BCCI: బీసీసీఐ బిగ్‌ డెసిషన్‌.. 2027 వన్డే ప్రపంచ కప్‌ వరకు అతడి సేవలు!

BCCI: బీసీసీఐ బిగ్‌ డెసిషన్‌ తీసుకున్నట్లు తెలుస్తోంది. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్‌ కాంట్రాక్టును ఎక్స్‌టెన్షన్ చేసేందుకు బీసీసీఐ సిద్ధంగా ఉందని నివేదికలు చెబుతున్నాయి.

Rishvik
Published on: 19 April 2026 6:03 PM IST
BCCI
X

BCCI: బీసీసీఐ బిగ్‌ డెసిషన్‌.. 2027 వన్డే ప్రపంచ కప్‌ వరకు అతడి సేవలు!

BCCI: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) బిగ్‌ డెసిషన్‌ తీసుకున్నట్లు తెలుస్తోంది. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్‌ కాంట్రాక్టును ఎక్స్‌టెన్షన్ చేసేందుకు బీసీసీఐ సిద్ధంగా ఉందని నివేదికలు చెబుతున్నాయి. బీసీసీఐ కాంట్రాక్టు ప్రకారం.. వచ్చే జూన్‌ నాటికి అగర్కర్‌ పదవీకాలం ముగియనుంది. అయితే దానిని వచ్చే ఏడాది వరకూ పొడిగించే అవకాశాలు ఉన్నాయని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. ఇందుకు కారణం.. బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్‌కు సూపర్ ట్రాక్ రికార్డు ఉండడమే. అంతేకాదు నిర్భయంగా నిర్ణయాలు తీసుకోవడం కూడా మరో కారణం.

అజిత్ అగర్కర్‌ నేతృత్వంలో భారత జట్టు అద్భుత విజయాలు సాధించింది. టీ20 వరల్డ్ కప్ 2024, ఛాంపియన్స్ ట్రోఫీ 2025, టీ20 వరల్డ్ కప్ 2026.. మూడు ఐసీసీ ట్రోఫీలు భారత్ ఖాతాలో చేరాయి. అంతేకాకుండా 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్‌కి కూడా జట్టును తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ విజయాల దృష్ట్యా బీసీసీఐ అగర్కర్‌ సేవలను కొనసాగించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇదే నిజమైతే అగర్కర్ జూన్ 2027 వరకు బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా కొనసాగనున్నాడు. అజిత్ సేవలను వన్డే ప్రపంచ కప్‌ 2027 వరకు వినియోగించుకోవాలని బీసీసీఐ భావిస్తోందని తెలుస్తోంది.

అజిత్ అగర్కర్ కాలంలో భారత జట్టులో ఎలాంటి వివాదాలు లేకుండా మార్పులు చోటుచేసుకున్నాయి. యువ ఆటగాళ్లకు అవకాశాలు కల్పిస్తూ ధైర్యవంతమైన నిర్ణయాలు తీసుకోవడంలో ఆయన ముందుండటంతో బోర్డు సంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఐపీఎల్ 2026 మ్యాచ్‌ల సమయంలో బీసీసీఐ అధికారులు అగర్కర్‌తో చర్చలు జరిపి అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది.

మరోవైపు టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ భవిష్యత్తుపై చర్చలు మొదలయ్యాయి. 2026 టీ20 వరల్డ్ కప్‌లో భారత్ విజయవంతంగా టైటిల్‌ను డిఫెండ్ చేసినప్పటికీ.. సూర్యకుమార్ బ్యాటింగ్ ఫామ్‌పై ప్రశ్నలు లేవుతున్నాయి. ముఖ్యంగా 2028 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్ దృష్ట్యా అతను జట్టులో కొనసాగుతాడా లేదా అన్నది సందేహంగా మారింది.

ఈ నేపథ్యంలో జూన్-జూలైలో ఇంగ్లాండ్, ఐర్లాండ్ పర్యటన సూర్యకుమార్‌కు కీలకంగా మారనుంది. ఈ టూర్‌లో అతని కెప్టెన్సీ కంటే బ్యాటింగ్ ప్రదర్శనపై ఎక్కువ దృష్టి ఉంటుంది. ఈ రెండు సిరీసుల్లో మంచి ఆటతీరు ప్రదర్శిస్తేనే 2028 వరకు జట్టులో ఉంటాడని బీసీసీఐ వర్గాలు పేర్కొంటున్నాయి. 2025లో సూర్య దారుణమైన ఫామ్‌లో ఉన్నాడు. అతని స్ట్రైక్ రేట్ 120 కంటే తక్కువగా పడిపోయింది. ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేదు. అయితే 2026లో నాలుగు అర్ధ శతకాలు సాధించాడు.

కానీ టీ20 వరల్డ్ కప్‌లో కీలక మ్యాచ్‌ల్లో మాత్రం పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్లపై తేలిపోయాడు. ఇప్పటికే జట్టులో టాప్ ఆర్డర్ బలంగా ఉండగా.. కొత్త ఆటగాళ్లు కూడా సిద్ధంగా ఉన్న నేపథ్యంలో సూర్యకుమార్ తన స్థానాన్ని నిలబెట్టుకోవాలంటే నిలకడైన ప్రదర్శన ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. కోచ్ గౌతమ్ గంభీర్ మాత్రం సూర్యకుమార్‌పై విశ్వాసం ఉంచుతున్నప్పటికీ.. అగర్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story