BCCI: టీమిండియాలో 97 కిలోల ప్లేయర్.. ఫిట్‌నెస్ లేక ఇప్పుడు ఇంట్లోనే.. బయటపడ్డ బీసీసీఐ లోపాలు!

Communication Gap In BCCI Exposed. భారత క్రికెట్‌లో ఫిట్‌నెస్ అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది.

Rishvik
Published on: 6 Aug 2026 6:46 PM IST
BCCI
X

BCCI: టీమిండియాలో 97 కిలోల ప్లేయర్.. ఫిట్‌నెస్ లేక ఇప్పుడు ఇంట్లోనే.. బయటపడ్డ బీసీసీఐ లోపాలు!

BCCI: భారత క్రికెట్‌లో ఫిట్‌నెస్ అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఇంగ్లండ్, ఐర్లాండ్ పర్యటనల్లో ఆశించిన ఫలితాలు రాకపోవడంతో పాటు వరుసగా ఆటగాళ్లు గాయాల బారిన పడుతున్న నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఫిట్‌నెస్ ప్రమాణాలపై ప్రత్యేక దృష్టి సారించింది. ముఖ్యంగా బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ), భారత జట్టు వైద్య బృందం మధ్య సరైన సమన్వయం లేకపోవడం వల్ల కొన్ని లోపాలు బయటపడినట్లు పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి.

గతేడాది సోహమ్ దేశాయ్ స్థానంలో అడ్రియన్ లె రౌక్స్ స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన అనంతరం యో-యో టెస్ట్ స్థానంలో బ్రాంకో టెస్ట్‌ను ప్రధాన ఫిట్‌నెస్ పరీక్షగా అమలు చేశారు. అయితే ఇప్పటి వరకు ఈ పరీక్షకు నిర్దిష్ట ప్రమాణాలు లేకపోవడంతో భారత ఆటగాళ్లకు వేర్వేరు లక్ష్యాలను నిర్దేశించినట్లు సమాచారం. ఇకపై బ్రాంకో టెస్ట్‌ను 5.15 నుంచి 5.20 నిమిషాల్లో పూర్తి చేసిన ఆటగాళ్లనే ఎంపికకు ఫిట్‌గా పరిగణించాలని బీసీసీఐ వైద్య బృందం నిర్ణయించినట్లు తెలుస్తోంది. గత ఏడాదిలో కొంతమంది సీనియర్ ఆటగాళ్లకు ఫిట్‌నెస్ పరీక్షల్లో సడలింపులు ఇచ్చినట్లు సమాచారం. అలాగే జట్టు అవసరాలను దృష్టిలో పెట్టుకుని హర్షిత్ రాణా, నితీశ్ కుమార్ రెడ్డి వంటి ఆటగాళ్లను కూడా పూర్తిస్థాయి ఫిట్‌నెస్ లేకపోయినా క్లియర్ చేసినట్లు బీసీసీఐ వర్గాలు తెలిపినట్లు జాతీయ మీడియా తమ కథనంలో పేర్కొంది.

ఫిట్‌నెస్ విధానాల్లో వచ్చిన మార్పులపై రెగ్యులర్ భారత ఆటగాళ్లకు సరైన సమాచారం అందలేదని కూడా ఆ నివేదిక వెల్లడించింది. ముఖ్యంగా శ్రీలంక పర్యటనకు ముందు మహ్మద్ సిరాజ్‌కు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ఉన్నపళంగా బ్రాంకో టెస్ట్ నిర్వహించడంతో అతడు ఆశ్చర్యానికి గురైయ్యాడట. కొత్త ఫిట్‌నెస్ డ్రిల్స్ గురించి ముందస్తు సమాచారం లేకపోవడం బీసీసీఐలోని కమ్యూనికేషన్ లోపాలను బయటపెట్టిందని సదరు నివేదిక పేర్కొంది. ఇక యువ పేసర్ హర్షిత్ రాణా వ్యవహారం ఇప్పుడు పెద్ద చర్చకు దారి తీసింది. ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టీ20లో కండరాల పట్టేయడంతో అతడు ఇబ్బంది పడ్డాడు. ఆ తర్వాత పరీక్షల్లో అతడు సుమారు 4 కిలోల అధిక బరువుతో ఉన్నట్లు భారత జట్టు మేనేజ్‌మెంట్ గుర్తించినట్లు సమాచారం.

ప్రస్తుతం హర్షిత్ రాణా బరువు 94 కిలోలకు తగ్గినట్లు తెలుస్తోంది. ఇకపై అతడి బరువు 96 కిలోలు దాటకూడదని సీఓఈ అధికారులు సూచించినట్లు తెలుస్తోంది. అంతకు తక్కువైనా పర్లేదని బీసీసీఐ చెప్పిందట. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఇంగ్లండ్ పర్యటనకు ఎంపిక చేసిన సమయంలో అతడి బరువు 97 కిలోలు ఉన్నప్పటికీ ఫిట్‌గా క్లియర్ చేసినట్లు నివేదిక వెల్లడించింది. జస్ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణా సహా పలువురు కీలక ఆటగాళ్లు ఇటీవల గాయాలతో జట్టుకు దూరమవడంతో.. ఇకపై ఫిట్‌నెస్ ప్రమాణాలను మరింత కఠినంగా అమలు చేయాలని బీసీసీఐ భావిస్తోంది. ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, జట్టు వైద్య బృందం సమన్వయంతో పనిచేసేలా కొత్త విధానాలను అమలు చేసే దిశగా బోర్డు అడుగులు వేస్తున్నట్లు సమాచారం.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story