BCCI New Plan: 30 మంది ప్లేయర్స్, శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ.. బీసీసీఐది పెద్ద ప్లానింగే!

BCCI plans a 30-35 player pool to field two T20 teams. టీ20 ఫార్మాట్‌లో రెండు బలమైన జట్లను ఒకేసారి సిద్ధం చేసే ప్రణాళికను బీసీసీఐ రూపొందిస్తోందని సమాచారం. బిజీ షెడ్యూల్‌ దృష్ట్యా బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది.

Rishvik
Published on: 20 April 2026 5:52 PM IST
BCCI New Plan
X

BCCI New Plan

BCCI New Plan: భారత క్రికెట్‌లో ఎప్పటికప్పుడు యువ ఆటగాళ్లు వెలుగులోకి వస్తున్న విషయం తెలిసిందే. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ద్వారా ప్రతి ఏడాది ఒకరిద్దరు ప్లేయర్స్ క్రికెట్ ప్రపంచానికి పరిచయం అవుతున్నారు. సీనియర్లు, జూనియర్లతో కలిపి ప్రస్తుతం టీమిండియాలో ఒక్కొ చోటు కోసం తీవ్ర పోటీ ఉంది. ఒకేసారి రెండు భారత జట్లను ఆడించొచ్చు అని మాజీలు చాలాసార్లు అన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఇదే విషయాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. టీ20 ఫార్మాట్‌లో రెండు బలమైన జట్లను ఒకేసారి సిద్ధం చేసే ప్రణాళికను బీసీసీఐ రూపొందిస్తోందని సమాచారం.

ఈ ఏడాది బిజీ షెడ్యూల్‌ దృష్ట్యా బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. ఆసియా గేమ్స్, విండీస్‌తో సిరీస్‌ ఒకేసారి జరగనున్నాయి. దాంతో రెండు జట్లను రంగంలోకి దింపాల్సిన అవసరం బీసీసీఐకి ఏర్పడింది. అందుకే 30-35 మంది ఆటగాళ్లతో పెద్ద పూల్‌ను సిద్ధం చేయాలని బీసీసీఐ భావిస్తోంది. ఈ వ్యూహంలో భాగంగా త్వరలో జరగనున్న ఐర్లాండ్ సిరీస్ కీలకంగా మారనుంది. సాధారణంగా ఐర్లాండ్ లాంటి చిన్న జట్లపై 2-3 యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇస్తుంటుంది. అయితే ఈసారి మాత్రం ఎక్కువ మంది కుర్రాళ్లకు అవకాశాలు ఇచ్చి ప్రయోగాలు చేయాలని బీసీసీఐ సెలెక్టర్లు యోచిస్తున్నారు. సెప్టెంబర్‌లో ఆఫ్ఘానిస్తాన్‌తో జరగనున్న టీ20 సిరీస్ కూడా ఈ ప్రణాళికలో భాగమే.

30-35 మందితో కూడిన ఆటగాళ్ల జాబితా రెడీ అవుతోంది. ఐర్లాండ్‌, ఆఫ్ఘానిస్తాన్‌, ఇంగ్లాండ్‌ పర్యటనలకు ఈ లిస్ట్‌లో నుంచి ఎంపిక చేసే అవకాశం ఉంటుంది. బ్యాటింగ్ విభాగంలో వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్, ప్రియాంష్ ఆర్య, అంగ్క్రిష్ రఘువంశీ వంటి యువ ఆటగాళ్లు సెలెక్టర్ల దృష్టిని ఆకర్షిస్తున్నారు. అలాగే రజత్ పాటిదార్, ఆయుష్ బదోని కూడా జట్టులో చోటు దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి. ఆల్‌రౌండర్ల విభాగంలో శశాంక్ సింగ్, అనుకుల్ రాయ్ వంటి ఆటగాళ్లు ఉన్నారు. బౌలింగ్‌లో రవి బిష్ణోయ్, ఖలీల్ అహ్మద్, ప్రసిద్ధ్ కృష్ణ, కార్తీక్ త్యాగి వంటి పేసర్లు కూడా ఎంపికలో ఉన్నారు. వికెట్ కీపర్‌గా ధ్రువ్ జురెల్ ప్రధాన పోటీదారుడిగా ఉన్నాడు. ఓ జట్టుకు కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ నియమితుడయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. రెండో జట్టుకు సారథిగా సూర్య ఉంటాడు.

భవిష్యత్తులో ఒలింపిక్ గేమ్స్ 2028లో కూడా క్రికెట్ చేరనున్న నేపథ్యంలో బీసీసీఐ దీర్ఘకాలిక ప్రణాళికలతో ముందుకు సాగుతోంది. అంతర్జాతీయ షెడ్యూల్ ఎక్కువగా ఉండటంతో రెండు బలమైన టీ20 జట్లు అవసరం అనేది స్పష్టమవుతోంది. రెండు టీమ్‌లు బలంగా ఉండాలనే లక్ష్యంతో బీసీసీఐ ముందుగానే సన్నాహాలు చేస్తోందని తెలుస్తోంది. బీసీసీఐ నిర్ణయం యువ ఆటగాళ్లకు పెద్ద అవకాశంగా మారనుంది. ఇకపై బీసీసీఐ కేవలం 15 మంది ఆటగాళ్లను కాకుండా.. 35 మంది అత్యుత్తమ ఆటగాళ్లను సిద్ధం చేయడంపై దృష్టి పెట్టింది. ఇది భారత క్రికెట్ భవిష్యత్తుకు కీలక మలుపుగా మారే అవకాశం ఉంది.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story