BCCI: రోహిత్, కోహ్లీలు 2027 ప్రపంచకప్‌లో ఆడుతారా.. బీసీసీఐ సమాధానం ఇదే!
BCCI: సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ భవిష్యత్తుపై బీసీసీఐ కార్యదర్శి స్పందించారు.
BCCI: రోహిత్, కోహ్లీలు 2027 ప్రపంచకప్‌లో ఆడుతారా.. బీసీసీఐ సమాధానం ఇదే!
BCCI: భారత్-బంగ్లాదేశ్ మధ్య ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్‌లు మళ్లీ ప్రారంభమవుతాయా? అనే అంశంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కార్యదర్శి దేవజిత్ సైకియా కీలక వ్యాఖ్యలు చేశారు. బీసీసీఐ రాజకీయ అంశాల్లో జోక్యం చేసుకోదని స్పష్టం చేశారు. అలాగే 2027 వన్డే ప్రపంచకప్‌కు సంబంధించిన భారత జట్టు ప్రణాళికలు.. సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ భవిష్యత్తుపై కూడా స్పందించారు. అయితే ఈ అంశాలపై జరుగుతున్న చర్చలు పూర్తిగా బోర్డు అంతర్గత వ్యూహాత్మక ప్రక్రియలో భాగమని, వాటిని బహిరంగంగా వెల్లడించలేమని దేవజిత్ సైకియా స్పష్టం చేశారు.
2027 ప్రపంచకప్ ప్రణాళికలు బోర్డు అంతర్గత అంశం:
టీమిండియా 2027 ప్రపంచకప్ ప్రణాళికలపై దేవజిత్ సైకియా మీడియాతో మాట్లాడుతూ.. జట్టు భవిష్యత్తుకు సంబంధించిన నిర్ణయాలు ఎంపిక కమిటీ, క్రికెట్ కమిటీ, కోచింగ్ సిబ్బంది సహా సంబంధిత ఆటగాళ్లతో కలిసి తీసుకుంటామని చెప్పారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి సీనియర్ ఆటగాళ్లు 2027 ప్రపంచకప్‌లో ఆడతారా? అనే ప్రశ్నలకు ఆయన నేరుగా సమాధానం ఇవ్వలేదు. 'మా వద్ద అనుభవజ్ఞులైన నిపుణుల బృందం ఉంది. అందరితో మేము నిరంతరం చర్చలు జరుగుతుంటాయి. ఇవి వ్యూహాత్మక చర్చలు కాబట్టి బోర్డు గది దాటి బయటకు రావు. బీసీసీఐ ప్రణాళికలను ప్రజలకు చెప్పడం సముచితం కాదు' అని సైకియా పేర్కొన్నారు.
రోహిత్, కోహ్లీ భవిష్యత్తుపై సస్పెన్స్:
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరూ 2027 ప్రపంచకప్‌లో ఆడాలనే ఆసక్తి చూపుతున్నారు. అయినా సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇప్పటివరకు స్పష్టమైన హామీ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో వారి భవిష్యత్తుపై ఇంకా స్పష్టత రాలేదనే చెప్పాలి. అయితే జట్టు ప్రణాళికలపై అన్ని స్థాయిల్లో చర్చలు జరుగుతున్నాయని సైకియా వెల్లడించారు. రో-కోలు ఆడుతారనే అందరూ అనుకుంటున్నారు. ఇద్దరి అనుభవం జట్టుకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని క్రికెట్ నిపుణులు అంటున్నారు.
బంగ్లాదేశ్‌తో సిరీస్‌పై బీసీసీఐ స్పష్టమైన వైఖరి:
గత ఏడాది బంగ్లాదేశ్‌లో నెలకొన్న రాజకీయ అశాంతి కారణంగా భారత జట్టు వైట్‌బాల్ పర్యటన వాయిదా పడింది. ప్రస్తుతం అక్కడ ఎన్నికైన ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పాటు మాజీ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. దీంతో భారత్-బంగ్లాదేశ్ ద్వైపాక్షిక క్రికెట్ పునఃప్రారంభంపై చర్చలు మొదలయ్యాయి. ఈ అంశంపై స్పందించిన సైకియా.. బీసీసీఐ రాజకీయ అంశాల్లో జోక్యం చేసుకోదని, కేంద్ర ప్రభుత్వం రూపొందించే విధానాల ప్రకారమే నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ప్రభుత్వ నిర్ణయాలే కీలకం
'బీసీసీఐ ఒక క్రికెట్ నియంత్రణ సంస్థ మాత్రమే. ఇతర దేశాల్లో రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయన్నది మా పరిధిలోకి రాదు. భారత్ ప్రభుత్వం ద్వైపాక్షిక లేదా బహుళ దేశాల క్రీడా పోటీలకు సంబంధించి ఏ విధానాన్ని అనుసరిస్తుందో.. మేము అదే పాటిస్తాం. ఫుట్‌బాల్, అథ్లెటిక్స్ సహా ఇతర క్రీడా సమాఖ్యలు ఎలా వ్యవహరిస్తాయో మేము కూడా అదే విధంగా వ్యవహరిస్తాం' అని సైకియా తెలిపారు.
బంగ్లాదేశ్‌లో ఏ పార్టీ అధికారంలో ఉంది, ప్రభుత్వం ఎలా ఏర్పడింది వంటి విషయాలు బీసీసీఐకి సంబంధం లేదని సైకియా స్పష్టం చేశారు. 'మా పని క్రికెట్ నిర్వహించడం మాత్రమే. షెడ్యూల్ ప్రకారం విదేశీ పర్యటనలు ఉంటే, కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు వాటిని కొనసాగిస్తాం' అని పేర్కొన్నారు.




