిచ్ పరిస్థితులను తట్టుకుని తొలి బంతి నుంచే నిలదొక్కుకోవడం బ్యాటర్లకు పెను సవాల్. ఎంతోమంది స్టార్ ఆటగాళ్లు సున్నాకే వెనుదిరిగిన సందర్భాలున్నాయి. అయితే కెరీర్‌లో ఒక్కసారి కూడా డకౌట్ కాకుండా కెరీర్ ముగించిన అరుదైన ఘనత సాధించిన ఐదుగురు బ్యాటర్ల వివరాలు ఇప్పుడు పరిశీలిద్దాం.
అగ్రస్థానంలో జింబాబ్వే స్టార్ సీన్ విలియమ్స్..
దాదాపు 149 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన టెస్టు క్రికెట్‌లో 20కి పైగా మ్యాచ్‌లు ఆడి ఒక్కసారి కూడా డకౌట్ అవ్వని జాబితాలో సీన్ విలియమ్స్ (Sean Williams) అగ్రస్థానంలో నిలుస్తారు. 2013 నుంచి 2025 వరకు 12 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో జింబాబ్వే తరఫున 24 టెస్టులు ఆడిన ఈ స్టార్ ఆటగాడు 47 ఇన్నింగ్స్‌లలో బ్యాటింగ్ చేశాడు. 4 సార్లు నాటౌట్‌గా నిలిచి 45.25 సగటుతో 1946 పరుగులు సాధించాడు. ఇందులో 6 సెంచరీలు, 7 అర్ధసెంచరీలు ఉన్నాయి. 47 సార్లు మైదానంలోకి దిగినా ఆయన ఒక్కసారి కూడా సున్నాకే వెనుదిరగలేదు.
ఆస్ట్రేలియా దిగ్గజాలు జిమ్ బర్క్, రెజ్జీ డఫ్..
ఆస్ట్రేలియా క్రికెట్ చరిత్రలో జిమ్ బర్క్ (Jim Burke) 1951-1959 మధ్య 24 టెస్టుల్లో 44 ఇన్నింగ్స్‌లు ఆడి 1280 పరుగులు చేశారు. 3 సెంచరీలు బాదిన బర్క్ ఎన్నడూ డక్ కాలేదు. అదే జట్టుకు చెందిన రెజ్జీ డఫ్ (Reggie Duff) 1902-1905 మధ్య 22 మ్యాచ్‌ల్లోని 40 ఇన్నింగ్స్‌లలో 1317 పరుగులు చేసి, ఏనాడూ సున్నాకే పెవిలియన్ చేరకుండా కెరీర్ ముగించారు.
గర్వకారణంగా నిలిచిన భారత మాజీ క్రికెటర్ బ్రిజేష్ పటేల్..
భారత్ తరపున ఈ అరుదైన మైలురాయిని బ్రిజేష్ పటేల్ (Brijesh Patel) అందుకున్నారు. 1974 నుంచి 1977 మధ్య కాలంలో భారత్ తరఫున 21 టెస్టులు ఆడిన ఆయన 38 ఇన్నింగ్స్‌లలో బ్యాటింగ్ చేసి 972 పరుగులు చేశారు. ఇందులో ఒక అద్భుత సెంచరీ (నాటౌట్ 115), 5 అర్ధసెంచరీలు ఉన్నాయి. 38 ఇన్నింగ్స్‌లలోనూ ప్రతిసారీ ఖాతా తెరిచే మైదానాన్ని వీడారు. వీరితో పాటు వెస్టిండీస్ ఆటగాడు రాబర్ట్ క్రిస్టియాని (Robert Christiani) 22 టెస్టుల్లో 37 ఇన్నింగ్స్‌లు ఆడి ఒక్కసారి కూడా డకౌట్ అవ్వలేదు.
క్రీజులో అడుగుపెట్టిన ప్రతిసారీ అంకితభావంతో పోరాడి సున్నా లేకుండా టెస్ట్ కెరీర్ ముగించడం సాధారణ విషయం కాదు. బ్రిజేష్ పటేల్ సహా ఈ ఐదుగురు బ్యాటర్లు నెలకొల్పిన ఈ ప్రత్యేక రికార్డు క్రికెట్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది.




