India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్‌లో భారీ మార్పులు.. ఇద్దరు కోచ్‌లకు షాకిచ్చిన బీసీసీఐ!
BCCI Decides Not Renew Ryan ten Doeschate and T Dilip Contracts. భారత జట్టు సహాయక సిబ్బందిపై సమీక్ష చేపట్టిన బీసీసీఐ.. ఇద్దరు కోచ్‌లకు ఉద్వాసన పలికింది.
India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్‌లో భారీ మార్పులు.. ఇద్దరు కోచ్‌లకు షాకిచ్చిన బీసీసీఐ!
India Coaching Staff: ఇంగ్లండ్, ఐర్లాండ్ పర్యటనల్లో భారత జట్టు పేలవ ప్రదర్శన చేసిన విషయం తెలిసిందే. ఐర్లాండ్‌తో రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 2-0తో కోల్పోయింది. ఇంగ్లండ్‌పై ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 4-0తో చేజార్చుకుంది. అలానే ఇంగ్లీష్ గడ్డపై వన్డే సిరీస్‌ను 2-1తో ఓడిపోయింది. దాంతో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. వరుసగా రెండు టీ20 సిరీస్‌లు, ఒక వన్డే సిరీస్‌ను కోల్పోయిన నేపథ్యంలో జట్టు సహాయక సిబ్బందిపై సమీక్ష చేపట్టిన బీసీసీఐ.. ఇద్దరు కోచ్‌లకు ఉద్వాసన పలికింది. అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డస్కాటే, ఫీల్డింగ్ కోచ్ టీ దిలీప్‌ల కాంట్రాక్టులను పొడిగించబోమని స్పష్టం చేసింది. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా అధికారికంగా వెల్లడించారు.
'ర్యాన్ టెన్ డస్కాటే రెండేళ్ల కాంట్రాక్ట్ జూన్ 10తో ముగిసింది. ఫీల్డింగ్ కోచ్ టీ దిలీప్‌కు గతంలో ఒక ఏడాది పొడిగింపు ఇచ్చిన కాంట్రాక్ట్ కూడా జూన్ 8తో ముగిసింది. అయితే భారత జట్టు యూకే పర్యటన పూర్తయ్యే వరకు ఇద్దరినీ కొనసాగించాము. ఇకపై వారి ఒప్పందాలను పొడిగించే ఆలోచన బీసీసీఐకి లేదు. వారి రాజీనామాలను ఆమోదించడం అనే ప్రశ్న ఉండదు. ఎందుకంటే వారి కాంట్రాక్టుల గడువు ఇప్పటికే ముగిసిపోయింది. ఇప్పటికే వారిద్దరితో బీసీసీఐకి ఎలాంటి సంబంధం లేదు' అని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా స్పష్టం చేశారు.
టీమిండియా కొత్త ఫీల్డింగ్ కోచ్‌గా సుభోదీప్ ఘోష్ నియామకం దాదాపు ఖాయమైందనే వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై బీసీసీఐ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని దేవజిత్ సైకియా వెల్లడించారు. ప్రస్తుతం ఇద్దరు లేదా ముగ్గురు అభ్యర్థులతో చర్చలు కొనసాగుతున్నాయని, త్వరలోనే కొత్త ఫీల్డింగ్ కోచ్‌ను ప్రకటిస్తామని చెప్పారు. రాహుల్ ద్రవిడ్ నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)లో ఉన్న కాలం నుంచి వ్యవస్థలో పనిచేస్తున్న అసోంకు చెందిన సుభోదీప్ ఘోష్ ప్రస్తుతం ఈ పదవికి ప్రధాన పోటీదారుడిగా ఉన్నట్లు సమాచారం. చూడాలి మరి టెన్ డస్కాటే, దిలీప్‌ల స్థానాల్లో ఎవరు వస్తారో.
గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన సమయంలో ఆయన సిఫారసుతో ర్యాన్ టెన్ డస్కాటే భారత జట్టు కోచింగ్ స్టాఫ్‌లో చేరాడు. అయితే అతడికి మొదట హామీ ఇచ్చిన ఫీల్డింగ్ కోచ్ బాధ్యతలు కాకుండా.. గత రెండేళ్లుగా స్పష్టమైన బాధ్యతలు లేకుండా సహాయక కోచ్‌గా కొనసాగినట్లు తెలుస్తోంది. మరోవైపు టీ దిలీప్‌కు 2025 ఇంగ్లండ్ టెస్టు సిరీస్‌కు ముందు ఒక ఏడాది పొడిగింపు లభించినప్పటికీ.. అతని పనితీరుపై బీసీసీఐలో అసంతృప్తి నెలకొన్నట్లు సమాచారం. ముఖ్యంగా ఇటీవల యూకేలో జరిగిన వైట్‌బాల్ సిరీస్‌ల్లో భారత జట్టు ఫీల్డింగ్ తీవ్ర విమర్శలు ఎదుర్కొనడంతో.. మరోసారి అతడికి అవకాశం ఇవ్వకూడదని బోర్డు నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీంతో టీమిండియా కోచింగ్ విభాగంలో త్వరలోనే మరిన్ని మార్పులు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది.




